Phalguna Masa Vishistata
(Importance of Pharguna Masa)
(Importance of Pharguna Masa)
శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శుభ గ్రహ
మాసాలు – వాటి ప్రత్యేకతలు
ఫాల్గుణ మాసం
త్వరలో ఫాల్గుణ మాసం ప్రారంభం కాబోతోంది. ఫాల్గుణ మాస విశిష్టతను గూర్చి తెలుసుకుందాము. సంవత్సరంలో చివరి మాసం ‘ఫాల్గుణం’. దీనికి చాలా ప్రాధాన్యత కలదు. జ్యోతిష సంబంధంగా గల ప్రత్యేకతలు మరియు ప్రకృతిలో సంభవించు మార్పులు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి తెలుసుకుందాము. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో చివరిదైన ఫాల్గుణ మాసం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్య పరంగా అత్యంత విశిష్టమైనది. వసంత ఋతువుకు నాంది పలికే మాసం ఇది. శిశిర ఋతువు ముగిసి, వసంత ఋతువుకు స్వాగతం పలికే ఈ మాసం ప్రకృతిలోనూ, మానవుల జీవనశైలిలోనూ మార్పులను సూచిస్తుంది. అట్టి అత్యంత విశేషమైన ఫాల్గుణ మాసం గూర్చి మరియు తత్సంబంధిత జ్యోతిష, వైద్య విజ్ఞాన శాస్త్రాల గూర్చి తెలుసుకుందాము.
1. ఫాల్గుణ మాస విశిష్టత (జ్యోతిష & సంహిత పరంగా):
నామ విశేషం & నక్షత్రం: పౌర్ణమి నాడు చన్ద్రుడు ఉత్తర ఫల్గుణి (లేదా పూర్వ ఫల్గుణి) నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి 'ఫాల్గుణము' అని పేరు వచ్చింది. ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి అధిపతి "అర్యముడు" (సూర్యుని రూపం). వేదాల ప్రకారం అర్యముడు లేదా అర్యమన్ వైదిక దేవతలలో ఒకరు మరియు ఆదిత్యులలో (సూర్య దేవుని సోదరులు) ఒకరు. కశ్యప ప్రజాపతి మరియు అదితిల పుత్రుడైన అర్యమన్, సూర్య భగవానునితో సంబంధం కలిగి ఉండి, ఆర్య పురుషులకు రక్షకుడిగా, ఆరోగ్యానికి, వైద్యానికి యజాతగా, అలాగే సత్యం, త్యాగం, ఒప్పందాలు మరియు స్నేహానికి అధిపతిగా పరిగణించబడతారు. అంతేకాదు సంపదను, మిత్రత్వాన్ని ప్రసాదించే దైవం.
మాసాధిపతి - గోవిందుడు: ద్వాదశ మాసాలలో ఈ మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు రూపమైన "గోవిందుడు". ద్వాదశ ఆదిత్యులలో 8వ వాడిన ‘విష్ణు’ దీనికి అధిపతి. అందుకే ఈ నెలలో విష్ణు ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది. అలాగే మహాభారతంలో అర్జునుడికి "ఫల్గుణుడు" అనే పేరు ఉండటం, అతను ఇన్ద్రుని కుమారుడవడం వల్ల కూడా ఈ మాసానికి విజయం చేకూర్చే శక్తి ఉందని ప్రతీతి. అందుకే ఈ మాసంలో చేసుకున్న ఒప్పందాలకు, కొత్తగా తలపెట్టిన పనులకు విజయం చేకూరుతుందని నానుడి. ఈ నెలలో జరుపు వివాహాలు, మరియు తలపెట్టిన ఇతర కార్యాలు విజయవంతంగా ముగుస్తాయని నానుడి.
సంహిత & ఋతు సంధి: ఇది సంవత్సరానికి చివరి మాసం. చలి తగ్గుముఖం పట్టి, ఎండలు మొదలయ్యే "ఋతు సంధి" కాలం (శిశిరం నుండి వసంతం వైపు). సంహిత గ్రంథాల ప్రకారం, ఈ సమయంలో శరీరంలో కఫ దోషం ప్రకోపించే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల (ముఖ్యంగా జల సంబంధిత వ్యాధుల పట్ల) జాగ్రత్త వహించాలని ఆయుర్వేదం మరియు ధర్మసింధువు వంటి గ్రంథాలు సూచిస్తాయి.
వాస్తు & ముహూర్తాలు: గృహారంభాలకు, వివాహాది శుభకార్యాలకు ఫాల్గుణ మాసం (గురు శుక్ర మౌఢ్యాలు లేనప్పుడు) శ్రేష్టమైనదిగా ముహూర్త చింతామణి వంటి గ్రంథాల్లో పేర్కొనబడింది.
2. ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన తిథులు & పండుగలు
ఈ మాసంలో వచ్చే పర్వదినాలు దైవారాధనతో పాటు ప్రకృతి ఆరాధనకు కూడా పెద్దపీట వేస్తాయి.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి (అమలక ఏకాదశి): దీనిని 'ఆమలక ఏకాదశి' అంటారు. 'ఆమలక' అంటే ఉసిరి. ఈ రోజు ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజిస్తారు. ఉసిరి చెట్టు కింద చేసే దానం, భోజనం అనంత కోటి పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణోక్తి. ఆరోగ్య రీత్యా కూడా వసంత ఋతువు ఆరంభంలో ఉసిరి వాడకం మంచిదని దీని అంతరార్థం.
ఫాల్గుణ పూర్ణిమ (హోలీ / కామదహనం / లక్ష్మీ జయంతి):
కామదహనం: శివుడు తన తపోభంగానికి కారణమైన మన్మథుడిని భస్మం చేసిన రోజుగా దీనిని జరుపుకుంటారు.
హోలీ: రంగుల పండుగగా వసంత ఋతువుకు స్వాగతం పలుకుతారు. అందుకే దీన్ని వసంతోత్సవం అని కూడా అంటారు.
లక్ష్మీ జయంతి: క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా ఉత్తర భారతదేశంలో ఈ రోజును విశేషంగా జరుపుకుంటారు.
జ్యోతిష్య రీత్యా ఈ రోజు చంద్రుడు పరిపూర్ణ కళలతో ఉంటాడు కాబట్టి చంద్ర ఆరాధన మనోబలాన్ని ఇస్తుంది.
ఫాల్గుణ బహుళ ఏకాదశి (పాపమోచని ఏకాదశి): పేరులో ఉన్నట్లే, ఇది తెలిసి తెలియక చేసిన పాపాలను హరించే ఏకాదశిగా ప్రసిద్ధి.
ఫాల్గుణ బహుళ అమావాస్య (సర్వ అమావాస్య): ఇది తెలుగు సంవత్సరానికి చివరి రోజు. మరుసటి రోజు చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది)తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. పితృ దేవతలకు తర్పణాలు వదలడానికి ఇది ముఖ్యమైన రోజు.
మీన సంక్రమణం: సూర్యుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించే కాలం ఈ మాసంలోనే వస్తుంది. ఇది పవిత్రమైన పుణ్యకాలం.
సంవత్సరాంతంలో వచ్చే ఈ మాసం, పాతవాటిని వదిలేసి (ఆకురాలు కాలం ముగింపు), కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి (ఉగాదికి) సన్నద్ధమవడానికి మానసికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని సిద్ధం చేస్తుంది. ఈ నెలలో శ్రీ మహావిష్ణు ఆరాధనలు మరియు చన్ద్ర ఆరాధనలు శుభ ఫలితాలను ఇస్తాయి.
శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు శ్రీ విష్ణు సహస్ర నామాన్ని ప్రతి నిత్యం వినడం వలన ‘రోగార్తో ముచ్యతే రోగాత్: రోగంతో బాధపడేవాడు రోగం నుండి విముక్తుడవుతాడు, బద్ధో ముచ్యేత బన్ధనాత్’ బంధకాలలో (కష్టాలలో) ఉన్నవాడు వాటి నుండి విముక్తుడవుతాడు, అంతేకాదు కర్మ బంధాల నుండి కూడా విముక్తుడౌతాడు. భయా న్ముచ్యేత భీతస్తు: భయంతో ఉన్నవాడు భయం నుండి విముక్తుడవుతాడు, అన్ని రకాలైన భయాలు దూరమౌతాయి. ముచ్యే తాపన్న ఆపదః: ఆపదలలో ఉన్నవాడు ఆపదల నుండి విముక్తుడవుతాడు.
చన్ద్రారాధన
జ్యోతిష శాస్త్ర రీత్యా, ఆధ్యాత్మిక రీత్యా చన్ద్రారాధన (చన్ద్రోపాసన) కు విశేష ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఫాల్గుణ పౌర్ణమి నాడు చేసే చన్ద్రారాధన మనస్సుకు, శరీరానికి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది.
1. జ్యోతిష, శాస్త్ర ప్రాముఖ్యత (మనోకారకుడు)
వేదం "చన్ద్రమా మనసో జాతః" (విరాట్ పురుషుని మనస్సు నుండి చన్ద్రుడు ఉద్భవించాడు) అని చెబుతోంది. జ్యోతిష శాస్త్రంలో చన్ద్రుడు "మనః కారకుడు". మన ఆలోచనలకు, భావోద్వేగాలకు, మానసిక ప్రశాంతతకు చన్ద్రుడే అధిపతి.
ఫాల్గుణ పౌర్ణమి విశేషం: ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు చన్ద్రుడు పూర్ణ ప్రకాశంతో, 16 కళలతో (షోడశ కళా పూర్ణుడు) ఉంటాడు. ఈ రోజున చన్ద్రుని కిరణాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయని (సోమ రసం) శాస్త్రం చెబుతుంది. ఇట్టి కిరణాలు ఎన్నో రకాలైన మానసిక వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయని కూడా అంటారు. లక్ష్మీ సోదరుడు: క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చన్ద్రుడు కూడా ఉద్భవించాడు. అందుకే చంద్రుడిని లక్ష్మీదేవికి సోదరుడిగా భావిస్తారు. ఫాల్గుణ పౌర్ణమి (లక్ష్మీ జయంతి) నాడు చన్ద్రుడిని ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. చంద్రుడికి మరియు శ్రీ లక్ష్మీ దేవికి గల అవినాభావ సంబంధాన్ని శ్రీ సూక్తం కూడా వివరిస్తుంది:
"చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ"
జాతవేదః (ఓ అగ్ని దేవా): 'జాతవేదస్' అంటే పుట్టిన ప్రాణులందరినీ తెలిసినవాడు (అగ్ని). యజ్ఞంలో హవిస్సులను దేవతలకు చేరవేసే వాహకుడు అగ్నిదేవుడు కాబట్టి, ఆయన్ని ప్రార్థిస్తున్నారు. మే (నా కొరకు): నా ఇంటికి లేదా నా వద్దకు. ఆవహ (తీసుకొని రమ్ము): ఆమెను ఆవాహన చేయుము (లేదా స్థిరంగా ఉంచుము). చన్ద్రాం (చన్ద్రుని వంటి కళ కలిగిన): ఆహ్లాదకరమైన, చల్లని కాంతిని ఇచ్చే తల్లి. హిరణ్మయీం (బంగారు వర్ణం కలిగిన): స్వర్ణమయమైన తేజస్సు కలిగిన. లక్ష్మీం: ఆ లక్ష్మీదేవిని.
ఇందులో 'చన్ద్రాం' అనే పద ప్రయోగం వెనుక లోతైన పరమార్థం ఉంది:
1. చన్ద్రాం - సోదర భావం & పుట్టుక: పురాణ రీత్యా, క్షీరసాగర మథనంలో చన్ద్రుడు మరియు లక్ష్మీదేవి ఇద్దరూ ఉద్భవించారు. అందుకే లక్ష్మీదేవిని "చన్ద్ర సహోదరి" అంటారు. చన్ద్రునిలో ఉండే అమృత తత్వం, ఆహ్లాదం లక్ష్మీదేవిలోనూ ఉంటాయి. "చన్ద్రాం" అంటే చంద్రుని వలె అందరినీ ఆకర్షించేది, మనసుకి ఆనందాన్ని (ఆహ్లాదాన్ని) కలిగించేది అని అర్థం.
2. మానసిక ప్రశాంతత:
కేవలం ధనం ఉంటే సరిపోదు, ఆ ధనాన్ని అనుభవించడానికి మానసిక ప్రశాంతత కావాలి. హిరణ్మయీం: భౌతిక సంపద. చన్ద్రాం: మానసిక శాంతి. సంపదతో పాటు మనశ్శాంతి గల వాడే నిజమైన లక్ష్మీ కటాక్షం పొందినవాడు. వేదం ఇక్కడ "బంగారం వంటి సంపదను, చన్ద్రుని వంటి చల్లని మనసును ఇచ్చే తల్లిని నా వద్దకు చేర్చు" అని అగ్నిని కోరుతోంది.
3. ఆయుర్వేద & పోషణ కోణం:
చన్ద్రుడు "రసాధిపతి". లక్ష్మీదేవి "ధన ధాన్య" స్వరూపిణి. జగత్తుకు "అన్నం" లక్ష్మీదేవి అయితే, ఆ అన్నంలో ఉండే "సారం/రుచి" చన్ద్రుడు. అందుకే ఆమెను "చన్ద్రాం" అని స్తుతించారు. ఆమె పోషకురాలు. స్త్రీలలో గర్భాధారణకు, పోషణకు చన్ద్ర బలం ఎంత అవసరమో, సంసారం నడవడానికి లక్ష్మీ కటాక్షం కూడా అంతే అవసరం.
సారాంశం:
"ఓ జాతవేదసుడా (అగ్ని దేవా)! చన్ద్రుని వలె చల్లని కాంతిని, ఆహ్లాదాన్ని కలుగజేయు, బంగారు వర్ణంతో ప్రకాశించే, లోకానికి పోషకురాలైన ఆ లక్ష్మీదేవిని నా కొరకు ఆవాహన చేయుము (నా ఇంట స్థిరంగా ఉంచుము)."
శ్రీమద్భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగం (15వ అధ్యాయం, 13వ శ్లోకం) లో శ్రీకృష్ణుడు చెప్పిన మాటను ఇక్కడ గుర్తుచేసుకోవడం సముచితం:
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||
"నేనే రస స్వరూపుడనైన చన్ద్రుడనై (సోముడనై) సకల ఔషధులను (వృక్షజాతిని) పోషిస్తున్నాను." అందువల్ల, చన్ద్రారాధన అంటే కేవలం గ్రహాన్ని పూజించడం మాత్రమే కాదు, ప్రకృతిలోని జీవశక్తిని (రసాన్ని, ఓజస్సును) ఆరాధించడమే అవుతుంది.
చన్ద్రారాధన – ఆచరణా విధి విధానం:
ప్రతి నిత్యం చన్ద్రోదయం పిదప ఇట్టి ఆరాధన చేయాలి ప్రధానంగా పౌర్ణమి రోజున సాయంత్రం చన్ద్రోదయం అయిన తర్వాత ఈ ఆరాధన చేయడం శ్రేయస్కరం.
చన్ద్ర దర్శనం & త్రాటకం: పౌర్ణమి చంద్రుని వైపు కాసేపు తదేకంగా చూడటం (చన్ద్ర త్రాటకం) వల్ల నేత్రాలకు చలువ, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అధిక రక్తపోటు (BP) నియంత్రణలో ఉండటానికి, ఒత్తిడి తగ్గడానికి ఇది దోహదపడుతుందని ఆయుర్వేద నిపుణులు కూడా అంగీకరిస్తారు. అంతేకాదు, శరీరంలో రక్తప్రసరణ సరియైన రీతిలో జరిగే విధంగా చేస్తుంది. గర్భిణీ స్త్రీలకూ గర్భానికి రక్షగా ఉంటుంది. ఉమ్మనీరును కాపాడుతుంది. సంతానాన్ని ఆశించే వారికి కూడా ఇది సత్ఫలితాలను ఇస్తుంది. ఏ కారణం చేతనైన గర్భాధారణలో ఆలస్యం అయినా అండ లేదా వీర్య కణాల చిక్కులు ఏవైనా ఉన్నా సత్ఫలితాలు లభిస్తాయి. చన్ద్రుడికి మరియు దీనికి గల సంబంధం కింద ఇవ్వబడింది.
అర్ఘ్య ప్రదానం: వెండి పాత్రలో (లేదా రాగి పాత్రలో) పాలు, నీళ్లు, తెల్లని పూలు, అక్షతలు వేసి చంద్రునికి అర్ఘ్యం వదలాలి.
మంత్రం: "ఓం సోమ సోమాయ నమః" లేదా "ఓం శ్రీం క్లీం సోమాయ నమః"
స్తోత్రం: "దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం | నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ ||" పఠించడం మంచిది. దీన్నే పురాణోక్తి మన్త్రం అని కూడా అంటారు. దీనికి వేదోక్త మన్త్రం కూడా కలదు. దాని వివరాలు కింది పారాలో (Paragraph) ఉన్నాయి. కాని వేద పారాయణం చేయలేని వారు, స్పష్టమైన ఉచ్ఛారణ లేని వారు, వాక్దోషం గల వారు వేదోక్త మన్త్రం పఠనానికి దూరంగా ఉండాలి. అక్షర మరియు ఉచ్ఛారణ దోషం వలన అర్థాలు మారిపోయి ప్రమాదం కలదు. అందుకే పైన ఇవ్వబడిన పురాణోక్త మన్త్రం పారాయణం చేసుకోవడం శ్రేష్టం.
నైవేద్యం: చంద్రునికి పాయసం (క్షీరాన్నం) ప్రీతికరమైన నైవేద్యం. ఆరుబయట వెన్నెలలో కాసేపు ఉంచిన పాలు లేదా పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆయుర్వేద రీత్యా పిత్త దోషాన్ని తగ్గిస్తుంది. ఇట్టి క్షీరాన్నం ప్రతి నిత్యం చన్ద్రోదయం పిదప కూడా నివేదించ వచ్చు.
వైద్య కోణం
ఆయుర్వేదంలో చన్ద్రుని "ఓషధీశుడు" (మందు మొక్కలకు అధిపతి) అంటారు. పౌర్ణమి రాత్రి వెన్నెలలో ఔషధ మొక్కలు తమ శక్తిని పుంజుకుంటాయని నమ్ముతారు. అందుకే కొన్ని రకాల ఆయుర్వేద ఓషధులను (ముఖ్యంగా రసాయనాలను) పౌర్ణమి నాడే సంగ్రహిస్తారు (ఓషధ సంగ్రహం).
చన్ద్రుడి వేదోక్త మన్త్రం మరియు దాని అర్థం:
పైన చెప్పబడిన రీతిలో చక్కని స్వరంతో పఠించే వారు మాత్రమే వేదోక్త మంత్రాన్ని పఠించాలి. "స్వరో హీనః స్వరతో వర్ణతో వా..." అన్నట్లుగా, వేద మన్త్రాలను స్వరయుక్తంగా, నియమబద్ధంగా ఉచ్ఛరించాలి. సామాన్యులకు ఆ నియమాలు పాటించడం కష్టం కాబట్టి, వారు సులభంగా ఉండే పురాణోక్త శ్లోకాలను పఠించడమే శ్రేయస్కరం. చన్ద్రుని మూల మన్త్రం ఋగ్వేదం లోనిది (1.91.16). ఇది చన్ద్రుని (సోముని) వృద్ధిని, పోషక శక్తిని ప్రార్థించే అద్భుతమైన మన్త్రం. దీని అర్థం ఇక్కడ సవివరంగా ఉంది:
మన్త్రం:
"ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృష్ణ్యమ్ |
భవా వాజస్య సంగథే ||"
పదవిభాగం & అర్థం:
సోమ (ఓ సోమదేవా / ఓ చన్ద్రుడా ): సంబోధన. ఆప్యాయస్వ (వృద్ధి చెందు / వర్ధిల్లు): నీవు వృద్ధి పొందుము (కళలతో నిండుగా ప్రకాశించుము అని అర్థం). ఇది చన్ద్రుని క్షీణ దశ (కృష్ణ పక్షం) నుండి శుక్ల పక్షం వైపు లేదా సంపూర్ణత్వం వైపు సాగే వృద్ధిని సూచిస్తుంది. తే (నీకు): నీకు. విశ్వతః (అన్ని వైపుల నుండి): సకల దిక్కుల నుండి, లేదా ప్రపంచమంతటి నుండి. వృష్ణ్యమ్ (వీర్యం / శక్తి / తేజస్సు): శక్తి లేదా సారం (Potency). సమేతు (చేరుగాక): వచ్చి చేరుగాక. (అంటే, ఓ చన్ద్రుడా! నీవు వృద్ధి పొందు, సకల దిక్కుల నుండి శక్తి నీలో కేంద్రీకృతం అగుగాక). వాజస్య (అన్నము యొక్క / బలము యొక్క): 'వాజ' అంటే అన్నం లేదా బలం అని వేద పరిభాష. సంగథే (కూడలిలో / కేంద్రంలో): సమూహంలో లేదా కేంద్ర స్థానంలో. భవ (ఉండుము / అగుము): నీవు ఉండుము.
తాత్పర్యం:
"ఓ సోమదేవా (చన్ద్రుడా)! నీవు (కళలతో) వృద్ధి పొందుము. సకల దిక్కుల నుండి ప్రాణశక్తి (వీర్యం/తేజస్సు) నీలో వచ్చి చేరాలి. అన్న సమృద్ధికి, బలసంపదకు నీవు కేంద్ర బిందువుగా (నాయకుడిగా) నిలవాలి."
విశేషార్థం:
గీతలో కృష్ణుడు చెప్పిన "పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః" (నేను చన్దృడనై ఔషధులను పోషిస్తున్నాను) అనే మాటకు మూలం ఈ వేద మన్త్రంలో కనిపిస్తుంది. చన్ద్రుడు 'ఆప్యాయనం' (వృద్ది) చెందడం అంటే, ప్రకృతిలోని రసాన్ని, ఔషధ గుణాలను వృద్ధి చేసి, తద్వారా జీవకోటికి 'వాజము' (అన్నం/బలం) అందించే పోషకుడిగా మారడం. అంతేకాదు, శ్రీ విష్ణు సహస్ర నామం లో “సోమః (౫౦౫)” అని ఆయన నామము కలదు. అందుకు శ్రీ శఙ్కర భగవత్పాదుల వారు “సోమరూపేణౌషధీః పోషయన్ సోమః; ఉమాయా సహితః శివో వా” అనే భాష్యం వ్రాశారు, అనగా సోమ (చన్ద్రుడు) రూపంతో ఔషధుల పోషణ చేయుట వలన ఆయనను (శ్రీ మహావిష్ణువును) సోముడు అంటారు. మరియు ఉమా సహితుడైన శివుడు అగుట చేత కూడా ఆయన ‘సోముడు’ అనే నామముచే ప్రసిద్ధుడు.
చన్ద్రుడికి, శరీర ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి, గర్భాధారణ, వీర్యకణాల మధ్య గల అవినాభావ సంబంధం: - "శుక్ర కణాల చలనానికి (Motility) చన్ద్రుని ఆవశ్యకత"
శుక్ర-చన్ద్ర సంబంధం (బీజం - పోషణ):
"సోమ ఏవ శరీరే శ్లేష్మాంతర్గతః"
సోమ (చన్ద్రుడు): ప్రకృతిలోని చల్లదనం, జల తత్వం, పోషక శక్తి. ఏవ (మాత్రమే/అగును): అదే (నిశ్చయార్థం). శరీరే (శరీరంలో): మానవ దేహంలో. శ్లేష్మ (కఫము): త్రిదోషాలలో ఒకటైన 'కఫం'. అంతర్గతే (లోపల ఉండుట): అంతర్లీనంగా ఉండుట.
"బ్రహ్మాండంలో ఉన్న చన్ద్రుడే (సోముడే), పిండాండమైన మన శరీరంలో 'శ్లేష్మము' (కఫం) రూపంలో ఉన్నాడు."
చన్ద్రుడు ‘కఫం’ నిర్మాణం, ద్రవాలను నియంత్రించు వాడు. 'శ్లేష్మ' అంటే కేవలం జలుబు/కఫం కాదు. సంస్కృతంలో 'శ్లిష్' అంటే 'ఆలింగనం చేసుకోవడం' లేదా 'కలిపి ఉంచడం'. అనగా, శరీరంలోని కణాలు విడిపోకుండా ఒకదానితో ఒకటి కలిసి ఉండేలా చేసే బంధన శక్తి (Binding Energy) ఈ శ్లేష్మమే. కీళ్లలో ఉండే Synovial Fluid (కందెన), మెదడును రక్షించే Cerebrospinal Fluid (CSF), కడుపులో ఆసిడ్ నుండి రక్షించే Mucous lining—ఇవన్నీ 'సోమ' స్వరూపాలే.
శుక్రం (Semen) అనేది ఆయుర్వేదంలో 'కఫ' వర్గానికి చెందుతుంది. ఇది 'సౌమ్య' (చన్ద్ర సంబంధ) పదార్థం. శరీరంలో ఈ 'శ్లేష్మ' (Soma) సరిగ్గా ఉంటేనే, వీర్య వృద్ధి, ఓజస్సు బాగుంటాయి. అందుకే చన్ద్రుడు బలహీనపడితే శరీరంలో నీరు ఇంకిపోవడం (Dehydration), లేదా కఫం వికటించడం జరుగుతుందని జ్యోతిషం, ఆయుర్వేదం రెండూ చెబుతాయి.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||
"నేనే రసస్వరూపుడనైన చన్దృడనై (సోముడనై) సకల ఔషధులను (వృక్షజాతిని) పోషిస్తున్నాను."
భగవంతుడు "నేను సోముడనై ఔషధులను పోషిస్తున్నాను" అన్నప్పుడు, ఆ పోషణ కేవలం బయట మొక్కలకే కాదు, మన శరీరంలోని 'ధాతువులకు' (Tissues) కూడా వర్తిస్తుంది. మన శరీరంలో కండరాలను, రక్తాన్ని, ఎముకలను 'కలిపి ఉంచి', వాటిని ఎండిపోకుండా కాపాడే ఆ 'జిగురు గుణమే' (Cohesive Force) చన్ద్రుడు
సూర్యుడు (పిత్తం) శరీరాన్ని దహించకుండా, చన్ద్రుడు (కఫం/శ్లేష్మ) దాన్ని చల్లబరుస్తూ సమతుల్యత (Homeostasis) కాపాడుతున్నాడు. ఇదే సృష్టిలోని గొప్ప విచిత్రం.
"ఆతుర రక్షా స్తోత్రం" లేదా "రక్షా కర్మ"
ఇది సుశ్రుత సంహిత అనే ఆయుర్వేద శస్త్రచికిత్స గ్రంథంలోని సూత్ర స్థానం, 5వ అధ్యాయం (అగ్ర-ఉపహరణీయ అధ్యాయం)
ఆయుర్వేదంలో శస్త్రచికిత్స చేసేటప్పుడు లేదా రోగి (ఆతురుడు) విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు, కంటికి కనిపించని క్రిముల (సూక్ష్మ జీవుల/రాక్షసుల/గ్రహాల) నుండి, మరియు మానసిక భయాల నుండి రోగిని రక్షించడానికి వైద్యుడు లేదా పురోహితుడు పఠించే రక్షా మంత్రం ఇది. ఈ శ్లోక పరంపరలో రోగి యొక్క ఒక్కొక్క అవయవాన్ని, ప్రాణశక్తిని కాపాడమని ఒక్కొక్క దేవతను ప్రార్థిస్తారు. అందులో చన్ద్రుని (సోముని) ప్రార్థన చాలా విశేషమైనది.
రక్షా కర్మలో సోముని పాత్ర:
"...సోమో వరుణో రాజా..."
ఈ రక్షా విధానంలో, ఋషులు ఇలా ప్రార్థిస్తారు: ‘బ్రహ్మ’ రోగి ఆత్మను రక్షించుగాక. ‘ఇన్ద్రుడు’ బలాన్ని ప్రసాదించుగాక. సోముడు (చన్ద్రుడు) పునర్జన్మను లేదా పునరుజ్జీవనాన్ని (Regeneration/Recovery) ప్రసాదించుగాక.
చన్ద్రుడు - ఔషధీశుడు: శస్త్రచికిత్స తర్వాత గాయం మానాలన్నా, శరీరం కోలుకోవాలన్నా 'ధాతు పోషణ' అవసరం. ఆ పోషణను, రసాన్ని అందించేవాడు చన్ద్రుడే. అందుకే "ఓ సోమదేవా! ఈ రోగి శరీరంలో రసధాతువును సమం చేసి, గాయాలు త్వరగా మానేలా చూడు" అని దీని అర్థం. ఆయుర్వేదంలో చన్ద్రుని "ఓషధీశుడు" (మందు మొక్కలకు అధిపతి) అంటారు. పౌర్ణమి రాత్రి వెన్నెలలో ఔషధ మొక్కలు తమ శక్తిని పుంజుకుంటాయని నమ్ముతారు. అందుకే కొన్ని రకాల ఆయుర్వేద మందులను (ముఖ్యంగా రసాయనాలను) పౌర్ణమి నాడే తయారు చేస్తారు.
మానసిక ధైర్యం: 'ఆతుర రక్ష' అంటే కేవలం శరీరాన్నే కాదు, మనసును రక్షించడం. రోగి భయపడితే చికిత్స వికటిస్తుంది. మనోకారకుడైన చన్ద్రుని ప్రార్థించడం వల్ల రోగికి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
వైద్యం + దైవం: సుశ్రుతుడు గొప్ప సర్జన్. ఆయన కత్తితో ఆపరేషన్ చేస్తూనే, ఇలాంటి మన్త్రాలను ఎందుకు చెప్పమన్నారంటే - అది "దైవ వ్యపాశ్రయ చికిత్స" (Spiritual Therapy). సైన్స్ భాషలో: ఇది రోగిలో Placebo Effectను లేదా Positive Psychologyని పెంచి, రోగ నిరోధక శక్తిని (Immunity) ప్రేరేపిస్తుంది.
జ్యోతిషంలో శుక్రుడు "వీర్య కారకుడు" (వీర్య సంఖ్య/పరిమాణం), కానీ ఆ వీర్యం చలించడానికి, జీవించడానికి కావలసిన ద్రవం (Semen fluid/Plasma) మాత్రం చన్ద్రుని ఆధీనంలోని "జల తత్వం". కుండలో మట్టి (శుక్రుడు) ఉంటే సరిపోదు, అందులో తడి (చన్ద్రుడు) ఉంటేనే మొక్క మొలకెత్తుతుంది. అదే విధంగా, పురుషులలో శుక్ర కణాలు అండం వరకు ప్రయాణించాలంటే చన్ద్ర బలం (ద్రవ శక్తి) తప్పనిసరి.
మాతృ కారకత్వం - స్త్రీలలో ఋతు చక్రం:
చన్ద్రుడు మాతృ కారకుడు మాత్రమే కాదు, స్త్రీల శరీరంలోని "ఋతు చక్రానికి" (Menstrual Cycle) అధిపతి కూడా. 28 రోజుల చన్ద్రుని భ్రమణం, స్త్రీల 28 రోజుల ఋతు చక్రం ఒకేలా ఉంటాయి. గర్భధారణకు, గర్భం నిలవడానికి (Gestation) కావలసిన పోషణను, మానసిక స్థయిర్యాన్ని చన్ద్రుడే ప్రసాదిస్తాడు. అందుకే గర్భిణీ స్త్రీలను పౌర్ణమి నాడు చన్ద్ర దర్శనం చేసుకోమంటారు.
ఈ రకమైన ఇబ్బందులతో కష్టపడే వారు చన్ద్ర మూలమన్త్ర సంపుటిత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలి.
రక్త ప్రసరణ - మనస్సు:
శరీరంలో రక్తం (Blood) మరియు రస ధాతువు (Plasma/Lymph) చన్ద్రుని అంశాలే. మనస్సు ప్రశాంతంగా లేకపోతే (చన్ద్ర దోషం ఉంటే), శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అది నేరుగా సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. "మనః ప్రసాదమే" ఆరోగ్యానికి, వంశాభివృద్ధికి మూలం.
చన్ద్ర గ్రహ ఎంత ప్రధానమైనదో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆయన రక్త కాన్సర్, శ్వాసకోశ సంబంధిత సమస్యలను, మరియు నేత్ర సంబంధిత సమస్యలను కూడా ఇస్తాడు:
జ్యోతిషానికి, ఆయుర్వేదానికి మరియు ఆధునిక వైద్యశాస్త్రానికి (Modern Pathology) మధ్య ఉన్న ఖచ్చితమైన సంబంధాన్ని సూచిస్తున్నాయి.
"సోమ ఏవ శరీరే..." (శరీరంలో ద్రవ/కఫ తత్వమే చన్ద్రుడు) అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని:
1. రక్త క్యాన్సర్ (Blood Cancer / Leukaemia) – చన్ద్రుని పాత్ర
సాధారణంగా జ్యోతిషంలో కుజుడు రక్త కారకుడు కదా, మరి చంద్రుడికి రక్త క్యాన్సర్తో సంబంధం ఏమిటి? అన్న సందేహం రావొచ్చు. కాని, రక్తం అంటే కేవలం ఎర్ర రక్త కణాలు (RBC) మాత్రమే కాదు. అందులో 'ప్లాస్మా' (Plasma - ద్రవ భాగం) మరియు 'తెల్ల రక్త కణాలు' (WBC - రోగ నిరోధక కణాలు) ఉంటాయి. కుజుడు: ఎర్ర రక్త కణాలకు (Haemoglobin/Iron), మజ్జకు (Bone Marrow) కారకుడు. చన్ద్రుడు: రక్తంలో ఉండే 'రస ధాతువు' (Plasma) మరియు 'తెల్ల రక్త కణాలకు' (Lymphatic System/WBC) కారకుడు. రక్త క్యాన్సర్ అనేది ప్రధానంగా తెల్ల రక్త కణాల అస్తవ్యస్త వృద్ధి. చన్ద్రుడు "మనోకారకుడు, దేహానికి తడినిచ్చేవాడు". ఎప్పుడైతే చన్ద్రుడు పీడింపబడతాడో (రాహువుతో గానీ, శనితో గానీ), అప్పుడు శరీరంలోని 'నీరు' (Fluid system/Lymph) విషతుల్యం అవుతుంది. ద్రవ రూపంలో ఉండే రక్తాన్ని నియంత్రించేది చన్ద్రుడే కాబట్టి, ఆ రసాయన చర్యలు వికటించడానికి చన్ద్ర దోషం ప్రధాన కారణం అవుతుంది.
2. శ్వాసకోశ సమస్యలు - చంద్రుని ప్రభావం
ఇది నేరుగా "కాలపురుష తత్వం" మరియు "ఆయుర్వేద కఫ తత్వం"తో ముడిపడి ఉంది. జ్యోతిషంలో కర్కాటక రాశి (చన్ద్రుని స్వక్షేత్రం) కాలపురుషుని 'వక్షస్థలాన్ని' సూచిస్తుంది. ఊపిరితిత్తులు పనిచేయాలంటే అందులో తడి ఉండాలి. దానిని "అవలంబక కఫం" అంటారు. ఊపిరితిత్తుల పొరల మధ్య ఉండే ద్రవం (Pleural fluid) ఎండిపోతే మనిషి శ్వాస తీసుకోలేడు. చన్ద్రుడు బలహీనపడితే (క్షీణ చంద్రుడు) లేదా పాప గ్రహాల ప్రభావం ఉంటే, ఊపిరితిత్తులలోని తేమ ఆవిరైపోయి TB (Tuberculosis) లేదా పొడి దగ్గు వస్తుంది. చన్ద్రుడు మరీ ఎక్కువైతే (జల తత్వం పెరిగితే), ఊపిరితిత్తులలో నీరు చేరడం (Pneumonia/Congestion) జరుగుతుంది. గాలి పీల్చడం అనేది వాయువు (బుధ/రాహు) పని అయినప్పటికీ, ఆ గాలిని పట్టి ఉంచే 'తిత్తి' (Sac/Diaphragm) మాత్రం చన్ద్రుని అంశనే.
3. సూర్య చన్ద్రులు - నేత్ర కారకులు
"చక్షుషోః సూర్యః" (కళ్ళకు సూర్యుడు అధిపతి) అని వేదం అంటుంది. జ్యోతిషంలో సూర్యుడు కుడి కన్ను, చన్ద్రుడు ఎడమ కన్ను అని చెబుతారు. దీని వెనుక ఉన్న సైన్స్ చూడండి: సూర్యుడు (తేజస్సు - Vision/Optic Nerve): కంటికి కనిపించే శక్తి, ఆ కాంతి సూర్యుని అంశ. రెటీనా మీద బొమ్మ పడాలంటే వెలుగు కావాలి. అది అగ్ని తత్వం. చన్ద్రుడు (స్నేహం - Lubrication/Cornea/Lens): కన్ను అనేది ఒక నీటి బుడగ లాంటిది (Vitreous humor & Aqueous humor). కన్ను ఎప్పుడూ తడిగా ఉండాలి. కంటిని కాపాడే కన్నీరు, కంటికి చలువనిచ్చే గుణం చన్ద్రునిది. అందుకే చూడండి మన నిత్య జీవితంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు (మొబైల్, కంప్యూటర్, లాప్ టాప్ ఇత్యాది) ఎంత ఎక్కువగా వాడుతుంటే, అవి వదిలిన అల్ట్రా వాయ్లేట్ రేడియేషన్ వల్ల కంటిలో నీరు అంత తొందరగా ఆవిరై కన్ను పొడిగా మారుతుంది. దీన్నే ‘Computer Vision Syndrome (CVS) or Digital Eye Strain’ అని అంటారు. ఇది సూర్య శక్తి. అందుకే కేవలం సూర్యుడు (వేడి) ఉంటే కన్ను ఎండిపోతుంది (Dry Eyes). కేవలం చంద్రుడు (నీరు) ఉంటే చూపు మసకబారుతుంది (Blurry vision/Cataract). కాబట్టి, జ్యోతిషంలో నేత్ర దోషాలను పరిశీలించేటప్పుడు, దృష్టి శక్తికి (Sight) సూర్యుడిని, కంటి ఆరోగ్యానికి (Health of the Eye Ball) చన్ద్రుడిని పరిశీలిస్తారు. ఇక్కడ కూడా "అగ్ని (సూర్యుడు) - సోమ (చన్ద్రుడు)" సిద్ధాంతమే పనిచేస్తోంది. రక్తంలో: ఎరుపు (కుజుడు/అగ్ని) - ప్లాస్మా (చన్ద్రుడు/సోమ). ఊపిరితిత్తులలో: గాలి (వాయువు) - తేమ (చన్ద్రుడు/సోమ). కళ్ళలో: చూపు (సూర్యుడు/అగ్ని) - కంటి ద్రవం (చన్ద్రుడు/సోమ).
అధికశాతం మంది జ్యోతిష నిపుణులు పరిహారాలు చెబుతున్నప్పుడు చన్ద్ర గ్రహను పట్టించుకోరు. కాని చన్ద్ర భగవానుడు ఎంత ప్రధానమైన వాడో పైన తెలిపిన వాటి ద్వారా గ్రహించవచ్చు. పైన తెలిపిన ఇబ్బందులతో బాధపడుతున్న వారు యథాశక్తి ఫాల్గుణ మాసంలో, ప్రధానంగా పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువును మరియు చన్ద్ర భగవానుడిని ఆరాధించడం వలన వారికి చక్కని ఉపశమనం లభించే అవకాశం కలదు. ఆయన ఉమా సహిత శివుడు కూడా అగుట వలన చన్ద్ర మూల మన్త్రాలను సంపుటీకరణ చేస్తూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఆచరించాలి. మహాన్యాసం వలన దేహ శుద్ధి మరియు ఆత్మ శుద్ధి కూడా జరుగుతుంది. తత్ఫలితంగా సోముడి అనుగ్రహం, ఉమా సహిత శివానుగ్రహం, శ్రీ మహావిష్ణు అనుగ్రహం అన్నీ కూడా లభిస్తాయి.
శ్రీ మహావిష్ణు, చన్ద్ర, లక్ష్మీదేవి మరియు అర్యముడు ప్రధానంగా గల ఇంతటి అద్భుతమైన ప్రాధాన్యత గల ఫాల్గుణ మాసాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సాధన క్రమంలో లేదా దైవారాధన క్రమంలో నిష్కామ పూర్వకంగా దైవాన్ని ఆరాధించండి. అడిగిన వాడికి అడిగినంతే ఇచ్చే అవకాశం కలదు. అడగని వాడికి ఏమీ లభించదని భావించ రాదు. మనకు కావలసింది ఏమిటో ఆయనకు తెలుసు. మనకు కావాల్సిన దానికంటే కూడా ఎన్నో రెట్లు అధికమైంది, మరియు మనకు ఏది సరియైనదో దాన్ని తప్పక అనుగ్రహిస్తాడు. అజ్ఞానంతో కూడిన లేదా మూఢ నమ్మకంతో కూడిన భక్తికి దూరంగా ఉండాలి. శాస్త్ర విహితమైన కర్మలను ఆచరించడమే మన ధర్మం. అందుకే ఆచరించాలి. ఫలం ఈశ్వరేచ్ఛ.
ముఖ్య సూచన:
ఈ రచనలో ఆయుర్వేద సంబంధమైన జ్ఞానాన్ని అందించిన ఆయుర్వేద వైద్య నిపుణులు డా. శ్రీమతి రుద్రవరం మాధవీలత గారికి అనేకానేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి