Ashoucham - Ashuchi

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

  

సపిండుల (పాలివాళ్ళ) మరణానంతరం అశౌచం

అశౌచంలో అనుమతించబడ్డ మరియు నిషేధించ బడ్డ వైదిక క్రతువులు (కర్మలు)

 

ఈ మధ్యకాలంలో మనుషులలో ఆధ్యాత్మిక చింతన అధికమై అది పలు విధాలైన మూఢ నమ్మకాలకు దారితీస్తుంది. సామాజిక మాధ్యమాలు ఇందులో  ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. మిడిమిడి జ్ఞానం గల పండితులు పెట్టిన యౌ ట్యూబ్ వీడియోలు, వాట్స్ ఆప్ సంక్షిప్త సమాచారాలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. జ్యోతిష వృత్తిలో గల నాకు ఈ మధ్యకాలంలో అనగా గత కొన్ని సంవత్సరాలుగా చాలా రకాలైన అనుభవాలు ఎదురౌతున్నాయి. అసలు ఏ శాస్త్ర గ్రంథాలలో కూడా దొరకని సందేహాల గూర్చి అడుగుచున్నారు. ప్రధానంగా ఈ శీర్షికలో ‘మనిషి మరణించిన పిమ్మట అశౌచం (సూతకం లేదా సూతిక)’ గూర్చి తెలుసుకుందాము. ‘అశౌచం’ గూర్చి చాలా సందేహాలు అగుడుచున్నారు. చాలా వాటికి శాస్త్రంలో కూడా సమాధానం దొరకదు. అంటే అట్టి సమస్య లేదా సందేహం నిరాధారమైనదని గ్రహించాలి. శాస్త్ర ప్రమాణాలు గల వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అశౌచం గూర్చి ఈ మధ్యకాలంలో నేను ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలు:

 

1.       మా పాలి వాళ్ళలో ఒకరు జరిగిపోయారు లేదా మరణించారు. సగోత్రులలో గాని ‘సపిండీ’ లో గాని ఒకరు మృతి చెందారు. మాకు సంవత్సర సూతకం లేదా అశౌచం ఉంటుందా?

2.       సంవత్సర సూతకంలో లేదా అశౌచంలో ఇంట్లో దీపం వెలిగించ రాదా?

3.       సంవత్సర సూతకంలో లేదా అశౌచంలో భగవంతుడికి దండం పెట్టుకోవచ్చా? భగవన్నామ స్మరణ చేయకూడదా?

4.       సంవత్సర సూతకంలో లేదా అశౌచంలో దేవాలయానికి వెళ్ళ కూడదా?

5.       ఇంట్లో శుభ కార్యాలు (గృహ గృహారంభ, ఉపనయన వివాహాది) జరుపకూడదా?

6.       నొసటిపై బొట్టు పెట్టుకోకూడదా?

7.       మేము శుభ కార్యాలకు వెళ్ళవచ్చా?

8.       శుభ కార్యాలలో ఇతరులకు కట్న కానుకలు ఇవ్వవచ్చా?

9.       శుభ కార్యాలలో ఇతరులకు బొట్టు పెట్టవచ్చా?

10.   సంవత్సర సూతక కాలంలో ఇంట్లో ఎవరైనా ప్రసవించిన ఎడల అట్టి శిశువుకు జరపాల్సిన సంస్కారాలు (డోలారోహణం, నామకరణం, అన్న ప్రాశన, కేశ ఖండనం, అక్షర స్వీకారం ఇత్యాదివి) జరపవచ్చా?

ఇత్యాది ప్రశ్నలు చాలామంది ఆగుతూ ఉంటారు. ఇతః పూర్వం ఈ విధంగా అడిగేవారు కాదు. కాని ఈ మధ్యకాలంలో చాల ఎక్కువగా అడుగుచున్నారు.

 

ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని అసందర్భమైన, ఆలోచన లేని, అర్థం లేని ప్రశ్నలు కూడా అడుగుతారు:

1.       మా ఇంట్లో శుభకార్యం (ఏ శుభకార్యమైనా కూడా) జరిగి నెలరోజులు కూడా కాలేదు. మా పాలివాడు, బంధువు మరణించారు లేదా నా ఆప్త మిత్రుడు మరణించాడు. శవాన్ని నేను చూడవచ్చా?

2.       మా ఇంట్లో శుభకార్యం జరిగి నెలరోజులు కూడా కాలేదు. మా బంధువు మరణించారు లేదా నా ఆప్త మిత్రుడు మరణించాడు. నేను వెళ్లి వారిని ఒదార్చ వచ్చా? వారిని పలకరించడానికి వెళ్ళవచ్చా?

3.       మా ఇంట్లో శుభకార్యం జరిగి నెలరోజులు కూడా కాలేదు. మా బంధువు మరణించారు లేదా నా ఆప్త మిత్రుడు మరణించాడు. వీడియో కాల్ ద్వారా గాని లేదా ఫోన్ ద్వారా గాని పలకరించ వచ్చా?

ఇత్యాది చిత్ర విచిత్రమైన ప్రశ్నలు సంధిస్తారు. అసలు నిజానికి ప్రజలలో అనుమానం, భయం ఎంతగా నిండిపోయిందో వీటి ద్వారా తెలియుచున్నది. శాస్త్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. శాస్త్రంలో సందేహాలు లేవు. మనిషిలోనే సందేహాలు ఎక్కువ. అందులోకీ అనుమానం రేకెత్తించే వారు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నారు. ఈ విషయంలో అసలు శాస్త్రం ఏమంటున్నదో తెలుసుకుందాము.

 

అశౌచం - అశుచి:

 

అశౌచం అనగా అశుచి. శుచిగా లేకపోవడం. మలిన వస్త్రాలతో కర్మను ఆచరించడం.

 

శ్రీ కృష్ణ ఉవాచ:

తే ప్రవిశ్య గృహం సర్వే సుతాద్యాశ్చ సపిణ్డకాః

భవేయుర్దశరాత్రం వై యత్ అషౌచకం ఖగ ।। (గరుడ ప్రే ఖ ౫-౩)

మరణించిన వారి సపిణ్డులకు ‘దశ రాత్రం’ అనగా పది రాత్రులు అశుచిని నిర్దేషించ బడినది. అంతేకాదు ఈ కాలంలో వీరు ఏక వస్త్రమును ధరించాలి. అది కూడా మాసిపోయి ఉండాలి. మూడు పూటలా స్నానాన్ని సూచించ బడినది. సుగంధ ద్రవ్యాలు, సబ్బులు మరియు శాంపులు ఇత్యాదివి వాడరాదు. ధరించిన వస్త్రాన్ని పిండుకొని దాన్నే పునః ధరించాలి. బ్రహ్మచర్యమును పాటించాలి. నేలపై పరుండాలి. అంతేకాదు ‘దానాధ్యయనవర్జితాః’ దానము అధ్యయనము ఇత్యాది వాటిని వర్జించాలి. ‘దానము అధ్యయనము’ రెండూ కూడా నిజ జీవితంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండింటినీ జరపాలి. దాన ధర్మాదులను ఆచరించాలి. ‘అధ్యయనము’ అనగా వేదాధ్యయనము అని గ్రహించాలి. వేదాధ్యయనము, వేద పారాయణం నిత్య కర్మలుగా పరిగణించ బడినది. ఇట్టి నిత్యకర్మను అశుచి సమయంలో త్యజించాలి. ఇట్టి నిత్య కర్మలకు మనిషి ఎక్కువకాలం దూరం కాకూడదు. అందుకే అశుచి సమయాన్ని కూడా శ్రీ కృష్ణ భగవానుడు సూచించాడు:

అపనోద్యన్త్విదం కాలాదిభిరాశు నిషేధకృత్

నిణ్డాధ్యయనదానాదేః పుంగతోఽతిశయో హి తత్ ।। (గరుడ ప్రే ఖ ౫-౯)

దశాహం శావమాశౌచం సపిణ్డేషు విధీయతే

జననేఽప్యేవమేవ స్యాన్నిపుణం శుద్ధిమిచ్ఛతామ్ ।। (గరుడ ప్రే ఖ ౫-౧౦)

వ్యక్తి మరణించిన క్షణం మొదలుకొని ‘దశాహం’ పది రోజులు సపిణ్డీకులు (సగోత్రీకులు లేదా పాలివాళ్ళు) అశుచిని పాటించాలి. అశుచి నియమాలను పాటించాలి. వారి శుద్ధి జరగాలంటే ఇట్టి నియమాలను విధిగా పాటించాలి. దీని వెనక శాస్త్రీయమైన కారణం కూడా కలవు. ప్రధానంగా సపిణ్డీకులు మరణించిన వారి పార్థివ శరీరాన్ని ముట్టుకొని పలు రకాలైన కర్మలను ఆచరిస్తారు. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే దానికి క్రిమికీటకాదులను ఎదుర్కొను శక్తి ఉంటుంది. మరణించిన మరుక్షణం అవి దేహంపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. అందుకే శవాన్ని ముట్టుకున్న వారు మరియు దానికి అత్యంత సమీపంలో ఎక్కువ సమయం గడిపిన వారిపై క్రిమికీటకాదుల ద్వారా రోగాలు సోకు అవకాశం ఉండుట వలన అవి అంతమయ్యే వరకు, ఇతరులకు సోకకుండా ఇట్టి సమయాన్ని నిర్దేషించ బడినది. అందుకే అశుచి సమయంలో వారిని ఇతరులు తాకరాదనే నియమం పెట్టారు.

 

‘దశాహం’ పది రోజులు మాత్రమే అశుచిని సూచించ బడినది. అటుపిమ్మట ద్వాదశ దిన కర్మ వరకు కూడా కర్మను జరిపించు వారు దీక్షలో కొనసాగుతారు. అట్టి సమయాన్ని అశుచిగా పరిగణించబడదు. పది రోజుల అశుచి పిదప శుద్ధి గావింప బడి దాన మరియు అధ్యయనాలకు అర్హుడు అగు చున్నాడు. దశదిన అశుచి కాలం ముగిసిన పిమ్మట నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించుటకు అర్హులగు చున్నారు. మరి ‘సంవత్సర సూతకం’ అనే ఆచారం ఎందుకు వచ్చింది? సంవత్సర కాలం పాటు మరణించిన వారికి ప్రతి మాసం పిండ మరియు జలాంజలి సమర్పించుకోవాలి. దీన్ని అశుచిగా పరిగణించరాదు. ఇట్టి సమయంలో గృహ ప్రవేశ, గృహారంభ, వివాహ, ఉపనయనాలు చేయరాదు. ఒకవేళ చేయవలసి వస్తే మరణించిన వారికి సంవత్సర కాలంలో  చేయవలసిన పిండ మరియు జలాంజలి ఏక కాలంలో నిర్వహించి జరిపించుటకు శాస్త్రం సమ్మతించి యున్నది. ఈ సమయంలో కన్యాదానం శ్రేష్టమైనదని కూడా చెప్పబడినది. దాన మరియు అధ్యయన అర్హత లభించుట వలన నిత్య కర్మలను ఆచరించ వచ్చు. నిత్య పూజలు చేసుకోవచ్చు. దీపారాధన తప్పక చేయాలి. దీపం వెలగని ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు. దేవాలయాలకు వెళ్ళవచ్చు. దైవ దర్శనం చేసుకోవచ్చు. చక్కగా తిలకం ధరించవచ్చు. ఇతరుల ఇళ్ళలో జరుగు శుభకార్యాలకు నిస్సందేహంగా వెళ్ళవచ్చు. వారికి కట్న కానుకలు సమర్పించ వచ్చు. వారు కూడా ఏమాత్రం అనుమాన పడవలసిన అవసరం లేదు. గృహంలో శిశువు జననం అయిన ఎడల వారికి జరపాల్సిన సంస్కారాలు విధిగా జరపాలి. గర్భిణీ స్త్రీకి కూడా జరపవలసిన సంస్కారాలు అన్నియు జరపాలి. ఎవరైనా బంధువులు గాని, మిత్రులు గాని మరణించిన ఎడల వారిని పలకరించడానికి వెళ్ళవచ్చు.

 

ఇక రెండవ రకం సందేహం:

ఇంట్లో శుభ కార్యాలు జరుపుకున్న వారు, అనగా, ఇంట్లో వివాహం, గృహ ప్రవేశం, గృహారంభం, ఉపనయనం ఇత్యాది శుభ కార్యాలు చేసుకున్న వారు అశుచితో ఉన్న వారిని, అశుచి సమయంలో గాని మరియు సంవత్సర కాలంలో పలకరించుటకు వెళ్లేందుకు ఈ మధ్య కాలంలో అనుమానాలు మొదలైనాయి. కాని అది శాస్త్ర సమ్మతం కాదు. అశుచికి చెందిన నియమాలు అశుచిలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి కాని ఇతరులకు కాదు. వారిని చూసినంత మాత్రానా, పలకరించినంత మాత్రానా మరియు ఒదార్చినంత మాత్రానా వారికి అశుచి అంటుకోదు, దోషం ఏర్పడదు. ఏ విధమైన దుష్ప్రభావం కూడా ఉండదు. కష్టంలో ఉన్న వారిని ఓదార్చడం మానవ ధర్మం. వారికి తగిన విధంగా చేయూతను అందించడం మన ధర్మం. పైన తెలిపిన శుభ కార్యాలు జరుపుకున్న వారు, లేదా ఇతర శుభకార్యాలు జరుపుకున్న వారు ఇతరుల పార్థివ దేహాన్ని కూడా చూడవచ్చు. ఇందులో ఒకేఒక మినహాయింపు కలదు. అది ఏమనగా, శుభ కార్యాలు జరుపుటకు గాను యజమాని కంకణ ధారణ చేస్తాడు. అనగా అట్టి శుభ కార్యాన్ని జరిపించుటకు దీక్షను తీసుకుంటాడు. అట్టి శుభకార్యం ముగిసిన వెంటనే కంకణం విసర్జన చేస్తారు. కంకణం ధరించిన వ్యక్తులు మాత్రం శవ దర్శనం గాని, వారి సంబంధీకులను గాని పలకరించుటకు వెళ్ళరాదు. కంకణం విసర్జించిన పిమ్మట నిస్సందేహంగా వెళ్ళవచ్చు. ఈ విషయంలో ఏ సందేహం లేదు, సందేహం ఉండాల్సిన అవసరం లేదు. శాస్త్ర సమ్మతం కాని మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి.

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

శ్రీ గాయత్రి వేద విజన్

హనుమకొండ

09.10.2023