Sanatana Dharma
శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీ గాయత్రి వేద విజన్, హనుమకొండ
సనాతన ధర్మం నశిస్తే ఏమౌతుంది?
ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నాము ‘సనాతన ధర్మం నశించి పోవాలి’ అని చెప్పే వారు పుట్టుకొస్తున్నారు. ఈ విధంగా మన ధర్మాన్ని అవమాన పరిచే విధంగా ప్రకటనలు చేయు వారికి నిజంగా సనాతన ధర్మ గూర్చి తెలియదు. తెలిస్తే వారు ఆ విధంగా మాట్లాడరు. మానవుడి జీవనం విధానం అంతా కూడా ‘సనాతన ధర్మ’ నియమాల ఆధారంగానే ఏర్పడింది. ఇట్టి సనాతన ధర్మ నియమాలు ఒక్క భారతీయులకు లేదా హిందువులకు మాత్రమే కాదు. సమస్త మానవాళికి కూడా వర్తిస్తాయి. ఇవి ఏ ఒక్క కులానికో, వర్ణానికో, మతానికో మరియు జాతికో చెందినవి కావు. మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ ఇట్టి సనాతన ధర్మాలు వర్తిస్తాయి. అట్టి సనాతన ధర్మాలను అనుసరించు వాడే మనిషిగా గుర్తింప బడతాడు. మనిషి ధర్మ మార్గంలో నడవడానికి కావలసిన నియమాలే ‘సనాతన ధర్మ నియమాలు’. ధర్మం మరియు ధర్మానికి చెందిన నియమాలు భూమిపై పుట్టిన ప్రతి మానవుడికి వర్తిస్తాయి. ధర్మాన్ని ‘మతం’ గా భావిస్తారు. కాని అది తప్పు. ధర్మం అనగా ‘నియమం’. ఉదాహరణకు: నేరం చేసిన వాడు శిక్షించ బడాలి. అది ‘ధర్మం’. అదే సృష్టి యొక్క నియమం. ఈ ధర్మం మనిషై జన్మించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. మనిషిగా జన్మించిన మరుక్షణం ఇట్టి కట్టుబాట్లు వర్తిస్తాయి. ధర్మ సూత్రాలు అనువర్తించ బడతాయి. ధర్మానికి మతం రంగు పూయరాదు.
‘సనాతన ధర్మం’ అనగానే హిందువులకు చెందినదనే వాదన వస్తుంది. అలా ఎందుకు వస్తుంది? దానికి గల ప్రధాన కారణం అత్యంత ప్రాచీనమైన హిందూ ధర్మాలు. హిందూ ధర్మం అనునది ఒక మతం కాదు. మానవుడి జీవన విధానాన్ని నిర్దేశించు మార్గం. అట్టి మార్గాన్ని నమ్ము వారు మరియు అనుసరించు వారందరూ కూడా హిందువులుగా గుర్తింప బడతారు. అందుకే నేడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి.
ఏది ధర్మమో మరియు ఏది అధర్మమో చెప్పేదే సనాతన ధర్మం. సనాతన ధర్మ సూత్రాలు శృతులు, స్మృతులు మరియు పురాణాల నుండి ఉద్భవించినవి. ‘ధర్మ శాస్త్రాలు’ కూడా ఇట్టి నియమాలను విశదీకరిస్తాయి. ప్రధానంగా అత్యంత ప్రాచుర్యంలో గల ‘మను స్మృతి’. మను స్మృతి:
అస్మిన్ ధర్మోఽఖిలేనోక్తో గుణదోషౌ చ కర్మణామ్ ।
చతుర్ణామపి వర్ణానామాచారశ్చైవ శాశ్వతః ।। (మను ౧-౧౦౭)
ఈ ధర్మ శాస్త్రంలో సంపూర్ణ ధర్మ, కర్మల గుణాలు మరియు దోషాలు, చాతుర్వర్ణాలకు చెందిన సనాతన ఆచారాలు చెప్పబడినవి.
మరి అట్టి ఆచారాల యొక్క ప్రాధాన్యత ఏమిటో కూడా చెప్పబడింది:
ఆచారః పరమో ధర్మః శృత్యుక్తః స్మార్త ఏవచ ।
అనగా వేదాలు మరియు స్మృతులందు చెప్పబడిన ఆచారాలే శ్రేష్ఠ మైన ధర్మాలు. మరి ఆ విధంగా చెప్పబడని వాటి సంగతి ఏమిటి?
‘‘ధర్మశాస్త్రన్తు వై స్మృతిః’
శృతులు మరియు స్మృతులు చెప్పినవే ధర్మాలు. కానివన్నీ కూడా ధర్మాలు కావు. అవి ధర్మం గా పరిగణించబడవు. అట్టి ధర్మ సూత్రాల ఆధారంగా ఏర్పడ్డదే ‘సనాతన ధర్మం’
అత్యంత ప్రాచీనమైన భారతీయ సంస్కృతి ఒక విజ్ఞాన ఖని. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు అన్నీ కూడా మానవుడి జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి. వీటన్నిటి సారాంశం భగవద్గీతలో లభిస్తుంది. ఇదే ‘సనాతన ధర్మం’ దీనికి ఆది గాని అంతం గాని లేదు. బ్రహ్మ జన్మించిన నాడే సనాతన ధర్మం ఉద్భవించింది. సనాతన ధర్మం కాలానుగుణంగా మారదు. ఇది నిత్యమూ మరియు శాశ్వతమైనది. న్యాయ సూత్రాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. కాని ధర్మ సూత్రాలు ఏనాడు మారవు. హిందూ ధర్మం ఇట్టి సనాతన ధర్మాన్ని బోధిస్తుంది. ఇట్టి ధర్మ సూత్రాలను ఆచరించాలని చెబుతుంది. అదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఆ విధంగా ఆచరించిన వాడి జీవనం సాఫీగా సాగుతుంది. వాడిలో ధర్మాధర్మ విచక్షణ పెంపొందుతుంది. కర్మలను కర్మ ఫలాలను తెలుసుకోగల సామర్థ్యం ఉంటుంది. దుష్కర్మను త్యజించి సత్కర్మను ఆచరిస్తాడు. మోక్ష మార్గంలో గల సాధకుడు మోక్షాన్ని కూడా పొందగలడు.
‘ఆపో వై వృష్టిః । పర్జన్యో వర్షుకో భవతి । య ఏవం వేద ।‘ (శ్రీ కృష్ణ యజుర్వేద ఆరణ్యక - అరుణ కేతుక చయనం)
అనునది శృతి ప్రమాణం. అనగా, భూమిపై ఉన్న జలాలు మేఘాలుగా మరి వర్షమై కురుస్తాయి. ఇందుకు సూర్య భగవానుడే ప్రధాన కారకుడు. ప్రకృతిని కాపాడాలనే గొప్ప సందేశం ఈ వేద మన్త్రం లో కలదు. ప్రకృతి కాపాడబడితే జీవరాశి కూడా కాపాడబడుతుంది. ఆవిధంగా జరిగిన నాడే సృష్టి ధర్మం కాపాడ బడుతుంది. సమస్త జీవరాశి కూడా రక్షించ బడుతుంది. లేని ఎడల మనిషి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం కలదు.
ధ్యాయతో విషయాన్ పుంసః సఙ్గస్తేషూపజాయతే ।
సఙ్గాత్సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ।।
క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో బుద్ధినాశా త్ప్రణశ్యతి ।।భగీ 2.62-63।।
శబ్దస్పర్శాది విషయ వాంఛల పట్ల సదా చింతించు మనుజుడు, అట్టి విషయములందు ఆసక్తి కలుగుట అధికమగు చున్నది. ఇట్టి ఆసక్తి వలన కోరిక పుట్టు చున్నది. ఇట్టి కోరిక వలన క్రోధము ఉత్పన్నమగు చున్నది. క్రోధము వలన మనుజుడు తన వివేకమును కోల్పోవు చున్నాడు. ఈ విధముగా వివేకము లేదా జ్ఞాపక శక్తి నశించుట వలన బుద్ధి నాశనము జరుగును. బుద్ధి నాశనము జరిగిన మనుజుడు పూర్తిగా నశించి పోవుట లేదా అధోగతి పాలగు చున్నాడు.
వివేకాన్ని కోల్పోయిన వాడే ‘సనాతన ధర్మం నశించాలని’ పేలుతూ ఉంటారు. మనిషి యొక్క బుద్ధి ఎందుకు నశిస్తుందో, ఆవిధంగా బుద్ధి నశించి పోవడం వలన మనిషి ఏవిధంగా అధోగతి పాలగునో వివరించే అద్భుతమైన భగవద్గీత ప్రమాణం ఇది. ఇట్టి సూత్రాలు మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. ఈ సూత్రానికి జాతి, మత మరియు కులాలతో సంబంధం లేదు. ఇట్టి సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మనస్సును నిగ్రహించాలని బోధించునదే ‘సనాతన ధర్మం’. ఇది సృష్టి ధర్మం. ఇదే సనాతన ధర్మం. కాలాలు మారినా, యుగాలు మారినా ఇట్టి ధర్మం మాత్రం మారదు. ధర్మ సూత్రాలు మారవు. మనిషి మనస్సును తన అధీనంలో ఉంచుకోవాలి. తద్వారా వాడి ఇన్ద్రియాలు కూడా నిగ్రహంలో ఉంటాయి. ‘అది కుదరదు, సనాతన ధర్మం నశించి పోవాలని’ అనడం స్వీయ వినాశనానికి కారణం కాగలదు. సనాతన ధర్మం నశిస్తే సృష్టి అంతటా అధర్మం పాకిపోతుంది. ధర్మాన్ని విస్మరించి, అతిక్రమించి మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. వావివరసలు ఉండవు, మానవ సంబంధాలు ఉండవు, మనిషిలో మానవత్వం నశిస్తుంది, అధర్మ కార్యాచరణ పెరుగుతుంది, మనుషులు లోకసంగ్రహాన్ని మరిచిపోతారు, స్వీయ లాభమే వారి ధ్యేయంగా ఉంటుంది. కలియుగంలో ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే కనిపించడం ప్రారంభమైంది. శాస్త్ర ప్రమాణాలు చెప్పిన విధంగా ధర్మం ఒకే పాదంతో నడవడం ప్రారంభించింది.
అందుకే సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకై ప్రతి ఒక్కరూ శ్రమించాలి. అప్పుడే అట్టి ధర్మం మనను రక్షిస్తుంది. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే వాక్యాన్ని అనుసరించి ధర్మాన్ని రక్షిస్తే అదే మనను రక్షిస్తుంది. రాజకీయ దురుద్దేశంతో సనాతన ధర్మం నశించాలని అన్న మరుక్షణం వాడి మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం కలదు. సనాతన ధర్మాన్ని రక్షించుటకు నడుము బిగించిన వారిని సమర్థించాలి. వారికి చేయూతను అందించాలి. అప్పుడే ధర్మం కాపాడబడుతుంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः ।
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి