శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శ్రీమద్రామాయణం – పాప కర్మ నివారిణి
ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సం శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
మనిషి ధర్మ మార్గంలో నడవాలంటే శ్రీమద్రామాయణమే ప్రమాణం. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ – శ్రీ రాముడు ధర్మం మరియు ధర్మాచరణ యొక్క విగ్రహం. ఆయన నడచుకున్న, ఆచరించిన పద్ధతులే నేటికీ ధర్మానికి ప్రమాణాలు. త్రేతాయుగం మొదలు అన్ని యుగాలకు ఆయన ఆచరించిన పద్ధతులే ధర్మానికి ప్రమాణాలు.
నేడు కలియుగంలో పాప భీతి అన్నదే లేకుండా పోతుంది. మనిషి దుష్కర్మను మరియు శాస్త్ర విరుద్ధమైన కర్మలను ఆచరిస్తూ క్రమక్రమంగా వాటినే రాబోవు తరాలకు కూడా అందిస్తున్నాడు. ఇట్టి పాప కర్మలను తెలిసి ఆచరిస్తున్నాడా? లేక వస్తు మరియు విషయ వ్యామోహంలో స్మృతిని కోల్పోయి ఆచరిస్తున్నాడా? ‘అవశ్యం పితురాచారః’ మన పూర్వీకులు, పితృ దేవతలు ఆచరించిన శాస్త్ర విహితమైన కర్మలే మనకు ప్రమాణాలు. వాటిని ఆచరించడమే మన ధర్మం. కాని నేడు ఉద్యోగ వృత్తి రీత్యా సుదూర ప్రాంతాలలో, విదేశాలలో నివసిస్తున్న వారు, అక్కడే జన్మించిన వారికి తమ పూర్వీకులు ఆచరించిన ఆచారాలు తెలియడం లేదు. సత్కర్మ ఏదో! దుష్కర్మ ఏదో! కూడా తెలియడం లేదు. అట్టి వారికి పాప కర్మలను విశదీకరించేదే దుష్కర్మల సూచన ఈ శీర్షిక.
శ్రీ వాల్మీకి రామాయణ అయోధ్యకాండ పంచసప్తతిమస్సర్గ అనగా 75 వ సర్గలో, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన పిదప, అట్టి దుఃఖంతో దశరథ మహారాజు తన దేహాన్ని చాలించిన పిమ్మట, భరతుడు కైకేయ రాజ్యం నుండి తిరిగి వచ్చిన పిమ్మట, విషయమంతా తెలుసుకుని, ఎక్కడ లోకం తనను దోషిగా నిందిస్తుందో అనే భయంతో, మంత్రులకు మరియు మహర్షులకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించి, కౌసల్యా మాత కూడా తనను బాధ్యుడిగా చేస్తుందనే దిగులుతో, ధర్మ నిరతుడైన భరతుడు కౌసల్యా మాతను మెప్పించడానికి, తాను ఏ పాపము ఎరుగనని చెప్పడానికి, తాను ఏ పాపము చేయలేదని, తనకు రాజ్య కాంక్ష లేదని చెప్పడానికి, తన అన్న గారైన శ్రీ రాముడు తనకు పితృ సమానుడని చెబుతూ, ఒకవేళ తాను ఏదైనా పాపం చేసి ఉంటే క్రింద వివరించిన విధంగా తాను శిక్షార్హుడని రోదిస్తూ కౌసల్యా మాతను వేడుకుంటాడు. నిజానికి ఇదే ఘట్టం కలియుగంలో జరిగి ఉంటే, భరతుడి స్థానంలో కలియుగ ఒక సామాన్య మానవుడు ఉండి ఉంటే శ్రీ రాముడు వనవాసం నుండి తిరిగి రాకుండా చేసి వాడు శాశ్వత రాజ్య సుఖాన్ని అనుభవిస్తాడు. అంతేకాదు నేడు కలియుగంలో జరుగుతున్న లోక రీతిని అనుసరించి, సింహాసనాన్ని అధిరోహించి శ్రీ రాముడిపై పలు రకాలైన నిందలు మోపి, కేసులు పెట్టి అతడు శాశ్వతంగా అడవుల్లో ఉండే విధంగా చేస్తారు. ఒకవేళ వచ్చిన ఆయనను బంధించి కారాగార గృహంలో వేస్తారు. నేడు లోకంలో జరుగుతున్నది అదే కదా! కాని భరతుడు ధర్మానికి కట్టుబడి తుచ్చమైన రాజ్యం తనకు వద్దని చెబుతాడు. ఆయన కౌసల్యా మాతను వేడుకుంటూ పలు రకాలైన పాప కర్మలు వాటి వలన పొందే శిక్షల గూర్చి చెబుతాడు. ఒకవేళ జరిగిన దాంట్లో ఆయన తప్పు ఉండి ఉంటే ఆయన ఈ ఘోర పాపలు చేసిన వారు ఏవిధంగా కష్టాలను అనుభవిస్తారో, తాను కూడా అవే కష్టాలను అనుభవించాలని తనను తాను శపించుకొంటూ ఉంటాడు. ఇవన్నీ కూడా నేడు అనగా కలియుగంలో సామాన్యుడికి తెలియాలి. అప్పుడే వాడిలో కొంతనైనా పాపభీతి ఉంటుంది. ప్రధానంగా చిన్న పిల్లలకు దీని గూర్చి చెప్పాలి. వీడియో గేమ్ లు ఆడడం, లేదా దొంగలు, స్మగ్లర్ ల గూర్చి వచ్చి సినిమాలు చూడడం వలన వారి లేత మనస్సు దాన్నే ప్రమాణంగా తీసుకునే ప్రమాదం లేక పోలేదు. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
అన్నయ్య అయిన శ్రీ రాముడిని వనవాసానికి పంపడంలో తన ప్రమేయం ఏ మాత్రం ఉన్నా క్రింద వివరించినబడిన పాపా కృత్యాలను ఆచరించిన వారు ఏవిధంగా శిక్షించబడతారో తాను కూడా అందుకు శిక్షార్హుడు కాగలడని దుఃఖంతో రోదిస్తూ కౌసల్యా మాతను వేడుకుంటాడు (సంస్కృత మూల శ్లోకాలను వదిలి వాటి అర్థాన్ని మాత్రమే ఇవ్వబడినది):
1. మిగుల పాపాత్ముడికి సేవ చేయుట.
2. సూర్యుడికి ఎదురుగా నిలబడి మల మూత్రాదులను విసర్జించుట.
3. నిదురించు చున్న గోవును కాలితో తన్నుట.
4. యజమాని తన భృత్యుడితో ఇబ్బడిముబ్బడిగా పని చేయించుకొని వాడికి ఇవ్వ వలసిన శ్రమ ఫలాని (కూలిని) ఇవ్వకుండా ఎగగోట్టుట.
5. ప్రజలను కన్నబిడ్డల వలే పాలించు చున్న రాజుకు ద్రోహం తలపెట్టుట
6. ప్రజల ఆదాయంలో ఆరవ భాగాన్ని ‘పన్ను’ గా స్వీకరించిన రాజు ప్రజల బాగోగులను విస్మరించుట
7. ఉపవాసాది వ్రత నియమాలను పాటిస్తూ యజ్ఞ నిర్వాహణకు తోడ్పడుతున్న ఋత్విజులకు రాజు (కర్త లేదా యజమాని) యజ్ఞ దక్షిణను ప్రకటించి (ఇస్తానని ఒప్పుకొని) ఆడిన మాట తప్పుట, ఇవ్వకపోవుట.
8. రథ అశ్వ గజ బలములు సమృద్ధిగా ఉన్నప్పటికీ, శస్త్రములు కోకొల్లలుగా ఉన్నను యోధుడు వీర ధర్మమును విస్మరించి రణరంగమున వెన్ను చూపుట.
9. ప్రజ్ఞాశాలి అయిన గురువు వాత్సల్యంతో పూనిక వహించి, శాస్త్రార్థాలను, వాటి రహస్యాలను విస్మరించుట (మరిచిపోవుట), శాస్త్ర విరుద్ధమైన కర్మను ఆచరించుట.
10. మేక పాలను దేవతలకు, పితృ దేవతలకు, అతిథులకు, అభ్యాగతులకు అర్పించకుండా తినెడి మూర్ఖుడైన తిండిపోతు (అనగా ముందుగా ఆహారాన్ని దేవతలకు, పితృదేవతలకు, అతిథులకు ఇత్యాది వారికి అర్పించుకున్న పిదప మాత్రమే భుజించాలి).
11. బుద్ధి హీనుడై గురువును అవమానించుట (తల్లి తండ్రి గురువు మొదలగు వారిని నిందించుట).
12. రహస్యంగా ఉంచాల్సిన లోకాపవాదాన్ని తనపై గల విశ్వాసంతో ఎవరైనా తనకు చెప్పిన ఎడల దాన్ని రహస్యంగా ఉంచక ఇతరులకు తెలుపుట.
13. మేలు చేసిన వారికి ప్రత్యుపకారము చేయకపోవుట.
14. తన ఇంట్లో భార్యా పుత్రులు ఇతర ప్రియ జనులు తనతో చేరి యున్నను వారికి ఎవ్వరికీ పెట్టక తానొక్కడే షడ్రసోపేతంగా భుజించుట.
15. తగిన భార్యను చేపట్టక పోవుట, అగ్నిహోత్రాది ధర్మ కార్యాలను నిర్వహించక పోవుట, సంతాన హీనుడిగా మరణించుట.
16. తన ధర్మపత్ని యందు సంతతని పొందని వాడై, అర్ధాయుస్సుతో మరణించుట.
17. రాజును, స్త్రీలను, బాలబాలికలను, వృద్ధులను చంపుట.
18. విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించుట.
19. అమ్మకూడని లత్తుక (లత్తుక అనగా Lettuce, క్యాబేజీ లాంటి శాకాలు), తేనే, మాంసం, లోహము, విషము మున్నగు నిషిద్ధ వస్తువులను విక్రయించి భార్యా పుత్రులను పోషించుట.
20. ఉభయ శత్రు పక్షాల మధ్య ఘోరముగా పోరు సాగుచున్న సమయంలో వెన్నుచూపి, పారిపోవుట (ఇట్టి వారు చంపబడుదురు, నరకానికి వెళ్తారు).
21. మాసిపోయిన, చినిగియున్న వస్త్రాలను ధరించుట, పుర్రెను చేతబూనుట, బిచ్చమెత్తుకొనుట (అసలు బిచ్చం ఎత్తుకోవడమే ఒక ఘోర పాపం). ఆవిధంగా బిచ్చం ఎత్తుకుంటూ ఉన్మత్తుడి వలే సంచరించుట.
22. కామక్రోధాలకు వశుడై, మద్యపానము, స్త్రీ సంగమము, ద్యూత క్రీడలు ఇత్యాది వాటి యందు సదా ఆసక్తుడై ఉండుట.
23. ధర్మ కార్యములందు మనస్సు పెట్టక, సర్వదా అక్రుత్యాలకే పాల్పడుట.
24. అర్హతను మించి అడ్డదిడ్డంగా దానాలు చేయుట.
25. అక్రమార్జన (పాప పద్ధతుల ద్వారా ధనార్జన).
26. సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలో గాని లేదా అస్తమించు చున్న సమయంలో గాని నిదురించుట.
27. పరుల ఇండ్లకు నిప్పు పెట్టుట. పరులను గృహ హీనుడిని చేయుట.
28. గురువుకు మరియు మిత్రునికి ద్రోహం తలపెట్టుట.
29. దేవతలను సేవించక పోవుట (ఆరాధించక పోవుట).
30. జీవించి యున్న తల్లిదండ్రులకు సేవలు చేయకపోవుట.
31. మాతా పితరులు స్వర్గస్తులైన పిమ్మట వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహించక పోవుట.
32. సత్పురుషులను దర్శించక పోవుట, సాధువర్తనులను శ్లాఘించక పోవుట, సజ్జనులకు సేవలు చేయక పోవుట.
33. నిత్యమూ భక్తి శ్రద్ధలతో ఆచరించ వలసిన మాతా పితృ దేవతల సేవలు మాని, అధర్మ మార్గమున ఊరేగుట.
34. దరిచేరి ప్రస్తుతించెడి వారి ఆశలను, ఉన్నతాసనములపై కూర్చొన్న దాతల యొక్క వదనాలను వీక్షించుచు, ఊర్ధ్వ ముఖులై నిరీక్షిస్తున్న దీనుల ఆశలను, చెంత నిలబడి వేడుకోనుచున్న ఆర్తుల ఆశలను వమ్ము చేయుట.
35. ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుట, ఇతరులపై చాడీలు చెప్పుట, పవిత్రత లేక రాజు తనకు ఏ శిక్ష విధించునో అని భయపడుచూ, అధర్మ మార్గాన పరులను వంచిస్తూ జీవించుట.
36. పెండ్లి చేసుకున్న ధర్మపత్నిని కాదని, పర స్త్రీలతో సుఖించుట.
37. అన్నదానాదులను చేయకపోవుట. స్త్రీలను వేధించుట.
38. త్రాగుటకు అనువైన నిర్మల జలాన్ని పాడు చేయుట (మురికి చేయుట)
39. ఇతరులను చంపుట, విషప్రయోగం చేయుట
40. లేగదూడకు మిగుల్చకుండా తల్లి ఆవు పొదుగు నుండి పూర్తిగా పాలు పిండుట.
41. త్రాగుటకు అనువైన నిర్మల జాలం ఇంట్లో పుష్కలంగా ఉన్నా దాహార్తియై వచ్చిన వాడి దాహాన్ని తీర్చక అసత్యములు పలుకుట, వంచన చేయుట.
42. వాది, ప్రతివాది వివాదపడు చుండగా, వారిలో ఒక్కరిపై పక్షపాతము వహించి, వానిని గెలిపించుట.
ఇవన్నీ కూడా మహా పాపాలు. ఇంతే కాదు, ఇంకా కూడా చాలా ఉంటాయి. మాతృ శాప సుతక్షయ, పిత్రుశాప సుతక్షయ, భ్రాతృ శాప సుతక్షయ, గురు శాప సుతక్షయ, బ్రహ్మ శాప సుతక్షయ, దైవ శాప సుతక్షయ, బ్రూణ హత్యాది పాపాలు, ఇత్యాది ఎన్నో ఘోర మరియు మహా పాపాలు ఉంటాయి. ఇట్టి మహా పాపాలను ఆచరించు వాడు దుర్గతి పాలగుట తథ్యము. వీరు దరిద్రులై జన్మిస్తారు. మతిభ్రమణ యోగాలతో జన్మిస్తారు, పోషించుటకు వీలుకానంత మంది సంతానాన్ని కలిగి ఉంటారు. ఘోర రోగాలతో జన్మిస్తారు. సంతాన హీనులౌతారు. నరక యాతనలు అనుభవిస్తారు. దారిద్రాన్ని అనుభవిస్తారు, గుడ్డివారిగా, అవిటి వారిగా జన్మిస్తారు. అందుకే కర్మను ఆచరించే ముందు బుద్ధిని తప్పక ప్రయోగించాలి. ఆలోచనా రాహిత్యంతో కర్మలను ఆచరించ రాదు. అట్టి దుష్క్రుతాల ఫలాలను మనం మాత్రమే కాదు మన సంతానం కూడా అనుభవిస్తుంది.
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ।
కృత కర్మ క్షయం నాస్తి కల్పకోటి శతైరపి ।।
తాము ఒనర్చిన పుణ్య పాప కృత్యాల ఫలితాలు ఎవ్వరైనను అనుభవించక తప్పదు. శతకోటి కల్పాలు గడిచినా ఇట్టి ఫలం అనుభవించనిదే శూన్యం కాదు. ‘భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే’ అని బ్రహ్మసూత్ర ప్రమాణం. చేసుకున్న కర్మల ఫలితాలను అనుభవించనిదే అవి దహించబడవు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఒక్కరూ పాప కర్మలను నియంత్రిస్తాననే శపథం తీసుకోవాలి. ఆచరించాలి. అప్పుడే శ్రీరాముడి ఆదర్శాన్ని మనం అనుసరించిన వారమౌతాము.
శ్రీ సీతారాముల అనుగ్రహం అందరి యందు సదా ప్రతిష్ఠించబడి ఉండుగాక.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –
న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ
శ్రీ విశ్వావసు శ్రీ రామ నవమి.
06.04.2025