Astrology

శ్రీ గణేశాయ నమః  శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శుభ గ్రహ

 

శ్రీ శోభకృత్ (శోభన) నామ సంవత్సర పఞ్చాఙ్గ పఠనం

 

ఈ పఞ్చాఙ్గ పఠనము లోక కళ్యానార్థము నిర్దేశించ బడినది. అంతే గాని వ్యక్తిగతముగా గాని, ఏదేని ఒక వర్గమును గాని, మతమును గాని, కులాన్ని గాని మరియు ఏ ఇతరులను గాని ఉద్దేశించి చేసింది కాదు. శాస్త్రాన్ని నిష్కర్షగా విడమరచి చెప్పుటయే దీని ప్రధాన ఉద్దేశ్యం. మీ అందరు సహృదయంతో ఆదరిస్తారని భావిస్తున్నాను.

 

శ్లో:  కళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్న దోషావహం ।

       గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణామ్ ।।

       ఆయుర్వృద్ధిదమ్ ఉత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం ।

       నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్ ।।

       శ్రీమత్కామితదాయి కర్మషహరం దుర్దోష శాంతిప్రదం ।

       నానా యజ్ఞ విశేషమధ్యఫలదం భూదాన తుల్యం నృణామ్ ।।

       ఆరోగ్య ఆయురభీష్టదం శుచికరం సంతాన సౌఖ్యోదయం ।

       పుణ్యం కర్మ సుసాధనం శృతి హితం పంచాంగ మాకర్ణ్యతాం ।।

 

అనగా శోభాయుక్తమైనది, కోరికలు తీర్చునది, పాపాలను సంహరించునది, దుర్దోషములను పోగొట్టునది, అనేక యజ్ఞముల వలన పొందిన ఫలాలను ప్రసాదించునది. జనులకు భూదానాది సమానమైన ఫలాలను ప్రసాదించు నది. ఆయుష్షు మరియు ఆరోగ్యమును కలుగజేయునది, సంతాన సౌఖ్యమును మరియు పవిత్ర కర్మలకు యోగ్య ప్రదమగు శాస్త్ర సమ్మతమైన పఞ్చాఙ్గ పఠనమును వినవలెను.

 

యుగారంభం చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాది పండగ గా మనము జరుపుకుంటాము. ఇట్టి శుభ దినమున బ్రాహ్మి ముహూర్తమున లేచి కాలకృత్యాదులను తీర్చుకొని, మంగళ స్నానాలను ఆచరించి, నూతన లేదా శుభ్రమైన వస్త్రములను ధరించి; శ్రీమన్మహా గణపతిని, శ్రీ సరస్వతి మరియు లక్ష్మీ దేవిని, మన ఇష్ట మరియు కుల దైవమును ఆరాధించి, దైవజ్ఞులు మరియు గృహము నందు గల పెద్దల ఆశిస్సులు పొంది, పఞ్చాఙ్గాన్ని పూజించి నమస్కరించాలి. పిదప వేప పువ్వు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, బెల్లం మరియు ఆవు నెయ్యితో చేసిన ‘పఞ్చ భద్ర’ అనే ఉగాది పచ్చడిని దైవానికి నివేదించి పిదప బంధు మిత్రులతో కలిసి సేవించాలి.

 

కాల ప్రమాణం (సంక్షిప్తంగా)

చతుర్యుగాలు:

సత్య యుగ           17,28,000 సం

త్రేతా యుగ           12,96,000

ద్వాపర యుగం      8,64,000

కలియుగం            4,32,000

మొత్తం                43,20,000 -    ఒక చతుర్యుగం లేదా కల్పం

ఒక మన్వంతరం 71 చతుర్యుగాలు (30,67,20,000)

ఒక మన్వంతర సంధి 17,28,000 (ఒక సత్యయుగ ప్రమాణం)

బ్రహ్మ ౧ దిన          432,00,00,000 (14 మన్వంతరాలు మరియు 15 మన్వంతర సంధులు)

14 మన్వంతరాలు: 1. స్వాయంభువ, 2. స్వారోచిష, 3. ఉత్తమ, 4. తామస, 5. దైవత, 6. చాక్షుష, 7. వైవస్వత, 8. సూర్య సావర్ణి, 9. దక్ష సావర్ణి, 10. బ్రహ్మ సావర్ణి, 11. ధర్మ సావర్ణి, 12. రుద్ర సావర్ణి, 13. దేవ సావర్ణి మరియు 14. ఇన్ద్ర సావర్ణి. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరం లోని కలియుగ ప్రథమ పాదంలో గతాబ్దాః 5124 (అనగా గడచిపోయినవి).

 

ప్రభవ నుండి అక్షయ వరకు 60 సం. అందులో ఈ రోజు 37 వ సం అయిన శ్రీ శోభకృత్ (శోభన) నామ సం ప్రారంభం. వచ్చే సంవత్సరం శ్రీ క్రోధి నామ సం.

 

శ్రీ శోభకృత్ (శోభన) నామ సం ఫలం:

శ్లో:    శోభకృత్ వత్సరే సర్వ సస్స్యానామభివృద్ధయః

         నృపాణాం స్నేహమనోన్యం ప్రజానాంచ పరస్పరమ్ ।।

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సర్వ సస్స్యములు చక్కగా వృద్ధి చెందుతాయి. ప్రజలు మరియు రాజులు అన్యోన్య స్నేహభావంతో ఉంటారు.

(శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు దుఃఖమును పోగొట్టి సంతోషమును కలుగ జేయును. భూమి నానా విధములైన ఉత్సవములతో కూడి ఉంటుంది. ఆటంకములు, చొరభయం అధికంగా ఉంటాయి. ప్రభువులు యుద్ధము నందు ఆసక్తి కలవారగుదురు)

 

బార్హస్పత్యమానేన శ్రీ  నల నామ సం. ఫలం:

శ్లో:    నలాబ్దే మధ్య సస్యార్ఘ వృష్టయః ప్రచురాగదాః

         నృప సంక్షోభ సంభూత అగ్నిభీకర వృష్టయః ।।

బార్హస్పత్యమానాన్ని అనుసరించి నల నామ సంవత్సరము. నల నామ సంవత్సరంలో పంటలు మధ్యమంగా ఉంటాయి. ధరలు సామాన్యంగా ఉంటాయి. వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. రోగాలు వ్యాపిస్తాయి. ప్రభువులకు పరస్పర కలహం, అగ్నిభయం, భీతిని కలిగించు వర్షాలు కురుస్తాయి.

(లోకమంతా కూడా (అనగా ప్రజలందరూ కూడా) రాక్షసుల వలే దయలేని వారగుదురు. స్వార్థబుద్ధితో తమ వ్యక్తిగతములపై ఆకాంక్ష గల వారుగా ఉంటారు. సస్యములు – ధరలు – వర్షాలు సామాన్యంగా ఉంటాయి)

 

గురూదయ వశాత్ శ్రీ ఆశ్వయుజాబ్ద ఫలమ్:

శ్లో:    ఆబ్దేహ్యాశ్వయుజేఽత్యర్థం సుఖిన స్సర్వజంతవః

         మధ్యమం పూర్వసస్స్యంచ సంపూర్ణమపరంఫలం ।।

ఆశ్వయుజాబ్దమున సర్వ ప్రాణికోటికి సుఖకరముగా ఉండును. ధాన్యము మొదలగు తొలకరి పంటలు మధ్యమముగా పండినను, అపర సస్స్యములు మున్నగు 2 వ పంటలు బాగుగా పండి లాభదాయకంగా ఉండును.

(లతలచే ఏర్పడు పంటలు, పూర్వ సస్యములు అభివృద్ధి నొందును, అపర సస్యములు సామాన్యంగా ఫలిస్తాయి. కొన్నిచోట్ల సుభిక్షము గాను మరియు కొన్ని చోట్ల భయంకరం గాను ఉంటాయి)

 

అథ రాజాది నవనాయకా ఫలమ్:

 

రాజ్ఞాః బుధస్య ఫలమ్:

వర్షారంభము బుధవారం అగుట వలన రాజు బుధుడు.

ప్రభూత వాయుర్భువి మధ్యవృష్టిర్గదాహవ ప్రోద్ధతరాజకోపః

బుధేఽబద్ధనాధే ప్యపరంచ సస్స్యం శ్రేష్ఠంచవృద్ధిర్లిపి లేఖకానాం ।।

గాలులు అధికంగా వీస్తాయి, వాయు పీడనం అధికంగా ఉంటుంది. తత్ప్రభావము వలన వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. రాజులు కోప తాపాలకు గురి కాగలరు. 2 వ పంట (రబీ) చక్కగా పండుతుంది. రచయితలకు అభివృద్ధికరంగా ఉంటుంది. సస్యములకు తగినంత వర్షపాతం ఉంటుంది. ప్రజలందరూ ధర్మ కార్య నిరతులై ఉంటారు. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. దేశం సుభిక్షంగా ఉంటుంది.

(మందుడు రాజు అగుట వలన దేశాభివృద్ధి మందగతిన సాగుతూ ఉంటుంది. అభివృద్ధి పరమైన నిర్ణయాలు వెనకబడుతూ ఉంటాయి. పాలకులు నీచమైన స్వభావము గల వారౌతారు. ప్రజలు శ్రమతో కూడిన ఫలాన్ని అనుభవిస్తారు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలం ఉంటుంది. దేశ మరియు ప్రపంచ ఆర్థికాభివృద్ధి పూర్తి మందగతిన సాగుతూ ఉంటుంది. ప్రజలకు శారీరిక బాధలు అధికంగా ఉంటాయి. నీచపు పరిపాలన కనిపిస్తూ ఉంటుంది. దేశంలోనూ, ప్రపంచంలోను పేదవారి సంఖ్య చాలా పెరుగుతుంది. ప్రథమార్ధం కంటే ద్వితీయార్థంలో అధిక శుభ ఫలాలు లభిస్తాయి)

 

మంత్రిణః శుక్రస్య ఫలమ్:                                                                        

మేష సంక్రమణం శుక్ర వారము అగుట వలన మన్త్రి శుక్రుడు:

సువృష్టి సర్వ సస్స్యాని సర్వేధర్మరతాః ప్రజాః

క్షేమారోగ్యే సుభిక్షం స్యాన్మంత్రిణ్యబ్ధే భృగౌయది ।।  

మంత్రి శుక్రుడు అగుట వలన సర్వ సస్స్యములు సమృద్ధిగా పండును. సువృష్టికరముగా ఉండును. ప్రజలందరూ వారివారి ఆచార వ్యవహారములను పాటించుటకు ఆసక్తిని కలిగి ఉందురు. ప్రజలకు ఆరోగ్యము మరియు క్షేమకరముగా ఉండును.

వి: శుక్ర భ మంత్రి అగుట వలన ప్రజలు సర్వ విధ సుఖములను అనుభవించుదురు. ప్రజలకు విలాసాల పట్ల శ్రద్ధ అధికంగా ఉంటుంది. విలాసవంతమైన గృహ మరియు వాహనములను సమకూర్చుకొనుటలో ఆసక్తి అధికంగా ఉంటుంది.

(భూమి చక్కని ధాన్య సంపదతో తులతూగుతూ ఉంటుంది. చక్కని వర్షాలు కురుస్తాయి. వృక్ష జాతులు బాగుగా ఫలిస్తాయి. భూమి అంతా ప్రజలతోను, గో సంపదలతోను తులతూగుతూ ఉంటుంది)

 

సేనాధిపతేః గురోః ఫలమ్:

సింహ సంక్రమణం గురు వారమగుట వలన సేనాధిపతి గురు భ:

సేనాధిపే దేవ గురౌధరిత్ర్యాం సువృష్టిరత్యంతజనానురాగః ।

దేవోత్సవో భూసురయజ్ఞకర్మా రాజాప్రజాపాలన తత్పరస్యాత్ ।।

గురు భ సేనాధిపతి అయిన ఎడల, భూలోకమున సువృష్టి, చక్కని వర్షాలు కురుస్తాయి. రాజ్యంలో గల వారందరూ అత్యంత అనురాగ, వాత్సల్యాలతో కలిసిమెలిసి ఉంటారు. బ్రాహ్మణులు యజ్ఞ యాగాలు ఆచరించడం లోను మరియు దేవతా ఉత్సవాలు జరిపించడంలో శ్రద్ధను కలిగి ఉంటారు. పాలన ప్రజారంజకముగా ఉంటుంది. అనగా ప్రభువులు లేదా ప్రభుత్వాలు చక్కని పాలనను అందిస్తాయి.

(బుధుడు సైన్యాధిపతి అయిన ఎడల, వర్షించే మేఘాలు గాలి ద్వారా చెదరగొట్ట బడతాయి. అప్పుడప్పుడు వర్షిస్తాయి. సస్యాలు చక్కగా ఫలిస్తాయి. ప్రజలందరిలో కామ వాంఛ (కోరికలు) అధికంగా ఉంటుంది)

 

సస్స్యాధిపతేః చన్ద్రస్య ఫలమ్:

కర్కాటక సంక్రమణం సోమవారం నాడు అగుట వలన సస్స్యాధిపతి చన్ద్రుడు.

జలధాన్యాని సర్వాణి స్థల ధాన్యాని యానిచ

వృక్షజాతి స్సుఫలితా చన్ద్రే సస్స్యాధిపే సతి ।।

చన్ద్రుడు సస్స్యాధిపతి అగుట వలన – మెట్ట-పల్లపు భూములలో పండు ధాన్యాలు అన్నియు ఫల, వృక్ష జాతులన్నీ పుష్కలంగా ఫలిస్తాయి (ఈ సంవత్సరంలో అన్ని విధములైన పంటలు పుష్కలంగా పండుతాయి)

(కృష్ణ వర్ణము గల తిలలు, మాష ధాన్యము (మినుములు) మరియు ఉలవలు సమృద్ధిగా పండుతాయి. కృష్ణ భూమి అనగా నల్లరేగడి నేలలు చక్కగా ఫలిస్తాయి)

(గత సంవత్సరంలో కూడా సస్స్యాధిపతి శనేశ్వరుడు)

 

ధాన్యాదిపతేః శన్యస్య ఫలమ్:

ధనుస్సంక్రమణం శని వారం అగుట వలన ధాన్యాధిపతి శని.

కృష్ణధాన్యాని సర్వాణి సూక్ష్మధాన్యాని యానిచ ।

కృష్ణభూమిస్సుఫలితా ధాన్యాధీశే శనైశ్చరే ।।

శని భ ధాన్యాధిపతి అగుట వలన అన్ని రకములైన సూక్ష్మ ధాన్యాలు చక్కగా ఫలిస్తాయి. నల్లరేగడి భూములయందు పంటలు చక్కగా పండుతాయి.

(శుక్ర భ ధాన్యాధిపతి అయిన ఎడల – అన్ని విధములైన ధాన్యాలు సమృద్ధిగా పండుతాయి. వర్షాలు చక్కగా కురుస్తాయి. దేశం సుభిక్షంగా ఉండి జనులందరూ సుఖసంతోషాలతో తులతూగుతారు. ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటారు. రోగ బాధలు ఉండవు. సుగంధ ద్రవ్యాలు అధికంగా లభిస్తాయి)


అర్ఘాధిపతేః గురోః ఫలమ్:

మిథున సంక్రమణం గురువారం అగుట వలన అర్ఘాధిపతి గురుడు:

సువృష్టిర్ధాన్యధనైర్విరాజితా భూమిర్మహా యజ్ఞపరై ర్మహీసురై ।

నిత్యోత్సవైర్మంగల తూర్యనిస్వనై రర్ఘాదిపే దేవగురౌచ శశ్వత్ ।।

గురు భ అర్ఘాధిపతి అయిన ఎడల – భూమి అంతయూ సువృష్టిగా ఉండగలదు. ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. బ్రాహ్మణులు యజ్ఞ యాగాదుల యందు ఆసక్తి గల వారై ఉంటారు. మంగళ వాద్యాలతో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.

(బుధుడు అర్ఘాధిపతి అయిన ఎడల – వర్షాలు అధికంగా కురుస్తాయి. ధరలు పెరుగుతాయి. పంటలు అధికంగా పండుతాయి. కౌమార మతం వారు (శ్రీ కుమారస్వామిని ఆరాధించు వారు), పాషండులు (దేవుడి ఎడల భక్తి లేని వారు), జైనులు, ఇంద్రజాల మతస్థులు తమ సిద్ధాంతాలలో విఫలం చెంది నవ్వుల పాలౌతారు (కౌమార మతం వారికి, ఇంద్రజాల మతం వారికి అంగారకుడు అధిపతి. బుధ మరియు భౌముడి మధ్య గల వైరం వలన వీరు ప్రతికూలతలను ఎదుర్కొను అవకాశం కలదు)

 

మేఘాధిపతేః గురోః ఫలమ్:

సూర్యుడు ఆర్ద్ర నక్షత్ర ప్రవేశము గురువారం నాడు అగుట వలన మేఘాధిపతి గురు భ.

సస్స్యార్ఘవృష్టిభిస్తుష్టా భేవేద్ధాత్రీ నిరంతరం ।

వీతరోగా భయాస్సర్వే మేఘాధీశే బృహస్పతౌ ।।

గురు భ అర్ఘాధిపతి అయిన ఎడల – భూమి అన్ని రకములైన సస్యములతో, చక్కని వర్షాలతో, మంచి ధరలతో ఉండును. ప్రజలందరూ ఉత్సాహవంతులై రోగ భయం లేకుండా ఉంటారు.

(పంటలు మరియు వర్షాలు మధ్యమంగా ఉంటాయి. మేఘాలు గాలులచే ఎగరగొట్టబడతాయి. మధ్య ప్రదేశమున మంచి వర్షాలు కురుస్తాయి)

 

రసాధిపతే సౌమ్యస్య (బుధస్య) ఫలమ్:

తులా సంక్రమణము బుధవారము అగుట వలన రసాధిపతి సౌమ్యుడు (బుధుడు).

శశితనయే రసనాధే సుపిప్పలీ శొంఠి హింగులశునాని ।

ఘృత తైలార్యం నిఖిలం దుర్లభమిక్షూద్భవం శకలం ।।

పిప్పలి, శొంఠి, ఇంగువ, నెయ్యి, నూనె, బెల్లము (శర్కర), వెల్లుల్లి వంటి రస సంబంధమైన వస్తువుల లభ్యత తక్కువగా ఉంటుంది (వాటి ధరలు అధికంగా ఉంటాయి)

(నెయ్యి, నూనే, బెల్లము, తేనే, పాలు, పెరుగు, శర్కర ఇత్యాది రస వస్తువులు అధిక ధరలను కలిగి ఉంటాయి. ప్రజలు ఆరోగ్య వంతులుగా ఉంటారు)

 

నీరసాధిపతేః చన్ద్రస్య ఫలమ్:

మకర సంక్రమణము సోమ వారమగుట వలన నీరసాధిపతి చన్ద్రుడు.

ముక్తాఫలం రత్నసువర్ణబీజ కాంస్యాది వస్త్రాభరణాని సర్వం ।

వృద్ధింగతా న్యాశుభవన్తిలోకే చన్ద్రో యదా నీరస నాయకోభవేత్ ।।

ముత్యములు, రత్నములు, బంగారం, విత్తనాలు, కంచు, వస్త్రములు, సమస్త ఆభరణములు ఇత్యాది వాటి లభ్యత అనుకూలంగా ఉంటుంది (వాటి ధరలు అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి. బంగారం ధన అదుపులో ఉంటుంది)

(బంగారు, రత్నములు, వెండి, ముత్యాలు, మంచి గంధము, కర్పూరం ఇత్యాది వస్తువుల లభ్యత తక్కువగా ఉంటుంది. ధరలు అధికంగా ఉంటాయి. లోహాలు, తగరం మరియు నూనే వృద్ధి చెందుతాయి. వాటి ధరలు కూడా అధికంగా ఉంటాయి)

 

మేష సంక్రమణ ఫలం:

చైత్ర బ నవమి శుక్రవారం రా 11:14 ని శ్రవణ నక్షత్ర యుక్త సాధ్య యోగ గార కరణ సింహ లగ్నే అశ్విని నక్షత్ర 1 చరణే భానోర్మేశ రాశి ప్రవేశః.

దివాచేన్మేష సంక్రాంతి రనర్ఘ కలహప్రదా ।

రాత్రౌ సస్స్యాభివృద్ధి స్స్యాత్ క్షేమశ్రీ సుభిక్షకృత్ ।।

పగలు మేష సంక్రాంతి వలన కలహములు అధికం, రాత్రి యందు సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును.

ఈ సంవత్సరం రాత్రి పూట మేష సంక్రమణం అగుట వలన – సస్స్య వృద్ధి, క్షేమము, ఆరోగ్యము, సుభిక్షము కల్గును. శుక్రవారం – సస్స్య వృద్ధి, సాధ్య యోగము – పూర్ణ ఫలం, శ్రవణ నక్షత్రం – శుభకరం, గర కరణం  - లోకపీడ, పూర్వాషాఢ ఆది 4 మండలం – శుభకరము.

 

ఆర్ద్ర ప్రవేశ కాల ఫలమ్:

దివార్ద్రా సస్య నాశాయ రాత్రౌ సస్స్యాభివృద్ధయే ।

అస్తమా నేర్థ రాత్రౌ చే న్మహదర్ఘం సువృష్టికృత్ ।।

ఉదయాది ద్వికాలము లందు ఆర్ద్ర కార్తె ప్రవేశించిన ఎడల సస్స్య నాశనము కలుగును, రాత్రి యందు అయిన ఎడల సస్స్యాభివృద్ధి ఉంటుంది. సాయంత్రము మరియు రాత్రి సమయమున ప్రవేశించిన ఎడల సువృష్టి మరియు ధాన్యానికి ధరలు అధికంగా ఉంటాయి.

 

అస్మిన్ వర్షే ఆషాఢ శు చతుర్థి గురువారం సా 05:28 సమయే భానోరార్ద్ర ప్రవేశః

పఞ్చమి – శుభకరము, గురువారం – ధరలు సమృద్ధిగా ఉంటాయి, ఆశ్రేష – ఇబ్బందికరం, వృశ్చిక లగ్నం – యుద్ధభీతి, హర్షణ యోగము – శుభకరం, సాయంకాలం – సువృష్టికరం, బవ కరణం  - సౌఖ్యకరం, ఆర్ద్రాది ద్వితీయ మండలం – అతివృష్టి.

 

అథ ప్రత్యబ్ద యోగ పంచక ఫలం:

౧.     జ్యేష్ఠ శు ప్రతిపద వార ఫలం – శనివారం

జలోపప్లవం – ప్రజా నాశనం, రాజులకు పదవీ భంగం, మధ్య సస్స్యములు, ధరలు ఎక్కువ.

(దుర్భిక్షం, యుద్ధం మరియు రోగ భయం, పాలకులకు పరస్పర విరోధం. మహా నగరాలకు, గ్రామ వన మరియు పర్వతాలలో అగ్నిభయం)

 

౨.    ఆషాఢ శు పంచమి యుక్త వర ఫలం – శుక్రవారం

ఆషాఢ శుక్ల పఞ్చమి శుక్రవారం అగుట వలన – ఆరోగ్యము, శుభకరము.

(సోమవారం అగుట వలన సుభిక్షము, క్షేమం, ఆరోగ్యం, సువృష్టి ఉంటాయి)

 

౩.     చిత్త నక్షత్ర యుక్త ఆషాఢ శు నవమి ఫలం:

ఆషాఢ శుక్ల నవమి చిత్త నక్షత్ర యుక్తమగుట వలన సర్వ సస్స్య వృద్ధి, ప్రజలు సంతోషంగా ఉంటారు.

(స్వాతి నక్షత్ర యుక్త ఆషాఢ శుద్ధ నవమి వలన – సర్వత్రా వాయు పీడనం అధికంగా ఉంటుంది, సస్స్య నాశనం జరుగుతుంది)

 

౪.     ఆషాఢ బహుళ ద్వాదశి యుక్త రోహిణి నక్షత్ర ఫలం:

ఆషాఢ బ ద్వాదశి నాడు రోహిణి నక్షత్రమగుట వలన సర్వ సస్స్య వినాశనము.

 

౫.    పౌష్య బహుళ అమావాస్య ప్రయుక్త వార ఫలం:

శుక్రవారం అయినందున – ద్రవ్య వృద్ధి

 

వాస్తు కర్తరీ నిర్ణయము

04.05.2023 to 10.05.2023 -    డొల్లు కర్తరి  

11.05.2023 to 29.05.2023  -    నిజ కర్తరి (వస్తు కర్తరి)

వాస్తు కర్తరి యందు మట్టి, శిల, కర్ర పనులు నిషేధము. నూతన గృహ నిర్మాణము చేపట్ట రాదు. వృక్షములు నరుకుట, బండలు కొట్టుట చేయరాదు. నూతన గృహ ప్రవేశము చేసుకొనవచ్చును.

 

కుజ చార ఫలము

ఈ సంవత్సరంలో కుజునికి వక్రత్వము లేదు. కావున, గతంలో వలె ‘నిస్త్రంశ’ ముఖుడనే పేరుతో పిలువబడును.

ఫలం – అధిక ధరల వలన ప్రజలు బెంబేలెత్తుతారు. రాజులకు యుద్ధ భయం అధికంగా ఉంటుంది.

 

గురు చార ఫలము:

ఈ సంవత్సరంలో బృహస్పతి మీన మరియు మేష రాశులందు సంచరించును. వత్సరాదిలోనే ఇట్టి మార్పు ఉండుట వలన వత్సరాంతం వరకు కూడా ఇవే ఫలితాలు లభించు సూచనలున్నాయి.

సంవత్సరాది నుండి 21.04.2023 వరకు – మీనం. అటుపిమ్మట వత్సరాంతం వరకు మేష రాశిలో సంచారము.

గురోః మీన రాశి సంచార ఫలం:

నానావిధోద్యాన తటాక సస్స్య మహోత్సవానేక మఘక్రియాద్యై ।

మీనస్థితే దేవగురై ధరిత్రీ రమాక్షితిశా స్సభినఃవరేచ ।।

పువ్వుల తోటలు చక్కగా ఫలిస్తాయి. చెరువులు నిండుగా ఉంటాయి. అనేక విధములైన పంటల చేత జనులు సంతోషంగా ఉంటారు. రాజులు (పాలకులు) దేశ ప్రజలు సుఖంగా ఉంటారు. దేశం సుభిక్షం గాను, దేశ ప్రజలు ఆరోగ్యంగాను ఉంటారు. జల వివాదాలు కొంతవరకు తగ్గు అవకాశం కలదు.

గురోః మేష రాశి సంచార ఫలమ్:

మేషస్థితే దేవగురౌ చ మేష వినాశనంసస్యమహార్ఘవృద్ధిః ।

భూపాలకానాం కలహంతథాపి భవంతిచాన్యే సుఖినోజనాశ్చ ।।

మేకలకు పీడ, ఈతిబాధలు, సస్స్యములు వృద్ధి చెందుట, చక్కని ధరలను కలిగి ఉండుట, చోర భయము, రాజులకు పరస్పర విరోధము మరియు యుద్ధమునందు ఆసక్తిని కలిగి ఉంటారు, ప్రజలకు సుఖకరము.

 

శని సంచార ఫలము:

ఈ సంవత్సరమంతయూ శని భ కుంభ రాశిలో సంచరించును.

శనేః ఘటస్థే సతి వృష్టినాశో రాజ్ఞాంభయం సస్యలయో నరాణాం ।

భిషగ్వరాణాంచ కవీశ్వరాణాం కోశాధి పానాంచ మహద్భయంస్యాత్ ।।

కుంభ రాశిలో శని సంచారం వలన వృష్టి నాశనము, రాజ భయము, అనావృష్టి, యుద్ధ భయం, సస్స్య నాశనము, వైద్యులకు, కవులకు, ధనాధిపతులకు భయం అధికం. కాని, ఇట్టి సంచారము మగధ దేశాధిపతులు (మగధ ప్రాంత రాష్ట్రాలు మరియు జిల్లాలకు), ధనవంతులకు విజయ ప్రాప్తిని సూచించు చున్నది. ఇట్టి గోచార ప్రభావము వలన రోగ పీడ క్రమముగా తగ్గు సూచనలున్నాయి.

ధనిష్టా నక్షత్ర సంచార సమయంలో – ధనవంతులకు మగధ దేశాధిపతులకు విజయము.

శతతార – పూర్వాభాద్ర నక్షత్ర ద్వయ సంచారంలో వైద్యులకు, కవులకు, మంత్రులకు మరియు నీతిశాస్త్ర కోవిదులకు హానికరము.

  

మకర సంక్రాంతి పురుష లక్షణం:

ఏతద్వత్సరే పుష్య శు చతుర్థి ఇందువాసరే 14/15.01.2024, రా గం 02:45 నిమిషేషు భానోర్మకర రాశి ప్రవేశో భవతి.

 

త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్రం త్రినేత్రకం ।

లంబకర్ణం రక్తదంతం లంబ భ్రూ దీర్ఘనాసికమ్ ।

అష్టబాహుం ద్విపాదంచ వికృతం కృష్ణ వర్ణకం ।

శతయోజన మౌన్నత్యం విస్తీర్ణం ద్వాదశస్మృతమ్ ।

ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాన్తేః పురుష లక్షణమ్ ।।

మూడు శిరస్సులు, రెండు ముఖాలు, నాలుగు నాలుకలు, మూడు కళ్ళు, పెద్దగా మరియు పొడవుగా ఉండు చెవులు, ఎరుపు రంగు దంతాలు గల వాడు, పెద్దవైన కనుబొమలు గల వాడు, పొడవైన ముక్కు గల వాడు, ఎనిమిది బాహువులు కలిగి యున్న వాడు, రెండు పాదాలు గల వాడు, వికృతమైన నలుపు వర్ణంలో గల వాడు, వంద యోజనాల ఎత్తు మరియు విస్తీర్ణం కలిగి యుండి ద్వాదశ నామాలతో పిలువబడు సంక్రాంతి పురుషుడు చూడడానికి అత్యంత వికృతంగా ఉంటాడు.

ఆయన నామధేయం: ‘ద్వాంక్షుడు’ – ఫలం – వైశ్యులకు అరిష్టము

చందనోదక స్నానం – సుభిక్షం

తిథి (చవితి) ఫలం: రోగము

శుక్ల పక్షం: దుర్భిక్షం, క్షామం

నక్షత్ర (శతభిష):     క్షామం

వార (సోమవారము): సుభిక్షము

కాల (ఉదయం): రాజ్య నాశనం

లగ్న (మకర): రాజులకు యుద్ధం

చర్మ వస్త్ర ధారణ: రోగదాయకం

కర్పూర గంధ లేపనం: సుఖప్రదం

చంపక పుష్ప ధారణ: మనోవ్యాకులత

గ్రైవేయ (కంకణం లేదా కంటే) భూషణ: సస్స్య నాశనం

పాషాణ పాత్ర భోజనం: వ్యాధి నాశనం

గుడ (బెల్లం) పానం: ఆకలి అధికం

మధూక (ఇప్ప) ఫల భక్షణం: శుభప్రదం

పాశ శస్త్ర ధారణ: జయప్రదం

కంబల (కంబళి) ఛత్ర ధారణ: దుఃఖ నాశకరం

అశ్వ వాహన: రాజులకు కీడు

అధో ముఖం: దుర్భిక్షం

తిష్టాసన: మధ్యార్ఘం (ధరలు మధ్యమంగా ఉంటాయి)

ఈశాన్య దిగ్యాన: ఈశాన్య ప్రాంతాలకు క్షేమం

తృతీయ ముహూర్త: మహార్ఘప్రదం (ధరలు గొప్పగా ఉంటాయి)

 

శ్రీ శోభన నామ సంవత్సరంలో మౌఢ్య నిర్ణయము:

 

శ్రావణ మాసం – అధికం

 

శుక్ర మౌఢ్యమి:

04.08.2023, అధిక శ్రావణ బ తృతీయ, శుక్రవారం

నుండి

17.08.2023, నిజ శ్రావణ శు ప్రతిపద, గురువారం

 

గురు మౌఢ్యమి:

28.03.2023, చైత్ర శు సప్తమి, మంగళవారం

నుండి

30.04.2023, వైశాఖ శు దశమి, భానువారం

 

పుష్కర నిర్ణయము:

అస్మిన్ వర్షే వైశాఖ శు పాడ్యమి, భృగు వాసరే, 21.04.2023 రా తె గం 05:23 ని మేషే మిత్రక్షేత్రే బృహస్పతిః.  22.04.2023 మొదలు 03.05.2023 వరకు ‘గంగా’ నదికి పుష్కరాలు. ఇట్టి పుణ్య దినము లందు గంగా నదీ స్నానాలు, పిండ ప్రధానము, దాన ధర్మాదులు నిర్వహించినచో పితృ దేవతలు తరించెదరు.

పురాణాలలో చెప్పబడిన పుష్కర సమయంలో చేయవలసిన దానాలు:

మొదటి రోజు:-        సువర్ణ, రజత, ధాన్య, భూ దానాలు.
రెండవ రోజు:-         వస్త్ర, లవణ, రత్న దానాలు.
మూడవ రోజు:-       గుడ (బెల్లం), అశ్వ శాఖ, ఫల దానాలు.
నాల్గవ రోజు:-         ఘృతం (నెయ్యి), తైలం (నూనె), క్షీరం (పాలు), మధు (తేనె) దానాలు.
ఐదవ రోజు:-          ధాన్యం, శకట, వృషభ, హల దానాలు.
ఆరవ రోజు:-          ఔషధ, కర్పూర, చందన, కస్తూరి దానాలు.
ఏడవ రోజు:-          గృహ, పీట, శయ్య దానాలు.
ఎనిమిదవ రోజు:-     చందనం, కందమూల, పుష్ప మాల దానాలు.
తొమ్మిదవ రోజు:-     పిండ, దాసి, కన్యా, కంబళి దానాలు.
పదవ రోజు:-          శాకం (కూరగాయలు), సాలగ్రామ, పుస్తక దానాలు.
పదకొండవ రోజు:-    గజ దానం.
పన్నెండవ రోజు:-     తిల (నువ్వులు) దానం.

తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, పితృ దోషాలతో ఇబ్బంది పడుతున్నవారు, సంతాన లేమితో బాధపడుతున్న వారికి ఇట్టి దానాలు ఉపశమనాన్ని ప్రసాదించు సూచనలున్నాయి.

 

గ్రహణ నిర్ణయము:

 

28.10.2023, ఆశ్వయుజ పౌర్ణమి, స్థిరవాసరే, అశ్విని నక్షత్రే, కర్కాటక లగ్నే, మేష రాశ్యాం రా గం 01:08 ని రాహుగ్రస్త ఖండగ్రాస పాక్షిక చన్ద్ర గ్రహణం.

దక్షిణాగ్నేయ ఆసన్నే స్పర్శః – దక్షిణాసన్నే మోక్షః

ఇట్టి గ్రహణము ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా యొక్క చాలా భాగాలు, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రం, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా అన్ని ప్రాంతాలలో గాని లేదా కొన్ని ప్రాంతాలలో గాని కనిపిస్తుంది. ఇది ఎక్కడ కనిపిస్తుందో వారికి మాత్రమే గ్రహణ నియమాలు వర్తిస్తాయి.

28.10.2023 రాత్రి స్పర్శ     రా 01:06

మధ్యకాలం  రా 01:44

మోక్ష కాలం రా 02:22

ఆద్యంత పుణ్యకాలం గం 01:16 ని

ఇట్టి గ్రహణాన్ని అశ్విని నక్షత్ర జాతకులు, మేష, వృషభ, కన్యా మరియు మకర రాశుల వారు చూడ రాదు. వీరు గ్రహణ శాంతి చేసుకోవాలి.

నిత్య భోజనాదులు:

ప్రత్యాబ్దికములు యథా కాలమందు, యథావిధిగా నిర్ణయించుకోవచ్చు. రాత్రి భోజనం మాత్రం చేయరాదు. ఇట్టి భోజన నియమాలు, పిల్లలకు, వృద్ధులకు మరియు రోగగ్రస్తులకు వర్తించదు. గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను పాటించాలి.

 గ్రహణ గోచారము:

మేష – వృషభ – కన్య – మకర రాశుల వారికి అధమ ఫలమ్

సింహ – తుల – ధనుస్సు – మీన రాశుల వారికి మధ్యమ ఫలమ్

మిథున – కర్కాటక – వృశ్చిక – కుంభ రాశుల వారికి శుభ ఫలమ్

 

ఆదాయ వ్యయాలు:

రాశి ఆదాయము వ్యయము

మేషము 5 5

వృషభము      14 11

మిథునము 2 11

కర్కాటకము    11 8

సింహము 14 2

కన్య 2 11

తుల 14 11

వృశ్చికము 5 5

ధనుస్సు 8 11

మకరము 11 5

కుంభము 11 5

మీనము 8 11

  

రాజ పూజ్య రాజావమానము:

 

రాశి రాజ పూజ్యము రాజావమానము

మేషము 4 3

వృషభము 7 3

మిథునము 3 6

కర్కాటకము 6 6

సింహము 2 2

కన్య 5 2

తుల 1 5

వృశ్చికము 4 5

ధనుస్సు 7 5

మకరము 3 1

కుంభము 6 1

మీనము 2 4

 

 

శ్రీ శోభన నామ సంవత్సర ఫలం:

 

శ్రీ శోభన నామ సంవత్సర వర్శారంభం వృశ్చిక లగ్నమున అగుట, లగ్నాధిపతి అష్టమ స్థానమున ఉండుట, చతుర్థ స్థానమున శని భ, పఞ్చమ స్థానమున రవి బుధ చన్ద్ర మరియు గురు భ లతో శక్తివంతమైన రాజ యోగమున ఉండుట. షష్ఠ స్థానమున శుక్ర మరియు రాహువులు. జగల్లగ్నారంభం కన్యా లగ్నమున, లగ్న వశాత్ సప్తమ స్థానమున రవి మరియు గురు భ. అష్టమ బుధ రాహువు మరియు భాగ్య స్థానమున శుక్ర మరియు రాజ్య స్థానమున కుజ భ.

 

·         నవ నాయకులందు అధిక శాతం శుభ గ్రహాల ఆధిపత్యం అధికంగా ఉండుట వలన ఈ సంవత్సరంలో శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి. గురు భ ప్రమేయం అధికంగా ఉండుట వలన పాలకులు ధర్మ బద్ధమైన పాలనను అందించు సూచనలున్నాయి.

·         లగ్నమును గురు భ వీక్షించుట వలన దేశాధిపతి ధర్మ బద్ధమైన పాలన అందించే సూచనలున్నాయి. పఞ్చమ స్థానమున ఏర్పడిన శక్తివంతమైన రాజ యోగముల వలన దేశ ప్రగతి చక్కగా ఉంటుంది.

·         ప్రజలకు సుస్థిరమైన పాలన అందు సూచనలున్నాయి. ప్రభుత్వాలు నిలకడగా ఉండి చక్కని పాలనను అందిస్తాయి.

·         దేశ ప్రగతికి ప్రభుత్వాలు చక్కగా కృషి చేస్తాయి. వర్శలగ్న కుండలి నందు ఏర్పడ్డ శక్తివంతమైన రాజ యోగముల వలన దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇంకనూ పెంపొందు సూచనలున్నాయి.

·         జగల్లగ్న రాజ్య స్థానమున కుజ భ వలన రక్షణ రంగాలలో అభివృద్ధి చక్కగా ఉంటుంది. అంతేకాదు పొరుగు దేశాలతో విభేదాలు పెంపొందు సూచనలున్నాయి.

·         దేశ ఆర్థికాభివృద్ధి చక్కగా ఉన్నను చతుర్థ స్థానమున శని భ వలన శ్రమతో కూడిన ప్రగతిని సూచించు చున్నది. ప్రపంచ దేశాలు మాన్ద్యమును ఎదుర్కొంటున్న సమయంలో భారతదేశానికి ఇట్టి ముప్పు కొంత తక్కువగా ఉంటుంది.

·         ప్రజా ప్రయోజన పథకాలు చక్కగా అమలౌతాయి.

·         పారిశ్రామిక ప్రగతి మందగతిన సాగుతూ ఉంటుంది. చతుర్థ స్థానమున శని భ వలన క్రొత్త ప్రాజెక్ట్ లు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొను సూచనలున్నాయి.

·         ప్రభుత్వాలకు స్వ వర్గీయుల ద్వారాను మరియు భాగస్వాముల ద్వారాను సమస్యలు ఎదురగు సూచనలున్నాయి. సప్తమాధిపతి షష్ఠ స్థానమున ఉండుట వలన వారితో విభేదాలను కూడా సూచించు చున్నది.

·         భావన నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్ కు చెందిన వ్యాపారాలలో మందగతి ఎక్కువగా ఉంటుంది. భూముల ధరలు కూడా అనుకున్నంతగా అభివృద్ధి చెందక పోవచ్చు.

·         అష్టమ కుజ భ వలన రోడ్డు ప్రమాదాలు అధికంగా సంభవిస్తాయి, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు సంభవించు సూచనలున్నాయి.

·         విద్య రంగ సంస్థలు నత్తనడకన అభివృద్ధి చెందు సూచనలున్నాయి.

·         చతుర్థ స్థానమున శని భ వలన ప్రణాళికలు మందగతిన అమలౌతాయి.

·         ప్రభుత్వాలకు ఋణ భారాలు తగ్గు సూచనలు అగుపడుట లేదు.

·         ప్రకృతి వైపరిత్యాలు అధికంగా ఉంటాయి. వాటికి గాను ధనాన్ని అధికంగా వెచ్చించ వలసి ఉంటుంది.

·         షష్టాధిపతి అష్టమ స్థానమున ఉండుట వలన ప్రతిపక్షాలు వాటి ఉనికి కాపాడుకొనుటకు శ్రమించ వలసి ఉంటుంది. శక్తివంతమైన రాజ యోగాల వలన ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు, వ్యతిరేకత ఎక్కువగా ఉన్నను సుస్థిరమైన పాలనను అందించు సూచనలున్నాయి.

·         గురు భ ప్రభావం అధికంగా ఉండుట వలన ధార్మిక సంస్థలు, న్యాయ వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. వాటి అభివృద్ధి చక్కగా ఉంటుంది. ప్రజలందు ధార్మిక చింతన అధికంగా ఉంటుంది. మత ఘర్షణలు కొనసాగు సూచనలున్నాయి.

·         వర్ష లగ్న కుండలి నందు రాజ యోగాలు శక్తివంతముగా ఉండుట వలన ప్రపంచ దేశాలలో మన కీర్తి ప్రతిష్ఠలు అద్భుతంగా వృద్ధి చెందు సూచనలున్నాయి.

·         భ్రాతృ స్థానాధిపతి శక్తివంతముగా ఉండుట వలన చైనా ఆర్థికాభివృద్ధి క్రమంగా వృద్ధి చెందు సూచనలున్నాయి. దాయాది దేశమైన పాకిస్తాన్ లో ఆర్ధిక ఇబ్బందులు అధికంగా ఉన్నా గత సంవత్సరాన్ని పోల్చి చూసిన ఎడల కొంత ఆశాజనకంగా ఉంటుంది.

·         కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పొంతన కనిపించడం లేదు. ఎవరి పని తీరు వారిదిగా సాగు సూచనలున్నాయి.

·         కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలలో మార్పులు కనిపించడం లేదు. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో గురు చండాల యోగ ప్రభావం వలన మత చిచ్చు మరియు కుల చిచ్చు అధికంగా ఉంటుంది. కుల మరియు మతాల ఆధారంగా ప్రజలను విడగొట్టు ప్రమాదం అధికమగు సూచనలున్నాయి. కావున ప్రజలు మరియు ప్రభుత్వాలు సంయమనమును పాటించాలి.

 

 మేషాది ద్వాదశ రాశుల వారికి గోచర ఫలాలు:

(ఇట్టి గోచార ఫలాలు అందరికి ఒకే విధంగా ఉండవు. ఇట్టి ఫలితాలను జాతక రీత్యా ఉన్న యోగాలు మరియు జన్మ కాల దశలు ప్రభావితం చేయు సూచనలున్నాయి. తత్ప్రభావము వలన ఇట్టి శుభాశుభ ఫలాలు మారు సూచనలున్నాయి. జాతక పరమైన యోగాల ప్రభావము వలన అత్యంత శుభప్రదమైన గోచార సమయంలో ప్రతికూల ఫలాలను పొందవచ్చు లేదా అత్యంత ప్రతికూల గోచారము నందు శుభ ఫలాలను కూడా పొందవచ్చు. మనం ఆచరించిన కర్మలను అనుసరించి వాటికి సరిపడా యోగాలు గల సమయంలో మనం జన్మిస్తాము. తదనుగుణంగా ఫలితాన్ని అనుభవిస్తాము)

 

వత్సరాంతం వరకు కుంభ రాశిలో శని భ, గురు భ ఏప్రిల్ 21 వరకు మీన రాశిలోను మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు మేష రాశిలో, రాహువు అక్టోబర్ 30 వరకు మేష రాశిలోను మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు మీన రాశిలో సంచరిస్తారు.

 

మేషం:

ఇట్టి రాశి వారు శుభ మరియు మిశ్రమ ఫలాలను పొందుదురు.

గురు గోచారము:

ఇట్టి గోచారము వలన స్థాన చలనము, నివాసంలో మార్పు, దూర ప్రాంతాలకు బదిలీ, వ్యర్థ సంచారము, మానసిక చింత, వస్తు నాశనం, ఉద్యోగ భంగ యోగాలు, ధార్మిక కార్యాలలో పాలుపంచుకుంటారు. విద్యార్థులకు మిశ్రమ ఫలాలు, వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

శని గోచారము:

వత్సరాంతం వరకు శని భ గోచారము శుభ ఫలాలను ఇస్తుంది. ధన మరియు వ్యాపార లాభము, వృత్తి పరముగా రావలసిన ధనము అందుట, సంతాన సౌఖ్యము, మనో నిర్మలత, సంకల్పిత కార్య సిద్ధి, విద్యార్థులకు, ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమగుట. చక్కని వ్యాపారాభివృద్ధి. సర్వత్రా శుభ ఫలితాలు అధికంగా పొందుదురు.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు జన్మ రాశిలోను మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు వ్యయ స్థానంలోను రాహువు ప్రతికూలుడు. కార్య విఘ్నము, భార్య భర్తల మధ్య కలహాలు, శత్రు వృద్ధి, అనుకోని ఒడుదుడుకులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట, మనో వ్యాకులత. స్థాన చలనము, శారీరిక శ్రమ అధికం, అవమానాలు, వృధా ఖర్చులు, నేత్ర సంబంధమైన చిక్కులు, అకారణంగా కలహాలు, అనవసరమైన వివాదాలు. పాపకార్య చింతన ఇత్యాది ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

ప్రతికూల గురు మరియు రాహువు గోచార ఫలాలను శని భ శుభ గోచరము కొంత వరకు ప్రభావితం చేయగలదు. అయిననూ జాగ్రత్తగా ఉండాలి.

 

వృషభము:

వీరికి మిశ్రమ లేదా ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

గురు గోచారము:

ఏప్రిల్ 21 మొదలు గురు భ ప్రతికూల ఫలాలను ప్రసాదించును. స్థాన చలనము, ధన నష్టము, పెట్టుబడు లందు నష్టాలు, వృత్తి లేదా పదవీ భంగము, వ్యర్థ ప్రయాణాలు. భ్రాతృ విరోధం. విద్యార్థులకు, ఉద్యోగులకు మరియు వ్యాపారులకు ప్రతికూల ఫలాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

శని గోచారము:

శని భ వత్సరాంతం వరకు కూడా ప్రతికూలుడు. పనులు అనుకూలించక పోవుట. సమయానుసారంగా వెనకబడుట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట, పాప కార్యాచరణ. పనులందు స్తబ్దత. నడుము మరియు కీళ్ళకు చెందిన సమస్యలు, భాగస్వాములతో విభేదాలు. ఆదాయము క్షీణించుట. శ్రమతో కూడిన ఫలములు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలములు. పదోన్నతులు ఆగిపోవుట. విద్యార్థులకు తగిన విధంగా ఫలితాలు రాకపోవుట. చదువు పట్ల శ్రద్ధ క్రమంగా తగ్గుట.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు ద్వాదశ స్థానమున ప్రతికూలుడు. అటుపిమ్మట వత్సరాంతం వరకు లాభ స్థానమున శుభుడు. అక్టోబర్ వరకు - స్థాన చలనము, శారీరిక శ్రమ అధికము. అవమానములు, అనవసరమైన వివాదాలు, చేయని తప్పులకు బాధ్యులను చేయుట. ఖర్చులు అధికం. ఊహించని వివాదాలు మరియు ఒడుదుడుకులు ఉంటాయి. ఇట్టి వివాదాలు మీ కీర్తి ప్రతిష్టలను భంగపరచు సూచనలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. అటుపిమ్మట వత్సరాంతం వరకు – చక్కని కార్యసిద్ధి, ధన మరియు వస్తు లాభము, ధైర్యము, కార్య సానుకూలత, సుఖ సంతోషము.

గురు మరియు శని భ ప్రతికూలురు అగుట వలన సంవత్సరాంతం వరకు కూడా దాదాపుగా ప్రతికూల ఫలాలు అధికంగా లభించు సూచనలున్నాయి.

 

మిథునము:

శుభ మరియు మిశ్రమ ఫలాలు లభిస్తాయి.

గురు గోచారము:

ఏప్రిల్ మొదలు వత్సరాంతం వరకు గురు భ శుభుడు. అన్నింటా లాభము, కీర్తి మరియు తేజో వృద్ధి, బాల సంపన్నత, విజయ ప్రాప్తి, పదోన్నతులు, విద్యార్థులకు శుభ ఫలితాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించుట, సంతాన సౌఖ్యము, వృత్తి పరంగా ధన లాభము. భాగస్వామ్య వ్యవహారము లందు లాభము. వ్యాపారులకు అనుకూల ఫలితాలు. వివాహ ప్రయత్నాలయందు అనుకూలత.

శని గోచరము:

వత్సరాంతం వరకు కూడా ప్రతికూలుడు. దుఃఖము, ఆదాయం క్షీణించుట, తలపెట్టిన పనులు కుంటుబట్టుట, పితృ అనారోగ్యము కలవర పెట్టుట, లాభించే చోట నష్టం, అదృష్టం కలిసి రాకపోవుట. లాభాలు క్షీణించుట.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు రాహువు శుభుడు. అటుపిమ్మట వత్సరాంతం వరకు ప్రతికూలుడు. అక్టోబర్ వరకు - చక్కని కార్యసిద్ధి. తలపెట్టిన పనులు త్వరిత గతిన సిద్ధించుట. ధన మరియు నూతన వస్త్ర లాభము. ధైర్యము కొంత లోపించుట, చక్కని కార్యానుకూలత, సుఖ సంతోషాలు అధికంగా ఉంటాయి. కాని పఞ్చమ స్థానమున కేతువు ప్రభావం వలన మానసిక ఒత్తిడులు అధికంగానే ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొను వారగుదురు. కావున జాగ్రత్తగా ఉండాలి. అనుమానం మరియు భయం అధికమౌతుంది. అక్టోబర్ నుండి – వృధా సంచారము, పనులందు ఒడుదుడుకులు అధికం, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోతూ ఉంటాయి. ఆహార వ్యతిరేకత, కార్యక్షేత్రంలో ప్రతికూలత. వృత్తి మరియు వ్యాపార పరమైన అనిశ్చితి.

 

కర్కాటకము:

కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్వల్ప ప్రతికూల మరియు మిశ్రమ ఫలాలు లభించు సూచనలున్నాయి.

గురు గోచారము:

ఏప్రిల్ మొదలు వత్సరాంతం వరకు గురువు భ ప్రతికూలుడు. తలపెట్టిన కార్యము లందు అవరోధాలు,వృధా సంచారము, వృత్తి పరమైన మార్పులు, పదోన్నతులకు అవకాశాలు, ధన ధాన్య ప్రాప్తి, దైవిక కార్యాచరణ, పుణ్యక్షేత్రాల దర్శనము, విద్యార్థులకు శుభ మరియు స్వల్ప మిశ్రమ ఫలాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలించక పోవుట.

శని గోచారము:

వత్సరాంతం వరకు శని అష్టమ స్థానమున ప్రతికూలుడు. ఆపదలు, అనారోగ్య సమస్యలు, స్వజనులకు నష్టము, భాగస్వాములతో విభేదాలు, ద్వేషాలు అధికమగుట, ధన నష్టము, పెట్టుబడులు నిలచిపోవుట, చేయని తప్పుకు బాధ్యులను చేయుట, నిష్ఠూరము, శిక్షాప్రాప్తి, అవమానాలు. పనులు సమయానుసారంగా వెనకబడుట, వృత్తి రీత్యా మందగించు అభివృద్ధి, సంతాన రీత్యా ఎదురగు ప్రతికూలతలు. స్వల్ప అనారోగ్య సమస్యలు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, స్వల్ప ప్రమాదాలు, మలబద్దకం నకు చెందిన చిక్కులు, నేత్ర మరియు దంత సంబంధిత సమస్యలు.

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు రాహువు ప్రతికూలుడు. అనుకోని ఒడుదుడుకులు. చివరి క్షణంలో పనులు చేజారి పోవుట. వృధా సంచారము. కార్య క్షేత్రంలో ప్రతికూలత. మానసిక ఒత్తిడి. దుష్కర్మలకు చెందిన ఆలోచన. రహస్యంగా లేదా గోప్యంగా పాపకర్మలను నిర్వహించుట. అనాలోచిత తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. వ్యవహారము మందగించుట, అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనము, ప్రతికూల స్థానములకు బదిలీలు, అనారోగ్య సమస్యలు.

 

సింహము:

వీరికి శుభ మరియు ప్రతికూల ఫలాలు రెండూ కూడా సమానంగా లభించు సూచనలున్నాయి.

గురు గోచారము:

గోచార రీత్యా వత్సరాంతం వరకు గురు భ శుభుడు. స్థిరాస్తుల పరంగా లాభము, తపోలాభము, ఉపాసనలు సిద్ధించు సమయం, కుల వృత్తు లందు చక్కని రాణింపు. చక్కని కార్యసిద్ధి. తలపెట్టిన పనులందు అనుకూలత. నూతన  ఉద్యోగ అవకాశాలు. పదోన్నతులకు అనుకూలమైన సమయము. దైవ చింతన, అన్ని విధాలుగా ఆహ్లాదకరమైన గృహ వాతావరణం. సంతాన పరంగా అనుకూలత. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.

శని గోచారము:

వత్సరాంతం వరకు శని భ సప్తమ స్థానమున ప్రతికూలుడు. వృధా ప్రయాణాలు, ప్రయాణాలు అనుకూలించక పోవుట, భాగస్వాములతో విభేదాలు, భాగస్వామ్య వ్యవహారము లందు ప్రతికూలతలు, మనో వేదన, విదేశీయాన యోగాలు ఫలించక పోవుట,  మిశ్రమ మరియు ప్రతికూల ఫలాలు లభిస్తాయి. పనులు సమయానుసారంగా వెనకబడుతూ ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలమ్ లభించక పోవుట. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. వృత్తి మరియు వ్యవహారము మందగించుట.

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు రాహువు ప్రతికూలుడు. అనుకోని మార్పులు, ఉన్నత అధికారుల ద్వారా సమస్యలు, పనులు మందగించుట, అదృష్టం కలిసి రాకపోవుట, స్థాన చలనము, అనారోగ్య సమస్యలు, భ్రాతృ విరోధము లేదా మనస్పర్థలు, స్వల్ప ప్రమాదాలు, కలుషిత ఆహారం భుజించడం ద్వారా ఎదురగు సమస్యలు. ఆర్ధిక మోసాలు. చెడు వ్యసనము లందు శ్రద్ధ. గౌరవ మర్యాదలు క్షీణించుట. ఇత్యాది ప్రతికూల ఫలాలు ఉంటాయి.

 

కన్య:

కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో శుభ మరియు ప్రతికూల ఫలాలు సమానంగా లభిస్తాయి.

గురు గోచారము:

వత్సరాంతం వరకు అష్టమ స్థానమున గురు భ ప్రతికూలుడు. గృహ సంబంధ సమస్యలు, మాతృ సంబంధమైన అనారోగ్య చింత, రాజ భయము, పై అధికారులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, హార్మోనులు మరియు మధుమేహ సంబంధిత సమస్యలు ఎదుర్కొను వారికి అధిక సమస్యలు, కోపము మరియు చిరాకు, ఊహించని అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చొరభయం, ఉద్యోగ మరియు వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట. వృత్తి పరమైన చికాకులు అధికమగుట ఇత్యాది ప్రతికూల ఫలాలు పొందగలరు.

శని గోచారము:

వత్సరాంతం వరకు కుంభ రాశిలో శుభ ఫలాలు లభిస్తాయి. ధన లాభము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, చక్కని కార్య సిద్ధి, తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తిచేయ గలుగుట, వృత్తి మరియు వ్యాపార పరంగా కార్య విజయం, శత్రువులపై విజయము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట.

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు రాహువు ప్రతికూలుడు. శ్వాసకోశ సమస్యలు, రుణ బాధలు, అధిక మరియు అనవసర ఖర్చులు, ఆర్ధిక మోసాలు. వ్యసనముల పట్ల మనస్సు లాగుట. సన్నిహితులు మోసగించుట. ప్రమాదాలు, కలుషిత ఆహారాన్ని భుజించుట వలన ఎదురగు సమస్యలు. ఎలర్జీ లకు చెందిన చిక్కులు. అనుకోని ఒడుదుడుకులు. భాగస్వామ్య వ్యవహారము లందు ప్రతికూలతలు. ఉదర మరియు నేత్ర సంబంధిత సమస్యలు, ఊహించని మార్పులు, అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కుటుంబ కలహాలు. బంధు మిత్ర విరోధము.

 

తుల:

తులా రాశిలో జన్మించిన వారు శుభ మరియు మిశ్రమ ఫలాలు పొందుదురు.

గురు గోచారము:

ఏప్రిల్ మొదలు వత్సరాంతం వరకు సప్తమ స్థానమున గురు శుభుడు. చక్కని కార్యసిద్ధి. శారీరిక సౌఖ్యం, ఆరోగ్యం, సంకల్ప కార్యసిద్ధి, అధిక ధన లాభం, విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నము లందు అనుకూలత. సంపూర్ణ ఆనందం. మానసిక ఉల్లాసం.

శని గోచారము:

వత్సరాంతం వరకు పఞ్చమ స్థానమున శని భ ప్రతికూలుడు. పెట్టుబడులు నిలచిపోవుట, ఊహించని ఖర్చులు, అధిక ధన వ్యయం, ప్రమాదాలు, తగాదాలు, వివాహ ప్రయత్నములందు అవరోధాలు, వివాహ ప్రయత్నాలు వెనకబడుట, మానసిక చింత, సంతాన ప్రయత్నాలందు ప్రతికూలతలు, జీర్ణకోశ మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, మిత్ర భేదము. అధిక శ్రమ. విద్యార్థులకు పరీక్షలందు అనుకున్నంతగా ఫలితాలు లభించక పోవుట.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు సప్తమ స్థానమున ప్రతికూలుడు మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు షష్ఠ స్థానమున శుభుడు. అక్టోబర్ వరకు - ఉదార మరియు నేత్ర సంబంధిత చిక్కులు, అల్లర్జీల సమస్యలు అధికమగుట. శ్వాసకోశము చిక్కులు, వృధా సంచారము. కుటుంబ కలహాలు అధికం. భాగస్వామ్య వ్యవహారాలలో ఒడుదుడుకులు అధికంగా ఉంటాయి. అనూహ్యమైన ఒడుదుడుకులు. అవకాశాలు చేజారిపోవుట. అక్టోబర్ నుండి – పుణ్య కార్యాచరణ, సత్కాలక్షేపము, ధన ధాన్య ప్రాప్తి, చక్కని కార్య సిద్ధి, ఇష్ట కార్య సిద్ధి, కీర్తి ప్రతిష్ఠలు పెంపొందుట, శత్రువులపై విజయము, అలంకార ప్రాప్తి, సభా గౌరవము. పదోన్నతులు, రాజ ద్వారమున కార్య సిద్ధి.

 

వృశ్చిక:

వృశ్చిక రాశి వారు ప్రతికూల ఫలాలు అధికంగా పొందువారగు సూచనలున్నాయి.

గురు గోచారము:

వత్సరాంతం వరకు షష్ఠ గురు భ ప్రతికూలుడు. ఉద్యోగ మరియు వృత్తి మార్పిడి. అనూహ్య ఆపద, రాజదండన భయం, చొరభయం, సన్నిహితులు మరియు బంధు మిత్రులతో విరోధము మరియు మనస్పర్థలు. ధన నష్టము. ధన సంపత్తి విరోధుల హస్తగతమగు సూచనలున్నాయి. సంతానముతో విభేదము. కుటుంబ కలహాలు. అనారోగ్యము. సహా ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో విభేదాలు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

శని గోచారం:

వత్సరాంతం వరకు అర్ధాష్టమ శని భ ప్రతికూలుడు. అనారోగ్యము, పనులు మందగించుట, వృత్తి మరియు వ్యాపారము లందు స్తబ్దత, శ్రమకు తగిన ఫలము మరియు గుర్తింపు లభించక పోవుట, కీర్తి నష్టము, ఉద్యోగ భంగ యోగాలు. విద్యార్థులకు తగిన రీతిలో ఫలమ్ లభించక పోవుట. ఉన్నత విద్య పట్ల శ్రద్ధ తగ్గుట. కీళ్ళ సంబంధిత సమస్యలు. మాతృ సంబంధమైన అనారోగ్యము.

రాహు గోచారము:

అక్టోబర్ వరకు షష్ఠ స్థానమున శుభుడు మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు పఞ్చమ స్థానమున ప్రతికూలుడు. అక్టోబర్ వరకు - పుణ్య కార్యాచరణ, సత్కాలక్షేపము, ధన ధాన్య ప్రాప్తి, చక్కని కార్య సిద్ధి, ఇష్ట కార్య సిద్ధి, కీర్తి ప్రతిష్ఠలు పెంపొందుట, శత్రువులపై విజయము, అలంకార ప్రాప్తి, సభా గౌరవము. పదోన్నతులు, రాజ ద్వారమున కార్య సిద్ధి. అక్టోబర్ నుండి వత్సరాంతం వరకు – ఆలోచనలు వక్రించుట, పాప కార్యాసక్తి, అనుమానం మరియు భయం, స్వీయ నమ్మకం తగ్గుట, మానసిక ఆందోళన, శ్వాసకోశ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు, విద్యార్థులకు పరీక్షలందు తగిన విధంగా ఫలితం లభించక పోవుట. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు సమస్యలను సృష్టించు సూచనలున్నాయి.


ధనుస్సు:

ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం శుభ ఫలాలు అధికంగాను మరియు మిశ్రమ ఫలాలు కొంతవరకు పొందు వారగుదురు.

గురు గోచారము:

వత్సరాంతం వరకు పఞ్చమ స్థానమున గురు భ శుభుడు. దైవానుగ్రహము, ఉపాసనలు సిద్ధించుట, ఆధ్యాత్మిక చింతన పెంపొందుట. ధన మరియు వస్తు లాభము. ఇష్టకార్య సిద్ధి. తలపెట్టిన పనులు విజయవంతంగా ముగియుట. కీర్తి మరియు ధన లాభము. పదోన్నతులు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. గృహము నందు శుభ కార్యములు. సంతానాభివృద్ధి. వారికి ధన లాభము. ఆస్తుల ద్వారా లాభము.

శని గోచారము:

వత్సరాంతం వరకు తృతీయ స్థానమున శని భ శుభుడు. చక్కని కార్య సిద్ధి. శ్రమకు తగిన గుర్తింపు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. కీర్తి మరియు ధన లాభము. ప్రయాణాలు లాభించుట. పదోన్నతులు. విద్యార్థి మరియు వ్యాపార వర్గాల వారికి అనుకూల ఫలితాలు. భ్రాతృ సంబంధిత ప్రతికూలతలు. సర్వత్రా ఆనందదాయకం.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు పఞ్చమ స్థానమున మరియు అటుపిమ్మట వత్సరాంతం వరకు చతుర్థ స్థానమున రాహువు ప్రతికూలుడు. అక్టోబర్ వరకు - మానసిక ఒత్తిడులు అధికంగా ఉంటాయి. చంచలమైన మనస్సు, ఆలోచనలు తరచు మారుతూ ఉంటాయి. పాప కార్యాసక్తి, సంతాన పరమైన సమస్యలు, శత్రు పీడ, శ్వాసకోశ సంబంధిత చిక్కులు, అనవసరమైన ఆవేశము అధికము, అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొనుట. విద్యార్థులకు ప్రతికూల ఫలాలు. పోటీ పరీక్షల పరంగా ఇబ్బందులు అధికం. అక్టోబర్ నుండి – అనుకోని ఒడుదుడుకులు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కార్య విఘ్నము, యంత్రముల ద్వారా ప్రమాదాలు, ఆస్తుల లావాదేవీలందు ప్రతికూలతలు, దుష్టులతో కలహం శారీరిక శ్రమ, సమస్యను త్వరిత గతిన పరిష్కరించే మార్గంలో ఎదురగు ప్రతికూలతలు.

 

మకరము:

మకర రాశి వారికి వత్సరాంతం వరకు కూడా ప్రతికూల ఫలాలు లభిస్తాయి.

గురు గోచారము:

వత్సరాంతం వరకు గురు భ ప్రతికూలుడు. ఆదాయానికి మించిన ఖర్చులు, స్థిరాస్తి వ్యవహారము లందు ప్రతికూలతలు. స్థాన చలనము, ధన నష్టము, విద్యార్థులకు మరియు వ్యాపారులకు ప్రతికూల సమయం. భ్రాతృ విరోధం. అనారోగ్య పరమైన సమస్యలు.

శని సంచారం:

వత్సరాంతం వరకు కూడా శని ప్రతికూలుడు. గౌరవ మరియు కీర్తి నాశనము, ధన హాని, వృధా ఖర్చులు, ధన సంపత్తి కరిగిపోవుట, పెట్టుబడులు నిలిచి పోవుట, రావలసిన ధనం సమయానికి అందకపోవుట. బంధువులు మరియు సన్నిహితులతో విభేదాలు, అనవసర దూషణలు వినవలసి వస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గుట. వ్యాపారులకు ప్రతికూలతలు. కుటుంబ కలహాలు. అనారోగ్యము. నేత్ర సంబంధ సమస్యలు. స్వల్ప ప్రమాదాలు.

రాహువు గోచారము:

అక్టోబర్ వరకు రాహువు ప్రతికూలుడు. అటుపిమ్మట వత్సరాంతం వరకు శుభుడు. అక్టోబర్ వరకు - అనుకోని ఒడుదుడుకులు. అవకాశాలు చివరి క్షణంలో చేజారిపోవుట. కార్య విఘ్నము, యంత్రముల ద్వారా ప్రమాదాలు, ఆస్తుల లావాదేవీలందు ప్రతికూలతలు, దుష్టులతో కలహం శారీరిక శ్రమ, సమస్యను త్వరిత గతిన పరిష్కరించే మార్గంలో ఎదురగు ప్రతికూలతలు. అటుపిమ్మట – సర్వ కార్యసిద్ధి, సజ్జన సాంగత్యము, అనూహ్య ధన ప్రాప్తి, ఆరోగ్యం, సుఖం.

 

కుంభము:

కుంభ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రతికూల మరియు స్వల్ప మిశ్రమ ఫలాలు లభిస్తాయి.

గురు గోచారం:

వత్సరాంతం వరకు సంచరించు గురు భ ప్రతికూలుడు. పట్టుదల సడలింపు, అనూహ్య ప్రమాదాలు, దరిద్రము, వ్యవహార నాశనము, బంధు విరోధము, శారీరిక శ్రమ, చెవి, ముక్కు మరియు గొంతుకు చెందిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు. విద్యార్థి మరియు వ్యాపారులకు ప్రతికూల ఫలాలు. వివాహ ప్రయత్నాలు ఫలించక పోవుట.

శని గోచారం:

వత్సరాంతం వరకు జన్మ శని. శారీరిక శ్రమ, అనారోగ్యము, తేజస్సు క్షీణించుట, మానసిక చింత అధికం, పనులు కాకపోవుట. అధిక శ్రమతో కూడిన ఫలాలు. సందర్భము లందు అధిక శ్రమ మరియు స్వల్ప ఫలం, కీళ్ళు చర్మ మరియు జీర్ణకోశ సంబంధిత సమస్యలు. వాత సంబంధిత సమస్యలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక పోవుట. పెట్టుబడులందు లాభాలు మందగించుట. సోమరితనము.

రాహువు గోచారము:

వత్సరాంతం వరకు తృతీయ స్థానమున రాహువు శుభుడు. చక్కని కార్యసిద్ధి, తలపెట్టిన పనులు సునాయాసంగా సాధించ గలుగుట, ఆదాయము పెరుగుట, అధిక ధన లాభము. పదోన్నతులు, వ్యాపారులకు అనుకూల సమయము. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించుట. సజ్జన సాంగత్యము. గొంతుకు చెందిన సమస్యలు. సర్వత్రా శుభ ఫలాలు. అక్టోబర్ మొదలు – దుష్టులతో అకారణ కలహాలు. ఆర్ధిక మోసాలు. ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఒడుదుడుకులతో సాగు ఆర్థికాభివృద్ధి. స్పెక్యులేటివ్ పెట్టుబడులందు జాగ్రత్తగా ఉండాలి. ధన మరియు వస్తు నష్టము. దుర్బలత్వం, తేజో క్షీణత.

 

 

మీనము:

మీన రాశి వారికి స్వల్ప శుభ మరియు ప్రతికూల ఫలాలను సూచించు చున్నది.

గురు గోచారం:

వత్సరాంతం వరకు జన్మ గురు భ శుభుడు. కుటుంబ సౌఖ్యము. కీర్తి వృద్ధి, ధన లాభము, ధనాదాయము, దాన ధర్మాల నిర్వాహణ, చక్కని ఆర్థికాభివృద్ధి. రావలసిన ధనము అందుట. సమయానుసారంగా ధనము అందుట. శుభకార్యాలు. విద్యార్థి మరియు వ్యాపారులకు శుభ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు ఫలించుట. చక్కని కార్యసిద్ధి. కాని ఏలినాటి శని ప్రభావము వలన ఇట్టి శుభ ఫలితాలు సంపూర్ణంగా లభించవు.

శని గోచారం:

ఏలినాటి శని. అధిక ధన వ్యయము. వృధా ఖర్చులు. పెట్టుబడులందు నష్టాలు. ఊహించని ఖర్చులు. సమయానుసారంగా ధనం ఖర్చై పోతుంది. వివాదాలు, పరస్పర దూషణలు. అనవసరంగా దూషించే వారి సంఖ్యా అధికమౌతుంది. విచారము. అపకీర్తి. వృధా సంచారము. శారీరిక శ్రమ. ఉద్యోగ భంగము. క్రొత్త మరియు భారీ పెట్టుబడులు చేయునపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇట్టి పెట్టుబడులు నిలిచి పోవుట మరియు వివాదాలు అధికమగు సూచనలున్నాయి. మిత్రులు, సంబంధీకులు మరియు సన్నిహితుల సంబంధాలలో జాగ్రత్త వహించాలి. విరోధము మరియు విభేదాలు అధికమగు సూచనలున్నాయి. ఖర్చులు విపరీతంగా పెరిగి పోతాయి. వివాదాలు ప్రారంభమౌతాయి. సంయమనాన్ని పాఠించాలి. కొన్ని అనుకూల ఫలాలు కూడా లభిస్తాయి. అట్టి ఫలాలను చూసి పొంగిపోరాదు. అవే కష్టాలుగా మారే సూచనలు ఉంటాయి. అత్యుత్సాహం పనికిరాదు.

రాహువు గోచారము:

దుష్టులతో అకారణ కలహాలు. ఆర్ధిక మోసాలు. ఆర్ధిక లావాదేవీలందు జాగ్రత్తగా ఉండాలి. ఒడుదుడుకులతో సాగు ఆర్థికాభివృద్ధి. స్పెక్యులేటివ్ పెట్టుబడులందు జాగ్రత్తగా ఉండాలి. ధన మరియు వస్తు నష్టము. దుర్బలత్వం, తేజో క్షీణత. కార్య విఘ్నము, భాగస్వాములతో విభేదాలు, శత్రు వృద్ధి, జ్వర సంబంధమైన బాధలు. ఊహించని ఒడుదుడుకులు. అవకాశాలు చేజారిపోవుట. పొగాకు ఇత్యాది వ్యసనాలకు దూరంగా ఉండాలి.

 

గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్న గ్రహాలకు చేసుకోవాల్సిన శాంతుల గూర్చి సంప్రదించ గలరు.

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
శ్రీ శోభన నామ సం ఉగాది
22.03.2023

||శుభం భూయాత్||