Vijaya Dashami

శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రే నమః శుభగ్రహ

 

 

విజయదశమి నిర్ణయము

 

విజయ దశమి ఏరోజు జరుపుకోవాలి? ఇది ప్రస్తుత సమస్య. మన పండగలకు ఇది సర్వసాధారణమై పోయింది. తిథి ద్వయం రావడం అందరిని గందరగోళానికి గురిచేయడం సర్వ సాధారణమైంది. ఈ సంవత్సరంలో శ్రీ వినాయక చవితికి కూడా ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు ‘విజయదశమి – దసరా’. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో ముందు చూద్దాము:

 

శ్రీ సూర్య సిద్ధాంత పఞ్చాఙ్గం:

23.10.2023, నవమి ప గం 02:41 ని వరకు, అటుపిమ్మట దశమి. శ్రవణ నక్షత్రం సా గం 04:01 ని వరకు

24.10.2023, దశమి ప గం 01:41 ని వరకు, ధనిష్ఠ ప గం 01:41 ని వరకు

 

ఇట్టి తిథి ద్వయం సందేహాన్ని సృష్టించింది. పండితులు వారివారి ప్రతిపాదనను ప్రస్తావిస్తూ కొందరు 23 న శాస్త్ర సమ్మతమని మరికొందరు 24 నాడు మాత్రమే చేసుకోవాలి చెప్పు చున్నారు. దానికి తోడూ పలు దేవాలయాలు వారివారి గణితం ప్రకారం ఈ రెండు రోజులు జరుపుకొను చున్నారు. అసలు ఏరోజు జరపడం శాస్త్ర సమ్మతమో, దీని గూర్చి ధర్మసింధు ఏమంటుందో తెలుసుకుందాము.

 

సా పరదిన ఎవాపరాహ్ణవ్యాప్తౌ పరా ।।

పరదినమందు అపరాహ్ణ వ్యాప్తి యున్నచో పరదేనమే. కాని,

దినద్వయే అపరాహ్ణ వ్యాప్తౌ దినద్వయేపి శ్రవణ యోగే సత్యసతి వా పూర్వా ।। ఏవం దినద్వయే అపరాహ్ణ వ్యాప్త్యాభావేపి శ్రవణ యోగ సత్త్వాసత్త్వయోః పూర్వైవ ।। దినద్వయే అపరాహ్ణ వ్యాప్త్యవ్యాప్త్యేరేకతరదినం శ్రవణయోగే యద్దినే శ్రవణ యోగః సైవ గ్రాహ్యా ।। ఏవమ్ అపరాహ్ణ్యైకదేశవ్యాప్తావూహ్యమ్ ।। యదా పూర్వదినే ఎవాపరాహ్ణవ్యాపినీ పరదినే చ ముహూర్తత్రయాదివ్యాపినీ అపరాహ్ణాత్ పూర్వమేవ సమాప్తాపరత్రైవ శ్రవణయోగవతీ తదా పరైవ ।। అపరాహ్ణే దశమ్యభావేపి ।। “యాం తిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కరః” ఇత్యాదిసాకల్యవచనైః శ్రవణయుక్తాయా గ్రాహ్యాయా ఔదయికస్వల్పదశమ్యాం కర్మకాలే సత్త్వాపాదనాత్ ।। సింధౌ త్విదం పరదినే పరాహ్ణకాలే శ్రవణసత్త్వే ఏవ ।। శ్రవణస్యాప్యపరాహ్ణాత్పూర్వ మేవ సమాప్తౌ తు పూర్వైవేత్యుక్తమ్ ।। యుక్తం చైతత్ ।। యదా పరదినే ఎవపరాహ్ణవ్యాప్తిః పూర్వదినే ఏవాపరాహ్ణాత్పరత్ర సాయాహ్నాదౌ శ్రవణయోగస్తదా తు పరైవ గ్రాహ్యేతి మమ ప్రతిభాతి ।। (ధర్మసింధు)

 

దినద్వయ మందు అపరాహ్ణ వ్యాప్తి యున్నచో దినద్వయ మందు శ్రవణ యోగమున్నను లేకున్నను పూర్వ దినమే గ్రాహ్యము. ఇట్లు దినద్వయ మందు అపరాహ్ణ వ్యాప్తి లేనియెడల శ్రవణ యోగము రెంటికి ఉన్నను లేకున్నను పూర్వదినమే. ఇక దినద్వయ మందు అపరాహ్ణ వ్యాప్తి యుండుట లేకుండుట అనే పక్షములో ఒక దినమందు శ్రవణ యోగమున్నచో అట్టి దినమే గ్రాహ్యము. ఇట్లు అపరాహ్ణ్యైకదేశవ్యాప్తి కలిగి పరదినమందు శ్రవణ యోగ రహితమైనచో పూర్వదినమే గ్రాహ్యము. మరియు పూర్వ దినమందే అపరాహ్ణ వ్యాప్తి కలిగి పరదినమందు మూడు ముహూర్తముల కాలము దశమికి శ్రవణ యోగమున్నచో పరదినమే గ్రాహ్యము. ఎందుకనగా, అపరాహ్ణ కాలమందు దశమి లేకున్నను “యాం తిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కరః” అను వచనముచే కర్మకాల వ్యాప్తి భావింప వచ్చును. నిర్ణయ సింధువు నందు అట్టి స్వల్ప దశమియు అపరాహ్ణ మందు శ్రవణ యోగము ఉన్న ఎడల గ్రహించబడును. లేనిచో పూర్వదినమే గ్రాహ్యమని యున్నది. అదియే యుక్తము. (ధర్మసింధు)

 

ఇట్టి ప్రమాణాన్ని అనుసరించి దశమి తిథి దినద్వయ అపరాహ్ణ వ్యాప్తిని కలిగి ఉన్నది. పూర్వదినమందు మాత్రమే శ్రవణ యోగ యుక్తమై యున్నది. పరదినమందు శ్రవణ యోగము లేదు. పూర్వదినమందు దశమి అపరాహ్ణ వ్యాప్తిని కలిగి ఉండి శ్రవణ యోగ యుక్త మైనందున పూర్వదినాన్నే గ్రహించాలి. కావున 23.10.2023 నాడు విజయదశమి, సీమోల్లంఘన మరియు శమీపూజ జరుపుకోవడం శాస్త్ర సమ్మతం.

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु ।।

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति