Ayudhya Sri Rama
శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
భక్తి ఆధ్యాత్మిక శోభతో దేదీప్యమానంగా వెలుగుతున్న హిందూ దేశం
అయోధ్యలో నేడు శ్రీ రామ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నాకు ఊహ తెలిసిన తరువాత ఎన్నో విగ్రహ ప్రతిష్ఠలను చూసాను. కాని నేడు అయోధ్యలో శ్రీ రామచంద్రుని పునరాగమనానికి ఒక గొప్ప విశిష్టత కలదు. హిందూ రాజ్యంలో ఎన్నో మన దేవాలయాలు శత్రువుల చేతిలో నేలమట్టమైనాయి. దేవాలయాల సంపదను దోచుకున్నారు. హిందువులు సాత్విక స్వభావం గల వారు. దానికి గల ప్రధాన కారణం ‘ఉపనిషత్ మరియు వేదాంతం’ మన దేశంలో జన్మించినదే కావడం. మన పూర్వీకుల నుండి వస్తున్న జ్ఞాన సంపద ఎంత వద్దని అనుకున్నా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఇన్నాళ్ళు ఒక నిద్రాణ స్థితిలో ఉంటే ఇప్పుడే మేల్కున్నట్లు అనిపిస్తున్నది. నిద్రాణ లేదా స్వప్న స్థితిలో ఉన్నది నిజ ప్రపంచంలో ఉండదు. శ్రీ రామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠ ఒక స్వప్నం గానే మిగిలి పోతుందని భావిస్తున్న వేళ, వేలాది మంది బలిదానాలతో అట్టి స్వప్నమే సత్యమై నేడు ఆవిష్కరించ బడింది.
నేడు దేశమంతా కూడా శ్రీ రామచంద్ర ప్రభువు పునరాగమనాన్ని ఒక పండగ వలే అత్యంత శోభాయమానంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు:
ఉత్సవశ్చ మహా నాసీత్ అయోధ్యాయాం జనాకులః ।
రథ్యాశ్చ జనసంబాధా నటనర్తక సంకులాః ।
గాయనైశ్చ విరావిణ్యో వాదనైశ్చ తథాఽపరైః ।। (వాల్మీకి రామాయణ బాలకాండ 18-18)
దశరథ మహారాజుకు పుత్రులు కలిగిన సంతోష సమయంలో అయోధ్య అంతటా గొప్ప ఎత్తున ఉత్సవాలు జరిగాయి. అట్టి ఉత్సవాలలో ప్రజలేల్లరూ అత్యుత్సాహంతో పాల్గొన్నారు. రాజ వీధులన్నీ కూడా కోలాహలంతో నిండిపోయినాయి. నటీనటులు తమ అభినయ ప్రదర్శనలతో, నర్తకుల నృత్య వినోదాలతో అయోధ్య అంతా కూడా విలసిల్లింది. ఎటు చూసినా గానాలు, వాద్య గోష్టులు, వందిమాగధుల స్తోత్ర పాఠము లతో అయోధ్య అంతా కూడా ప్రతిధ్వనించింది.
త్రేతాయుగంలో జరిగిన శ్రీ రామచంద్ర ప్రభువు అవతార ఘట్టంలో మనమందరం ఆ రోజు పాల్గొనే ఉంటాము. అందుకే నేడు మళ్ళీ ఆ వైభవాన్ని భగవానుడు గుర్తు చేస్తూ మనకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. పై శ్లోకంలో చెప్పిన విధంగా దేశమంతా నేడు గొప్పగా ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రతి దేవాలయంలో శ్రీ రామజన్మ ఘట్టం శోభాయమానంగా కనిపించింది. వీధులు దీపాలతో ధగధగలాడాయి. నేడు జరిగిన ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు అనడంలో సందేహమే లేదు, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని. నేడు రాజ వీధులన్నీ కోలాహలంతో నిండి పోయాయి. తమ నృత్య మరియు గాన ప్రదర్శనలతో శ్రీ రాముల వారికి భక్తి శ్రద్ధలను చాటి చెప్పారు. నేడు ఎటు చూసినా గానాలు, వాద్య గోష్టులు జరిగాయి. వేద పణ్డితులు వేద పఠనం చేసారు. పలు చోట్లా హోమాలు జరిగాయి. అయోధ్య నగరమే పెరిగి పెద్దదై భారతావనిగా మారిందనే భావన కలిగింది.
ప్రతి కార్యాన్ని నిర్వహించుటకు భగవంతుడు ఒక కర్తను ఎన్నుకుంటాడు. అట్టి కర్తనే ‘నరేంద్రుడు’. పదకొండు రోజుల నిష్టతో దీక్షతో మనస్సు మరియు దేశ శుద్ధి గావించుకొని విగ్రహ ప్రతిష్టకు సిద్ధమైన శ్రీ నరేంద్ర మోడీ గారిని భగవానుడు కర్తగా ఎన్నుకోన్నాడని అనడంలో సందేహమే లేదు. ఏదేనీ దైవ కార్యాన్ని నిర్వహించుటకు ముందు దేహ మరియు మనస్సు శుద్ధి గావింప బడాలి. అందుకే రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం చేస్తారు. అట్టి మహన్యాసం ద్వారా దేహం, అన్గాలు మరియు మనస్సు శుద్ధి గావింప బడతాయి. నరేంద్రుని దీక్ష కూడా మహన్యాసంతో సమానమైనదే. ఆయన సంకల్పానికి, దీక్షకు నమో నమః. అది శ్రీ రామచంద్ర ప్రభువు శక్తిగానే పరిగణించాలి. శ్రీ రామమందిర నిర్మాణానికి ఎంతోమంది తమ ప్రాణాలను త్యజించారు. వారందరి ప్రాణ త్యాగానికి నేడు ఫలితం లభించింది. వారి జన్మ సార్థకమైందని అనడంలో సందేహమే లేదు. భారత దేశంలో గల సింహ భాగం హిందువులను ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత ‘నరేంద్రుల’ వారికే దక్కుతుంది. అన్య మతస్తులు ఎంతోమంది ఇందులో పాలుపంచుకోవడం కొసమెరుపు.
శ్రీరామ రక్షా సర్వ జగద్రక్ష. మనిషిలో భక్తి అత్యంత ప్రధానమైనది. అదే మనిషిని సన్మార్గంలో పయనించే విధంగా చేస్తుంది. భక్తికి జ్ఞానం తోడైన నాడు మోక్షం లభిస్తుంది. భక్తి జ్ఞానికి హేతువు కాగలదు. స్వస్తిర్భవతు. మంగళం మహత్.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति