Sri Vinayaka chaturthi
ॐ శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శుభ గ్రహ
శ్రీ వినాయక చతుర్థి నిర్ణయం
జ్యోతిష శాస్త్రంలో రెండు రకాలైన పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. మొదటిది మరియు అత్యంత ప్రాచీనమైనది అయిన శ్రీ సూర్య సిద్ధాంతము. రెండవది నూతన పధ్ధతి అయిన దృక్సిద్ధాంతం. పండగలు నిర్ణయించుటకు గాను శ్రీ సూర్య సిద్ధాంతాన్ని మాత్రమే ప్రమాణంగా గ్రహించాలి. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ‘శ్రీ వినాయక చవితి’ పండగ ఏరోజు జరుపుకోవాలో క్రింద వివరించబడినది. మన పండగలు జరుపుకోవడంలో కొంత సందిగ్ధ స్థితి సదా ఏర్పడుతుంది. జ్యోతిశాస్త్రంలో ప్రాచుర్యంలో ఉన్న రెండు భిన్నమైన పద్ధతులు కూడా అందుకు కారణమగు చున్నాయి. దానికి తోడు ‘తిథిద్వయం’. తిథులు రెండు రోజులు వచ్చిన నాడు పండగ ఏరోజు జరుపుకోవాలో సందిగ్ధత ఉంటుంది. ఇప్పుడు శ్రీ వినాయక చవితి విషయంలో కూడా అదే సందిగ్ధం. ఇట్టి సందర్భాలు ఎదురౌతాయని మన పండితులకు తెలుసు కాబట్టి ధర్మసింధు మరియు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాలను మనకు అందించారు. వాటి ప్రమాణాలను మనం పరిగణలోకి తీసుకోవాలి:
శ్రీ సూర్య సిద్ధాంత ప్రకారేణ:
18.09.2023, సోమవారం, తృతీయ ఉ గం 10:01 ని వరకు
19.09.2023, మంగళవారం, చతుర్థి ఉ గం 10:26 ని వరకు
ధర్మసింధు ప్రమాణం:
శుక్ల చతుర్థి సిద్ధి వినాయక వ్రతమ్ ।। సా మధ్యాహ్నవ్యాపినీ గ్రాహ్య ।। దినద్వయే సాకల్యేన మధ్యాహ్నవ్యాప్తావవ్యాప్తౌ వా పూర్వా ।। దినద్వయే సామ్యేన వైషమ్యేణ వైకదేశవ్యాప్తావపి పూర్వైవ ।। వైషమ్యేణ వ్యాప్తావధికవ్యాపినీ చేత్పరేతి కేచిత్ ।। పూర్వదినే సర్వథా మధ్యాహ్నస్పర్శో నాస్త్యేవ పరదినే ఏవ మధ్యాహ్నస్పర్శినీ తదైవ పరా ।। పూర్వదినే ఏకదేశేన మధ్యాహ్నవ్యాపినీ పరదినే సంపూర్ణ మధ్యాహ్నవ్యాపినీ తదా పరైవ ఏవం మాసాన్తరేపి నిర్ణయః ।। ఇయం రవి భౌమవారయోగే ప్రశస్తా ।।
శుక్ల పక్ష చతుర్థి నాడు శ్రీ వరసిద్ధి వినాయక వ్రతం ఉంటుంది. అందు మధ్యాహ్న వ్యాప్తిని గ్రహించవలెను. దినద్వయ మందునూ సంపూర్ణంగా మధ్యాహ్న వ్యాప్తి యున్నను లేకున్నను పూర్వమే. దినద్వయ మందును సమముగా గాని విషమముగా గాని ఏకదేశ (కొంత భాగము) వ్యాప్తి అగునపుడును పూర్వ దినమే. వైషమ్య వ్యాప్తిలో అధికముగా ఉన్న యెడల పరదినమని కొందరి ఆలోచన. (అట్టి పరిస్థితిలో) పూర్వదినమందు బొత్తిగా మధ్యాహ్న వ్యాప్తిలేక పరదినమందే మధ్యాహ్న స్పర్శ యున్నచో పరదినము గ్రహించ వచ్చును. పూర్వ దినమందు ఏకదేశ వ్యాప్తియు పరదినమందు సంపూర్ణ మధ్యాహ్న వ్యాప్తియు ఉన్నచో పరదినమే గ్రహించునది. ఇది రవి భౌమ వారములతో కూడిన ఎడల ప్రశస్తము.
ఇట్టి ప్రమాణాన్ని అనుసరించి, 18.09.2023 నాడు ఉదయం గం 10:01 ని మొదలు చతుర్థి సంపూర్ణ మధ్యాహ్న వ్యాప్తి కలిగి ఉండుట, మరియు 19.09.2023 నాడు చతుర్థి ఉ గం 10:26 ని వరకు మాత్రమే ఉండుట, మధ్యాహ్న వ్యాప్తి లేకపోవుట వలన 18.09.2023, సోమవారం నాడు శ్రీ వినాయక చతుర్థి జరుపుకొనుట శాస్త్ర సమ్మతము. ఉదయం గం 10:01 ని తరువాత దుర్ముహూర్త మరియు వర్జ్యాలు లేని సమయంలో శ్రీ వినాయక ప్రతిష్ఠ శుభప్రదము.
నమిలికొండ విశ్వేశ్వర్ శర్మ, సిద్ధాంతి