సంస్కృత లోకోక్తి
ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః ।
న హి సుప్తస్య సింహస్య ప్రవిశన్తి ముఖే మృగాః ।।
(విష్ణు శర్మ పఞ్చ తన్త్రం - మిత్ర సంప్రాప్తి, నారాయణ పణ్డిత హితోపదేశం - సుహృద్భేదం)
అనగా – పనులు గట్టి ప్రయత్నం (ఉద్యమం) వల్లనే నెరవేరుతాయి కానీ, కేవలం కోరికల (మనోరథాల) వల్ల కాదు. అడవికి రాజైన సింహమైనా సరే, అది నిద్రపోతుంటే జంతువులు వాటంతట అవే వచ్చి దాని నోటిలో పడవు కదా! (అది వేటాడితేనే ఆహారం దొరుకుతుంది.
ఈ ప్రపంచంలో ఉద్యమించిన వాడికే (శ్రమించి పనిచేసిన వాడికి) కార్యము సిద్ధిస్తుంది. అంతే కాని ‘న మనోరథైః’ – మనస్సులో కోరుకున్నంత మాత్రాన కాదు. అట్టివారికి అదొక భ్రమ గాను, పగటి కల గాను మిగిలిపోతుంది. స్వప్నము సదా స్వప్నము గానే మిగిలిపోతుంది. అందులో వాస్తవికత ఉండదు. స్వప్నావస్థ నుండి బయటపడగానే అంతా శూన్యమే కనిపిస్తుంది. మానవ జీవితంలో విజయం అనేది కేవలం ఆశపడితేనో, కలలు కంటేనో దక్కదు. దానికి దృఢమైన సంకల్పం మరియు కఠిన శ్రమ (Hard work) అవసరం. ఈ సుభాషితం మనకు చెప్పేది అదే - 'సింహం అంతటి బలవంతుడైనా సరే, వేటాడకుండా ఆహారం దొరకదు'. అలాగే, సమాజంలో ఎంతటి ప్రతిభావంతులైనా సరే, ఆ ప్రతిభకు 'శ్రమ'ను జోడించకపోతే ఫలితం శూన్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఉత్తిష్ఠ కౌంతేయ (లేవయ్యా అర్జునా!) అని చెప్పడంలో ఆంతర్యం ఇదే. కేవలం యుద్ధం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే విజయం వరించదు, గాండీవం పట్టి పోరాడితేనే వీరస్వర్గమైనా, రాజ్యభోగమైనా దక్కుతుంది. నేటి సమాజంలో చాలామంది అదృష్టం కోసం ఎదురుచూస్తూ, లేదా షార్ట్ కట్స్ (అడ్డదారులు) ద్వారా విజయం సాధించాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన అభివృద్ధి, వ్యక్తికి గానీ, దేశానికి గానీ, 'ఉద్యమం' (నిరంతర ప్రయత్నం) వల్లనే సాధ్యమవుతుంది. ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే సమాజం పురోగమిస్తుంది. కాబట్టి, ఫలితాన్ని ఆశించడం కన్నా, ప్రయత్నాన్ని నమ్ముకోవడం ఉత్తమం. భగవంతుడు అవకాశాలను ఇస్తాడు (సింహానికి బలాన్ని ఇచ్చినట్లు), కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మనం చొరవ చూపాలి (వేటాడటం). అర్జునుడికి కృష్ణుడు మార్గదర్శకం మాత్రమే చేయగలడు, కానీ యుద్ధం చేయాల్సింది అర్జునుడే.
శ్రీమద్భగవద్గీత శ్లో:
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ।। (2.37)
ఓ కౌన్తేయ – అర్జునా! ఒకవేళ నీవు ఈ ధర్మ యుద్ధమున శత్రువులచే చంపబడితివా వీర స్వర్గమును పొందెదవు, అట్లుగాక ఒకవేళ నీవే జయించితివేని భూ సౌఖ్యాన్ని మరియు రాజ్యాన్ని అనుభవించెదవు. ఈ విధముగా నీకు రెండు విధములుగా లాభమే చేకూరును. కావున లేసి యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.
సాధారణంగా ఈ శ్లోకాన్ని "విజయం కోసం కష్టపడాలి" అని మాత్రమే చెబుతారు. కానీ ఇందులో గొప్ప సామాజిక దృక్కోణం కలదు. "జీవితంలోని ప్రతి దశలోనూ బాధ్యతను (ధర్మాన్ని) నిర్వర్తించడం కూడా ఒక ఉద్యమమే" అనే గొప్ప సందేశం నిక్షిప్తమై ఉన్నది. బాధ్యతే నిజమైన 'ఉద్యమం'. వార్ధక్యం బాధ్యతారాహిత్యం కాదు, కాకూడదు కూడాను. "ఉద్యమేన హి సిద్ధ్యంతి" అనే సూత్రం కేవలం యువతకే కాదు, వృద్ధాప్యంలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. అడవిలో సింహం ముసలిదై పోయానని వేట మానేస్తే, ఆకలి దాన్ని చంపేస్తుంది. అలాగే మనిషి కూడా "నా బాధ్యతలు అయిపోయాయి" అని చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. శరీర బలం తగ్గినప్పుడు మనోబలంతో, జ్ఞానంతో చేసే ప్రయత్నమే నిజమైన ఉద్యమం. పెంపకమే నిజమైన పెట్టుబడి. పిల్లలను కనడం ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే (యాంత్రికం). కానీ వారిని ధర్మబద్ధంగా పెంచడం, వారిలో సంస్కారాన్ని నింపడం అనేది తల్లిదండ్రులు చేయాల్సిన నిజమైన 'ఉద్యమం'. ఈ శ్రమ చేయకుండా, పిల్లలు తమను వృద్ధాప్యంలో చూసుకోవాలని ఆశించడం, నిద్రపోతున్న సింహం నోటిలోకి జింకలు రావాలని కోరుకోవడం లాంటిదే. ఎవరైతే పిల్లల పెంపకంలో తగిన శ్రద్ధ (ఉద్యమం) తీసుకుంటారో, వారికి వృద్ధాప్యంలో పిల్లల నుంచి ప్రేమ అనే ఫలితం (సిద్ధి) దక్కుతుంది. పిల్లలను వదిలేసి, బాధ్యతను విస్మరించిన వారికి వృద్ధాశ్రమాలే గతి అవుతాయి. ఇది ఎవరికి వారు చేసుకున్న కర్మఫలమే తప్ప మరొకటి కాదు. పదవీ విరమణ - కర్మ విరమణ కాదు. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసినంత మాత్రాన జీవితం నుంచి విరమణ చేసినట్లు కాదు. అది 'సింహావలోకనం' చేసుకోవాల్సిన సమయం. అప్పుడు భౌతిక శ్రమ స్థానంలో 'మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రమ' మొదలవ్వాలి. "నేను నా జీవితంలో ధర్మం వైపు నడిచానా? అధర్మం వైపు నడిచానా?" అని ఆత్మపరిశీలన చేసుకోవడమే ఆ వయసులో చేయాల్సిన వేట. శేష జీవితాన్ని జ్ఞాన మార్గంలో, పదిమందికి ఉపయోగపడేలా లేదా భగవత్ చింతనలో గడపడమే నిజమైన విశ్రాంతి. కాబట్టి, కృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి లెమ్మని చెప్పినట్లుగా... ప్రతి మనిషి తన వయసుతో, స్థాయితో సంబంధం లేకుండా తన ధర్మాన్ని నెరవేర్చడానికి బద్ధకం వదిలి లేవాలి. శ్రమించనిదే, తన బాధ్యతను తాను మోయనిదే ఇహంలో సుఖం గానీ, పరంలో మోక్షం గానీ లభించదు. అందుకే ‘యుద్ధం చేస్తే స్వర్గం, గెలిస్తే రాజ్యం’ అనే ఈ శ్లోకానికి చాలా లోతైన అర్థం కలదు. "నువ్వు కర్మ చేయకపోతే (పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే / జ్ఞానాన్ని ఆర్జించకపోతే) ఫలితాన్ని ఎలా ఆశిస్తావు?" అనే ప్రశ్న ఇందులో అంతర్లీనంగా ఉంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
*నమిలికొండ విశ్వేశ్వర శర్మ*
*శ్రీ గాయత్రి వేద విజన్*