స్వభావో యాద్రుశో యస్య న జహాతి కదాచన ।
అన్గారశ్శతధౌతేన మలినత్వం న ముంచతి ।। (ఇతి చాణక్య ధృతం)
తాత్పర్యం: ఎవరి స్వభావం ఎలాంటిదో, అది వారిని ఎప్పుడూ విడిచిపెట్టదు. ఎలాగైతే బొగ్గును వందసార్లు కడిగినా, అది తన నల్లని రంగును వదులుకోదో, మనిషి స్వభావం కూడా అంతే.
మానవ మనస్తత్వానికి సంబంధించిన నిష్ఠుర సత్యం. "బొగ్గును ఎంత కడిగినా నలుపు పోదు" అనే ఈ ఉపమానం ద్వారా మనిషి "సహజాతమైన స్వభావాన్ని" (Innate Nature) మరియు ‘సహజ స్వభావాన్ని’ మార్చడం ఎంత కష్టమో ఈ శ్లోకం వివరిస్తుంది.
ఈ శ్లోకాన్ని కేవలం ఒక వాక్యంగా కాకుండా, మానసిక ప్రవర్తన మరియు కర్మ సిద్ధాంతం పరంగా అర్థం చేసుకోవచ్చు:
1) మౌలిక స్వభావం: మనిషి ప్రవర్తన వేరు, స్వభావం వేరు. భయంతోనో, మొహమాటంతోనో లేదా అవసరానికో మనిషి తన ప్రవర్తనను పైకి మార్చుకున్నట్లు నటించగలడు. కానీ లోపల ఉండే "ముడి స్వభావం" (Raw Nature) మాత్రం మారదు. బొగ్గు పైన దుమ్ము ఉంటే కడిగితే పోతుంది, కానీ ఆ నలుపు అనేది బొగ్గు యొక్క "ధర్మం" (intrinsic property). అలాగే దుర్మార్గుడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా, అవకాశం దొరికినప్పుడు తన సహజ బుద్ధిని బయటపెడతాడు.
2) వాసనలు మరియు సంస్కారాలు: వేదాంత పరిభాషలో చెప్పాలంటే, మనిషి స్వభావం అనేది "వాసనల" (Impressions of past Karmas) సముదాయం. ఇవి అంతఃచేతనలో (Subconscious Mind) లోతుగా నాటుకుపోయి ఉంటాయి. ఒక వ్యక్తి కోపిష్టి అయితే, పైకి ఎంత శాంతంగా ఉన్నా, చిన్న ప్రేరేపణ దొరకగానే ఆ కోపం కట్టలు తెంచుకుంటుంది. దీని గూర్చి భగవద్గీతలో వివరంగా చర్చించుకున్నాము. శతాబ్దాల తరబడి పేరుకుపోయిన ఈ 'వాసనలను' కేవలం బాహ్యమైన శుభ్రతతో (వంద సార్లు కడగడం వంటి చర్యలతో) మార్చలేము. అంతేకాదు శరీరం గాని వస్త్రాలు గాని కంపుగొడుతుంటే మంచి సుగంధ భరితమైన సబ్బుతో తోముకోవచ్చు. శరీరానికి మంచి సెంటును కొట్టుకోవడం వలన సుగంధ భరితమైన వాసన వస్తుండవచ్చు. కాని వాడి మనస్సు మాత్రం కంపు కొడుతూనే ఉంటుంది. దీనికి ఇతర దృష్టాంతాలు ‘వేపచెట్టు మరియు కుక్కతోక’. అట్టి వారు గోముఖ వ్యాఘ్రాలు. వారి వలన జాగ్రత్తగా ఉండాలి.
మరి దీనికి పరిష్కారం లేదా మినహాయింపు లేదా? అనే సందేహం కలిగే అవకాశం ఉంది. మనిషికి మారాలనే గట్టి పట్టుదల ఉండాలి. పట్టుదలతో కూడిన సాధన చేయాలి. "బొగ్గును కడిగితే నలుపు పోదు... కానీ నిప్పులో వేస్తే, అది కాలి బూడిదై 'తెలుపు' రంగులోకి మారుతుంది". మామూలు ప్రయత్నాలతో (కడగడం) స్వభావం మారదు. కానీ "జ్ఞానాగ్ని" లేదా "తీవ్రమైన తపస్సు/సాధన" అనే అగ్నిలో ఆ వ్యక్తి పడితే, అతని పాత స్వభావం కాలిపోయి, ఒక కొత్త వ్యక్తిగా (ఋషిగా) మారే అవకాశం ఉంది (ఉదాహరణకు వాల్మీకి వంటి వారు). కానీ ఇది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ.
భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు కూడా ఇదే విషయాన్నీ బోధించాడు:
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ।
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।।3.33।।
జ్ఞానవంతుడైనను (శాస్త్ర పాండిత్యము లేదా లౌకిక జ్ఞానము కలిగి యున్న వాడైనను) తన ప్రకృతికి (జన్మాన్తర సంస్కారము వలన కలిగిన స్వభావమునకు) అనుగుణముగానే ప్రవర్తించు చున్నాడు. ప్రాణులు తమ ప్రకృతిని అనుసరించియే నడుచు చున్నవి. కావున ఇక నిగ్రహం ఏమి చేయగలదు?
సారాంశం:
సాధారణ జీవనంలో, మనం వ్యక్తులను వారి "సహజ గుణాలను" బట్టి అంచనా వేయాలి తప్ప, వారు పైకి చూపించే కృత్రిమ ప్రవర్తనను చూసి కాదు. "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో (చితి) గాని పోదు" అనే సామెత దీనికి సరిగ్గా సరిపోతుంది.
నమిలికొండ విశ్వేశ్వర శర్మ