శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః - శుభాగ్రహా
ముచ్యమనోదయ పాక్షిక చన్ద్ర గ్రహణం:
03.03.2026, ఫాల్గుణ శు పౌర్ణమి, మంగళవారం, పూర్వాఫల్గుణి నక్షత్ర యుక్త సింహ రాశి యందు కిఙ్చ న్యూన పాదాధికం కేతుగ్రస్త కృష్ణవర్ణ పాక్షిణ చన్ద్ర గ్రహణం – ఈశాన్యాసన్నే మోక్షః
ఇట్టి గ్రహణం భారతదేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. న్యూయార్క్, కెనడా,చికాగో, వాషింగ్టన్, కాలిఫోర్నియా, మిచిగాన్, లౌసయానా, టెక్సాస్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, తైవాన్, ఇండోనేషియా, హాంకాంగ్, జపాన్, చైనా ఇత్యాది ప్రాంతాలలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంటుంది.
వరంగల్ ప్రాంతానికి గ్రహణ సమయాలు:
స్పర్శ 15:20
నిమీలనం 16:34
మధ్య 17:03
ఉన్మీలనం 17:32
చంద్రోదయ 18:17
సూర్యాస్తమయ 18:18
మోక్షం 18:47
ఆద్యంత పుణ్యకాలం 3 గం 27 ని.
నిత్య భోజన ప్రత్యాబ్దికాలు:
గ్రహణము గ్రస్తోదయం అగుట వలన పగలు భుజించ రాదు. గ్రహణానంతరం శుద్ధి చేసుకొని పచన భోజనాలు, ప్రత్యాబ్దికాలను నిర్వహించుకోవాలి. వృద్ధులు, బాలలు, రోగగ్రస్తులు, గర్భిణి స్త్రీలు ఇత్యాది వారు ప 12:00 లోగా ఆహారం తీసుకోవాలి.
గ్రహణ గోచారం:
పుబ్బ నక్షత్ర జాతకులు, సింహ, కన్య, మకర, కుంభ, వృషభ రాశుల వారు వీక్షించరాదు. వీరు గ్రహణ శాన్తి జరుపుకోవాలి.
గ్రహణ సంకల్పం - దానం:
సంకల్పం: మమ జన్మ రాశి – జన్మ నక్షత్రాద్యరిష్ట స్థాన స్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభ ఫల ప్రాప్త్యార్థం బింబ దానం కరిష్య” అని సంకల్పించిన పిదప “గ్రహణ సూచితారిష్ట పరిహారార్థం శుభ ఫల ప్రాప్త్యార్థం బింబ దానం తుభ్యం సంప్రతే నమమ” అని చెప్పుకుంటూ బ్రాహ్మణుడికి దానం ఇచ్చి యథాశక్తి సంభావన తో వారిని సత్కరించి వారి ఆశిస్సులు పొందాలి.
(గ్రహణ దానం: వెండి చన్ద్ర మరియు సర్ప బింబాన్ని ఒక రాగి పాత్రలో ఆవు పాలతో నింపి, అట్టి పాలలో ఈ బింబాలను ఉంచి పైన తెలిపిన సంకల్ప యుక్తంగా బ్రాహ్మణుడికి దానం చేయాలి)
శ్లో:
గ్రస్యమానే భావేత్స్నానం, గ్రస్తే హోమార్క చంద్రకే ।మండలే ముచ్యమానేతు దానం ముక్తౌతు మజ్జనం ।।
అనగా గ్రహణం పట్టుచుండ స్నానం, గ్రహణం పూర్తిగా పట్టిన పిదప జప హోమాదులును, విడుపున దానమును, మొక్షానంతరము తిరిగి స్నానమును; చంద్ర సూర్య గ్రహణము లందు ఆచరించ వలయును
శ్లో:
సర్వం గంగా సమం తోయం సర్వ వ్యాస సమా ద్విజా ।
సర్వం భూమి సమం దానం, తద్దానం మేరు సన్నిభం ।।
అనగా గ్రహణ కాలమున వాపి కూప తటాకాదులందలి జలమంతయు గంగా జలముతో సమానమై ఉండును. బ్రాహ్మణులందరు వ్యాస ముని సమానులు. ఏ చిన్న దానమైనను భూదానముతో సమానమైన ఫలితాన్నిస్తుంది. మేరు పర్వతమంత ఉన్నతమైన ఫలములను పొందవచ్చని పెద్దలు చెప్పియున్నారు. కావున గ్రహణ సమయంలో యధా విధి స్నానాన్ని ఆచరించి జప హోమ దానాదులను ఆచరించుట అత్యంత పుణ్య ప్రదము, ఆరోగ్య కరము మరియు శుభప్రదమగును
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి