శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శుభ గ్రహా
అధిక మాసాలు – ధర్మశాస్త్ర వివరణ
సందేహాలు – నివృత్తి
ఈ సంవత్సరం అనగా శ్రీ పరాభవ నామ సం లో అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. అధికమాసాలు సహజంగా దాదాపుగా 3 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాయి. అధికమాసం గూర్చి సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అట్టి సందేహ నివృత్తికే ఈ వ్యాసం.
అధిక మాసం ఎందుకు వస్తుంది?
జ్యోతిష గణిత విభాగంలో రెండు రకాలైన పద్ధతులను అనుసరిస్తాము. ఒకటి సౌరమానం, రెండు చాన్ద్రమానం. సూర్య భగవానుడు ఒక నిర్దిష్ట వేగంతో ముందు కదులుతూ ఉంటాడు. ఆయన దాదాపుగా రోజుకు ఒక డిగ్రీ మాత్రమే కదులుతాడు. కాని చన్ద్రుడి వేగం అంత క్రమబద్ధంగా ఉండదు. అందుకే చాన్ద్రమానంలో తిథుల కాల పరిమితి, నక్షత్ర కాల పరిమితి మారుతూ ఉంటుంది. సౌరమాన సంవత్సరానికి (సుమారు 365 రోజులు), చాన్ద్రమాన సంవత్సరానికి (సుమారు 354 రోజులు) మధ్య దాదాపు 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేసి, రుతువులను సౌరమానంతో సమన్వయం చేయడానికి చాన్ద్రమానంలో ఒక నెలను అదనంగా కలుపుతారు. దీనినే 'అధిక మాసం' లేదా 'మల మాసం' అంటారు.
యస్మిన్ మాసే న సంక్రాంతిః సంక్రాంతిద్వయమేవ వా ।
మలమాసః స విజ్ఞేయో మాసః స్యాదధిమాసకః ।।
ఏ చాన్ద్రమాన మాసంలో (అమావాస్య నుండి అమావాస్య వరకు) సూర్య సంక్రమణం జరగదో (సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడో), ఆ మాసాన్ని మలమాసం లేదా అధిక మాసం అని అంటారు.
ఒక చాన్ద్రమాన నెలలో (రెండు అమావాస్యల మధ్య కాలంలో) సూర్య సంక్రమణం జరగకపోతే, ఆ మాసాన్ని ఏ సంక్రమణం అయితే జరగలేదో ఆ తర్వాతి మాసం పేరుతోనే "అధిక మాసం" గా పరిగణనలోకి తీసుకుంటారు.
మేషాదిస్థే సవితరి యో యో మాసః ప్రపూర్యతే చాంద్రః ।
చైత్రాద్యః స జ్ఞేయః పూర్వాధికో మలీమ్లుచః ।। (శ్రీ సూర్య సిద్ధాంతం)
సూర్యుడు మేషాది రాశులలో ప్రవేశించినప్పుడు (సంక్రమణం జరిగినప్పుడు) ఏ చాన్ద్రమాన మాసాలు పూర్తవుతాయో, వాటికి చైత్రం, వైశాఖం తదితర పేర్లు వస్తాయి. ఒకవేళ సంక్రమణం లేకుండా ఒకే రాశిలో సూర్యుడు ఉండగా రెండు అమావాస్యలు (అంటే రెండు మాసాలు) వస్తే, వాటిలో పూర్వ (మొదటి) మాసం "అధిక మాసం" లేదా "మలీమ్లుచం" (మలమాసం) అవుతుంది.
చాన్ద్రమాన మాసాల పేర్లు (చైత్రం, వైశాఖం మొ) సూర్యుడి సంక్రమణం (ఒక రాశి నుండి మరొక రాశికి మారడం) మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు:
మీన సంక్రమణం ఉన్న నెల - చైత్రం
వృషభ సంక్రమణం ఉన్న నెల - వైశాఖం
సూర్యుడు ఒక రాశిలో ఉండగానే (ఉదాహరణకు మేష రాశిలో) సంక్రమణం జరగకుండా రెండు అమావాస్యలు వస్తే, అప్పుడు ఒకే పేరుతో రెండు మాసాలు ఏర్పడతాయి. వాటిలో సంక్రమణం లేని మొదటి నెలను "అధిక మాసం" (పూర్వాధికం) అని, ఆ తర్వాతి నెలలో సంక్రమణం జరుగుతుంది కాబట్టి దానిని "నిజ మాసం" లేదా "శుద్ధ మాసం" అని పిలుస్తారు.
అమావాస్యాద్వయం యత్ర రవిసంక్రాంతి వర్జితమ్ ।
మలమాసః స విజ్ఞేయః సర్వకర్మసు గర్హితః ।। (నిర్ణయ సింధు)
ఏ రెండు అమావాస్యల మధ్య కాలంలో సూర్యుని సంక్రమణం జరగదో, ఆ మాసాన్నే మలమాసము లేదా అధిక మాసము అంటారు. ఈ మాసంలో కామ్య కర్మలు (వివాహం, గృహప్రవేశం ఇత్యాది శుభ ముహూర్తాలు) ఆచరించకూడదు.
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉదాహరణ:
1. వృషభ సంక్రమణం & వైశాఖ మాస ముగింపు:
15 మే 2026 (శుక్రవారం): సూర్యుడు మేష రాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశించాడు (వృషభ సంక్రమణం).
16 మే 2026 (శనివారం): ఈ రోజుతో వైశాఖ మాస అమావాస్య ఘడియలు పూర్తయ్యాయి.
2. అధిక జ్యేష్ట మాసం (సంక్రమణం లేని మాసం):
17 మే 2026 (ఆదివారం): వైశాఖ అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుండి కొత్త చాన్ద్రమాన మాసం (శుక్ల పాడ్యమితో) ప్రారంభమైంది.
15 జూన్ 2026 (సోమవారం): ఈ రోజు ఉదయం సుమారు 8:25 నిమిషాలకు అమావాస్య ఘడియలు ముగిశాయి.
శాస్త్ర సమన్వయం: ఇక్కడ గమనించినట్లయితే మే 17 నుండి జూన్ 15 ఉదయం అమావాస్య ముగిసే సమయం వరకు గల ఈ ఒక నెల కాలంలో (రెండు అమావాస్యల మధ్య) సూర్యుడు ఎక్కడా రాశి మారలేదు; వృషభ రాశిలోనే ఉన్నాడు. "మిథున సంక్రమణం" జరగలేదు కాబట్టి, సంక్రమణ రహితమైన ఈ నెలను మనం ఇంతకుముందు చెప్పుకున్న సూత్రం ప్రకారం "అధిక జ్యేష్ట మాసం" అని వ్యవహరిస్తారు.
3. మిథున సంక్రమణం & నిజ జ్యేష్ట మాసం (సంక్రమణం ఉన్న మాసం):
15 జూన్ 2026 (సోమవారం): ఉదయం అమావాస్య ఘడియలు ముగిసిన తర్వాత, పగటి సమయంలో సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు (మిథున సంక్రమణం). అంటే అమావాస్య ముగిసిన తర్వాత ఈ సంక్రమణం జరిగింది.
16 జూన్ 2026 (మంగళవారం): ఇక్కడి నుండి పాడ్యమితో మరొక కొత్త చాన్ద్రమాన మాసం మొదలవుతుంది.
14 జూలై 2026 (మంగళవారం): ఈ రోజుతో మళ్ళీ అమావాస్య ముగుస్తుంది.
శాస్త్ర సమన్వయం: జూన్ 15వ తేదీన అమావాస్య ముగిసిన అనంతరం మిథున సంక్రమణం జరిగింది కాబట్టి, ఆ సంక్రమణం ప్రభావం ఆ తర్వాత మొదలయ్యే కొత్త మాసంలోకి వస్తుంది. ఒక నెలలో సూర్య సంక్రమణం ఉంటే అది శుద్ధ మాసం అవుతుంది. కాబట్టి, జూన్ 16 నుండి జూలై 14 వరకు ఉన్న ఈ నెలను "నిజ జ్యేష్ట మాసం" (శుద్ధ జ్యేష్ఠం) అని అంటారు.
ఈ క్రమంలో తేదీల వారీగా విడమరిచి చూస్తే, "ఒకే రాశిలో సూర్యుడు ఉండగా రెండు అమావాస్యలు వస్తే మొదటిది అధిక మాసం, సంక్రమణం జరిగే రెండవది నిజ మాసం" ఇదే శ్రీ సూర్య సిద్ధాంత ప్రమాణం.
అధిక మాసంలో ఎలాంటి కర్మలు ఆచరించాలి?
నిత్య నైమిత్తికే కుర్యాత్ ప్రయతః సన్మలిమ్లుచే ।
కామ్యాని తు విశేషేణ మలమాసే వివర్జయేత్ ।।
అధిక మాసంలో నిత్య కర్మలు (సంధ్యావందనం, జపం, భగవన్నామ స్మరణ, దానధర్మాలు), నైమిత్తిక కర్మలు (గ్రహణ తర్పణాలు, నిత్య శ్రాద్ధాలు) తప్పక శ్రద్ధగా ఆచరించాలి. కానీ, కామ్య కర్మలను (వివాహం, ఉపనయనం, గృహప్రవేశం వంటి భౌతిక కోరికలతో చేసే శుభకార్యాలు) కచ్చితంగా విడిచిపెట్టాలి.
పితృ కర్మల నియమాలు (సంవత్సరీకాలు, మాసికాలు):
అధిక మాసాలు వచ్చినప్పుడు ఆబ్దికాలు, మాసికాల విషయంలో చాలామందికి సందేహాలు వస్తాయి. వాటికి ధర్మసింధు, నిర్ణయసింధు వంటి గ్రంథాలు స్పష్టమైన సూచనలు చేయు చున్నాయి.
ఎ) సంవత్సరీకం (ఆబ్దికం) నియమం:
ప్రాకృతే సంస్థితస్య స్యాత్ ప్రాకృతే పితృకర్మ చ జ్యేష్ఠ ।
అధిమాస మృతస్య స్యాత్ అధిమాసే పితృక్రియా ।।
ప్రాకృత మాసంలో (అనగా గతంలో మామూలు / నిజ మాసంలో) మరణించిన వారికి, ఈ సంవత్సరం పితృకర్మను (ఆబ్దికాన్ని) నిజ మాసంలోనే చేయాలి. అధిక మాసంలో చేయకూడదు. ఒకవేళ ఎవరైనా గతంలో అధిక మాసంలో మరణించి ఉంటే, వారికి మాత్రం ఇప్పుడు అధిక మాసం లోనే ఆబ్దికం చేయాలి (ఈ సూత్రం అన్ని మాసాలకు వర్తిస్తుంది).
బి) మాసికాలు (మొదటి సంవత్సరం చేసే కర్మలు):
ఎవరైనా ఇటీవల మరణించి, వారి ప్రథమాబ్దంలో (మరణించిన మొదటి సంవత్సరంలో) ఉండగా మధ్యలో అధిక మాసం వస్తే, ఆ మొదటి సంవత్సరంలో మాసికాల సంఖ్య మారుతుంది. ప్రతి నెలా చేసే 12 మాసికాలకు తోడుగా, ఈ అధిక మాసంలో "మలమాస ప్రయుక్త మాసికం" (అధిక మాసికం) పేరిట ఒక అదనపు మాసికాన్ని చేయాలి. తద్వారా ఆ సంవత్సరంలో మొత్తం 13 మాసికాలు ఆచరించవలసి ఉంటుంది.
ఏ అధిక మాసంలో మరణిస్తే వారికి తిరిగి అదే అధిక మాసం వచ్చే వరకు మాసికం మరియు ఆబ్దికం చేయరాదా?
అధిక మాసంలో మరణించిన వారికి ప్రతి నెలా జరిపే మాసికాల కోసం మళ్లీ అధిక మాసం వచ్చేంత వరకు (దాదాపు 32 నెలలు) ఆగాల్సిన అవసరం లేదు. ధర్మసింధు, నిర్ణయసింధు వంటి ప్రామాణిక గ్రంథాలు దీనిపై స్పష్టమైన వివరణను ఇచ్చు చున్నాయి.
1. ప్రతి నెలా చేసే మాసికాల నియమం (అనుమాసికాలు)
అధిక మాసంలో మరణించిన వారికి చేసే మాసికాలను (ప్రతిమాసికాలను) మరణించిన తర్వాతి నెల నుండి క్రమంగా, ప్రతి చాన్ద్రమాన మాసానికి ఒకటి చొప్పున ఆచరిస్తూ వెళ్లాలి. ఇక్కడ "నెల" అనగా వరుసగా వచ్చే మాసాలే కానీ, అధిక మాసాలు కావు.
ఉదాహరణకు: ఎవరైనా 'అధిక జ్యేష్టంలో' మరణిస్తే, వారి ప్రథమ మాసికం (మొదటి నెల కర్మ) వెంటనే వచ్చే 'నిజ జ్యేష్టంలో' చేయాలి. రెండవ మాసికం 'ఆషాఢంలో', మూడవది 'శ్రావణంలో'... ఇలా వరుసగా 12 మాసాలు చేసుకుంటూ వెళ్ళాలి.
అధిమాస మృతానాం తు మాసికాన్యానుమాసికమ్ ।
నిజమాస ప్రభృత్యేవ కర్తవ్యాని యథాక్రమమ్ ।।
అధిక మాసంలో మరణించిన వారికి ప్రతి నెలా చేసే అనుమాసికాలను (మాసికాలను) వెనువెంటనే వచ్చే నిజమాసం (శుద్ధ మాసం) నుండి ప్రారంభించి, క్రమంగా ప్రతినెలా ఆచరించాలి.
2. సంవత్సర ఆబ్దికం (సంవత్సరీకం) - అసలు రహస్యం
"అధిక మాసంలో చనిపోయిన వారికి అధిక మాసంలోనే పితృకర్మ చేయాలి" అనే నియమం ప్రతి సంవత్సరానికీ వర్తించదు. అది కేవలం మళ్ళీ అధిక మాసం వచ్చిన సంవత్సరానికి మాత్రమే పరిమితం. మరి అధిక మాసం రాని సాధారణ సంవత్సరాలలో (అంటే మొదటి, రెండవ సంవత్సరాలలో) ఆబ్దికం ఎప్పుడు చేయాలి?
ప్రమాణ శ్లోకం (నిర్ణయ సింధు / స్మృతి ముక్తాఫలం):
అధిమాస మృతానాం తు ప్రాకృతే ప్రథమాబ్దికమ్ ।
పునస్తాదృశి సంప్రాప్తే మలమాసే తు వత్సరమ్ ।।
అధిక మాసంలో మరణించిన వారికి మొదటి సంవత్సరం ఆబ్దికం (ప్రథమాబ్దికం) మరియు మధ్యలో వచ్చే సాధారణ సంవత్సరాల ఆబ్దికాలు 'ప్రాకృత మాసంలో' అనగా నిజ మాసంలో మాత్రమే చేయాలి. కానీ, ఎప్పుడైతే తిరిగి మళ్లీ అదే అధిక మాసం వస్తుందో, ఆ సంవత్సరంలో మాత్రం కచ్చితంగా అధిక మాసంలోనే ఆబ్దికం నిర్వహించాలి.
ఉదాహరణ:
ఎవరైనా ఈ సంవత్సర అధిక జ్యేష్ఠంలో మరణిస్తే, వారికి నిజ జ్యేష్ఠం మొదలు మాసికాలు పెట్టాలి. వచ్చే సంవత్సరం తిరిగి ప్రాకృత అనగా నిజ జ్యేష్ఠం లో సంవత్సరీకం చేయాలి. తిరిగి ఏ సంవత్సరంలో అధిక జ్యేష్ఠం వస్తుందో ఆ సంవత్సరంలో మాత్రం విధిగా అధిక జ్యేష్ఠంలో మాత్రమే ఆబ్దికం చేయాలి.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
శ్రీ గాయత్రి వేద విజన్, హన్మకొండ