శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శుభ గ్రహ
మాసాలు – వాటి ప్రత్యేకతలు
వైశాఖ మాసం
కాలస్వరూపుడైన పరమాత్మ మానవాళికి అనుగ్రహించిన విశిష్టమైన కాలఖండాలలో "వైశాఖ మాసం" అత్యంత దివ్యమైనది. చైత్రం సృష్టించిన వసంతశోభలు వీడ్కోలు పలుకుతుండగా, అర్యమ ఆదిత్యుని కిరణాల తీక్షణతతో గ్రీష్మ ఋతువు ఉదయించే సంధి కాలమిది. పౌర్ణమినాడు చన్ద్రుడు ఇన్ద్రాగ్నులు అధిదేవతలుగా గల 'విశాఖ' నక్షత్రంతో కూడి ఉండటం చేత ఈ మాసానికి 'వైశాఖం' అన్న పేరు సార్థకమైంది. "న మాధవ సమో మాసో" అన్న స్కాంద పురాణ వచనానుసారం, సంవత్సరంలోని పన్నెండు మాసాలలో సాక్షాత్తూ ఆ శ్రీ మహావిష్ణువుకు (మధుసూదనునికి) అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఇది. కమలాకరాది ధర్మశాస్త్రకారులు నిర్దేశించినట్లుగా, సూర్యభగవానుని ప్రతాపంతో దహించుకుపోయే ఈ ఉష్ణ కాలంలో ప్రాణికోటికి ఉపశమనం కలిగించే జల, ఛత్ర, పాదరక్షల దానాలకు మహర్షులు ఎంతో పెద్దపీట వేశారు. లౌకికమైన ఎండ వేడిని మాత్రమే కాకుండా అజ్ఞానమనే తాపాన్ని తొలగించి, అక్షయ తృతీయ, శ్రీ నృసింహ జయంతి వంటి మహా పర్వదినాలకు నిలయమై, ఏ చిన్న సత్కర్మ చేసినా 'అక్షయమైన' పుణ్యఫలాన్ని ప్రసాదించే వైశాఖ మాస వైభవాన్ని... అందులో దాగిన లోతైన శాస్త్ర, ధర్మ రహస్యాలను మనమిప్పుడు సవివరంగా దర్శిద్దాం.
పౌర్ణమి రోజున చంద్రుడు 'విశాఖ' నక్షత్రంతో కలిసి ఉండటం వల్ల ఈ మాసానికి "వైశాఖ మాసం" అని పేరు వచ్చింది. వసంత రుతువు ముగింపు, గ్రీష్మ రుతువు ప్రారంభంలో ఈ మాసం వస్తుంది.
మాస అధిపతి
వైశాఖ మాస అధిపతి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో విష్ణుమూర్తిని "మధుసూదనుడు" అనే నామంతో ఆరాధిస్తారు. మధుసూదనుడు అనగా అజ్ఞానాన్ని, అహంకారాన్ని పారద్రోలేవాడని అర్థం.
మాస ప్రత్యేకత:
ధార్మిక పరంగా వైశాఖ మాసానికి మించిన మాసం లేదని పురాణాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా స్కాంద పురాణంలోని వైశాఖ మాహాత్మ్యంలో ఈ మాస విశిష్టత బ్రహ్మదేవుడు నారద మహామునికి ఇలా వివరించాడు:
"న మాధవ సమో మాసో న కృతేన యుగం సమమ్ ।
న చ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ।।"
మాధవ మాసానికి (వైశాఖ మాసానికి) సమానమైన మాసం లేదు. సత్యయుగానికి (కృత యుగం) సమానమైన యుగం లేదు. వేదాలకు సమానమైన శాస్త్రం లేదు. గంగానదికి సమానమైన తీర్థం లేదు.
దీనిని బట్టి ఏడాదిలోని పన్నెండు నెలలలో వైశాఖ మాసం అత్యంత శ్రేష్టమైనదని, ఈ మాసంలో చేసే చిన్న దానమైనా, ధర్మమైనా అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
మాస అధిపతి మరియు ద్వాదశ ఆదిత్యులు:
సాధారణంగా ప్రతి మాసానికి ఒక అధిదేవత ఉన్నట్లుగానే, వైశాఖ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు (మధుసూదనుడు). అయితే, సంవత్సరం చక్రంలో సూర్యుని సంచారాన్ని బట్టి ఏర్పడే ద్వాదశ ఆదిత్యులలో (12 సూర్య స్వరూపాలు), వైశాఖ మాసాన్ని పరిపాలించే ఆదిత్యుడు "అర్యముడు" (అర్యమా). సూర్య మండలంలో ప్రతి మాసం ఒక ఆదిత్యుడు, ఒక ఋషి, ఒక గంధర్వుడు, అప్సరస, యక్షుడు, సర్పము, మరియు రాక్షసుడు ఉంటారు.
అర్యమా పులహోఽథౌజాః ప్రహేతిః పుంజికస్థలీ ।
నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవమ్ ।।
(శ్రీమద్భాగవతం, 12వ స్కంధం, 11వ అధ్యాయం - 34వ శ్లోకం):
మాధవ మాసంలో (వైశాఖ మాసంలో) సూర్య మండలాన్ని అర్యముడు అనే ఆదిత్యునితో పాటు, పులహుడు (ఋషి), అథౌజుడు (యక్షుడు), ప్రహేతి (రాక్షసుడు), పుంజికస్థలి (అప్సరస), నారదుడు (గంధర్వుడు), కచ్ఛనీరుడు (నాగుడు) అధిష్ఠించి సంచరిస్తారు.
వైశాఖ మాసానికి ముహూర్త శాస్త్ర గ్రంథాలలో చాలా ప్రత్యేకత ఉన్నది. వైశాఖ మాసానికి ఆదిత్యుడైన 'అర్యముడు' స్థిర నక్షత్రమైన ఉత్తర ఫల్గుణికి అధిపతి కావడం, అలాగే దాంపత్యానికి, ధర్మానికి సాక్షీభూతుడు కావడం వలనే... ఆ మాసంలో చేసే గృహారంభ, గృహప్రవేశ, వివాహ, ఉపనయనాది కార్యాలకు అంతటి స్థిరత్వం, శుభప్రదమైన ఆశీస్సులు లభిస్తాయి అన్నది ముమ్మాటికీ సత్యం. కేవలం పౌరాణికంగానే కాకుండా, జ్యోతిష మరియు ఖగోళ శాస్త్రాల పరంగా చూసినా ఈ మాసానికి ఉన్న ముహూర్త బలం ఇదే.
అర్యముడు కశ్యప ప్రజాపతికి, అదితికి జన్మించిన 12 మంది ఆదిత్యులలో (సూర్య స్వరూపాలలో) ఒకరు. వేద వాఙ్మయంలో మిత్రావరుణులతో పాటు అర్యముని ప్రస్తావన విశేషంగా కనిపిస్తుంది.
1. పితృదేవతల అధిపతి - భగవద్గీత ప్రమాణం
అర్యముడు పితృలోకానికి, పితృదేవతలకు (Ancestors) ప్రధాన అధిపతి. మనుషులు చేసే శ్రాద్ధ కర్మలు, పితృ తర్పణాల ద్వారా అందించే హవిస్సులను పితృదేవతలు అర్యముని నేతృత్వంలోనే స్వీకరిస్తారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయానికి అత్యున్నతమైన శాస్త్ర ప్రమాణం సాక్షాత్తూ శ్రీమద్భగవద్గీత లోని విభూతి యోగంలో (10వ అధ్యాయం, 29వ శ్లోకం) కనిపిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని, విభూతులను వివరిస్తూ ఈ విధంగా అంటాడు:
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। (శ్రీమద్భగవద్గీత 10.29)
నాగులలో నేను అనంతుడను (ఆదిశేషుడను). జలచరములకు అధిపతియైన వరుణుడను నేనే. పితృదేవతలలో 'అర్యముడను' నేనే. శిక్షించేవారిలో యమధర్మరాజునూ నేనే.
ఈ శ్లోకం ద్వారా సృష్టిలో అర్యముని స్థానం ఎంతటి మహోన్నతమైనదో పరమాత్మ స్వయంగా ధృవీకరించాడు).
అందుకే వైశాఖ మాసం పితృ యజ్ఞాలకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వైశాఖ మాసంలో పితృ దేవతల ప్రీత్యర్థం సమర్పించే పిణ్డ ప్రధాన, తర్పణ, దాన ఇత్యాదులు నేరుగా అర్యముడు పితృ దేవతలకు చేరవేస్తాడని తెలియుచున్నది. పితృ యజ్ఞాలు మాత్రమే కాదు దైవ యజ్ఞాలకు కూడా చాలా ప్రాధాన్యత కలదు.
2. నక్షత్రాధిపత్యం (జ్యోతిష ప్రామాణికం)
జ్యోతిష మరియు ముహూర్త శాస్త్ర ప్రకారం అర్యముడు "ఉత్తర ఫల్గుణీ" (ఉత్తర) నక్షత్రానికి అధిదేవత. ఉత్తర నక్షత్రం స్థిర నక్షత్రాల గణంలోకి వస్తుంది. కాబట్టి వివాహం, గృహప్రవేశం, పట్టాభిషేకం లాంటి స్థిరమైన, దీర్ఘకాలిక శుభకార్యాలకు అర్యముని ఆశీస్సులు ఉన్న ఈ నక్షత్రం అత్యంత ప్రశస్తమైనది.
అర్యమ్ణే జుష్టం వర్హే । అర్యమా దదాతు... (తైత్తిరీయ బ్రాహ్మణం - నక్షత్ర సూక్తం)
ఉత్తర ఫల్గుణీ నక్షత్ర ఇష్టిలో అర్యమునికి హవిస్సులు సమర్పించే వేద మన్త్రం
అందుకే వైశాఖ మాసంలో వివాహ, ఉపనయన, గృహ ప్రవేశ, గృహారంభాలకు అత్యంత శుభ ప్రదమైనదని నిర్ణయించ బడినది. అంతేకాదు. ఏ పనైనా కూడా ఒక శాశ్వతమైన ఫలాన్ని ప్రసాదించాలని అనుకుంటే అందుకు వైశాఖ మాస అత్యంత ప్రశస్తమైనది. వ్యాపార, పరిశ్రమలకు కూడా ఇది అత్యంత శుభప్రదమైనది.
3. అర్యముని ప్రాధాన్యత మరియు విధులు
వివాహ బంధానికి సాక్షి మరియు రక్షకుడు: వేద కాలం నుండి అర్యముడిని ఆతిథ్యానికి, స్నేహానికి, మరియు ముఖ్యంగా వివాహ బంధానికి సాక్షిగా పూజిస్తారు. హైందవ వివాహ క్రతువులో "లాజా హోమం" (అగ్నిలో పేలాలు వేయడం) అత్యంత ప్రధానమైన ఘట్టం. ఈ హోమం అర్యముని ఉద్దేశించే జరుగుతుంది.
"అర్యమణం ను దేవం కన్యా అగ్నిమయక్షత..."
(కన్య అయిన ఈ వధువు అర్యమ దేవుని ఆరాధిస్తోంది. ఆయన ఆమెను పతి గృహంలో సంతోషంగా ఉంచు గాక). వధువుకు సద్గతులను, అత్తవారింట్లో స్థిరత్వాన్ని ప్రసాదించమని అర్యముడిని ప్రార్థించడం ఇందులో అంతరార్థం. అందుకే వైశాఖ మాసం వివాహాలకు అత్యంత శుభప్రద మైనదని చెప్పబడింది.
కర్మ సాక్షి: సూర్య స్వరూపుడైన అర్యముడు, మిత్రుడు మరియు వరుణుడితో కలిసి మానవుల కర్మలను, వారు ఆచరించే ధర్మ, అధర్మాలను నిరంతరం గమనిస్తూ ఉంటాడు. ఆయన సూర్య స్వరూపుడు అగుట వలన కర్మ ఫలాలను కూడా సమయానుసారంగా ప్రసాదిస్తూ ఉంటాడు. అందుకే వైశాఖ మాసంలో శ్రీ సూర్యారాధనలు (ప్రధానంగా లోక కళ్యానార్థం జరిపే సూర్యారాధనలు, సూర్య యాగాలు, ఇతర యజ్ఞ యాగాదులు అత్యంత అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తాయి. విశాఖా నక్షత్ర ప్రయుక్త పౌర్ణమి వలన ఏర్పడిన వైశాఖ మాసంలో అగ్ని ప్రతిష్ఠలు, హోమాలు కూడా అత్యంత శుభ ఫలితాలను ఇస్తాయి. అందుకే అగ్నిర్ముఖ శ్రీ గాయత్రి మంత్రోపదేశాలు అనగా ఉపనయన సంస్కారాలు కూడా అత్యంత శుభప్రదమనవి)
కాల స్వరూపం (వైశాఖ మాసాధిపతి): ద్వాదశ ఆదిత్యులలో ఒక్కొక్కరు ఒక్కో మాసంలో సూర్య రథాన్ని అధిష్ఠిస్తారు. అందులో అర్యముడు వైశాఖ మాసంలో సూర్య మండలాన్ని అధిష్టించి, గ్రీష్మ తాపాన్ని కలుగజేస్తూ సృష్టి చక్రంలో తన వంతు పాత్రను పోషిస్తాడు.
తాత్వికంగా చూస్తే, పితృదేవతల ఆశీస్సులను, వివాహ వ్యవస్థ ద్వారా వంశాభివృద్ధిని, కాలచక్రంలో ఒక మాసాన్ని నియంత్రించే మహత్తరమైన దైవ శక్తి 'అర్యముడు'.
పౌర్ణమి నాడు చంద్రుడు 'విశాఖ' నక్షత్రంలో ఉండటం వలనే ఈ మాసానికి 'వైశాఖ మాసం' అని పేరు వచ్చింది.
జ్యోతిష, వైదిక ప్రమాణాల ప్రకారం విశాఖ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత, గ్రహాధిపతి తదితర విశేషాలు:
4. నక్షత్ర అధిదేవత / అధిష్ఠాన దేవత
విశాఖ నక్షత్రానికి అధిదేవతలు ఇద్దరు. వారే "ఇన్ద్రాగ్నులు" (దేవేంద్రుడు మరియు అగ్ని దేవుడు). వేద వాఙ్మయంలో ఈ నక్షత్రాన్ని ఉద్దేశించి చేసే యజ్ఞాలలో ఇన్ద్రాగ్నులకే హవిస్సులు సమర్పిస్తారు.
ఈ నక్షత్ర విశిష్టతను మరియు అధిదేవతలను కీర్తిస్తూ తైత్తిరీయ బ్రాహ్మణంలోని నక్షత్ర సూక్తం (నక్షత్రేష్టి) లో అద్భుతమైన మంత్రం ఉంది.
దూరమస్మచ్ఛత్రవో యన్తు భీతాః । తదిన్ద్రాగ్నీ కృణుతాం తద్విశాఖే । తన్నో దేవా అనుమదన్తు యజ్ఞమ్ । పశ్చాత్ పురస్తాదభయన్నో అస్తు । నక్షత్రాణామధిపత్నీ విశాఖే । శ్రేష్ఠావిన్ద్రాగ్నీ భువనస్య గోపౌ । విషూచశ్శత్రూనపబాధమానౌ । అపక్షుధన్నుదతామరాతిమ్ ।। (నక్షత్ర సూక్తం - తైత్తిరీయ బ్రాహ్మణం 3.1.1.14)
మా శత్రువులు భయపడి మా నుండి దూరంగా పారిపోవుదురు గాక. విశాఖా నక్షత్ర రూపులైన ఇన్ద్రాగ్నులు (ఇంద్రుడు, అగ్ని) ఆ కార్యమును మా కోసం నెరవేర్చుదురు గాక. దేవతలు అందరూ మా ఈ యజ్ఞమును (సత్కర్మను) అనుమోదింతురు గాక. మాకు ముందు, వెనుక (ఎటు చూసినా) ఎటువంటి భయము లేకుండా ఉండుగాక. విశాఖా నక్షత్రము నక్షత్రాలన్నింటికీ రాణి వంటిది. విశాఖా నక్షత్రానికి అధిదేవతలైన ఇన్ద్రాగ్నులు ప్రపంచానికే అత్యుత్తమ రక్షకులు. వారు శత్రువులను నలుదిశలా పారద్రోలి, మా ఆకలి బాధలను, దుష్ట శక్తులను నాశనం చేయుదురు గాక.
(గమనిక: ఈ మంత్రంలో "నక్షత్రాణామధిపత్నీ విశాఖే" అనడం ద్వారా వేద కాలంలో విశాఖకు ఉన్న ఆధిపత్య స్థానం స్పష్టమవుతోంది.)
"విశాఖా నక్షత్రానికి ఇన్ద్రాగ్నులు (దేవేంద్రుడు మరియు అగ్ని దేవుడు) అధిదేవతలు. కాబట్టే వేద ప్రమాణాలను అనుసరించి వైశాఖ మాసంలో చేసే అగ్ని ప్రతిష్ఠలు, హోమాలు అత్యంత విశేషమైన ఫలాన్ని ప్రసాదిస్తాయి. లోకకల్యాణార్థం ఈ మాసంలో నిర్వహించే యజ్ఞయాగాదులు సమస్త లోకాలను రక్షించడమే కాకుండా, శత్రు పీడను సమూలంగా పారద్రోలుతాయి. ఇన్ద్రాగ్నుల అనుగ్రహం వల్ల దుష్టశక్తులు నశిస్తాయి, లోకంలో ఆకలిబాధలు (క్షామం) తొలగిపోయి సుభిక్షంగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ యజ్ఞాల ద్వారా దేవతల రాజైన ఇన్ద్రుడు, ఆశ్రిత రక్షకుడైన అగ్నిదేవుడు యజమానికి అంతులేని సిరిసంపదలను ప్రసాదిస్తారు."
5. వైశాఖ మాసంలో ఆచరించదగిన దాన ధర్మాదులు:
ధర్మ సింధు మరియు నిర్ణయ సింధు నిర్దేశాలు
కమలాకర భట్టు రచించిన నిర్ణయ సింధు, కాశీనాథ ఉపాధ్యాయుల ధర్మ సింధు - ఈ రెండు ప్రామాణిక గ్రంథాలు కూడా వైశాఖ మాసంలో "ప్రాతః స్నానం" (సూర్యోదయానికి ముందే స్నానం) మరియు "ఉదకుంభ దానం" (జలంతో నిండిన కుండను దానం చేయడం) అత్యంత ప్రశస్తమైనవిగా నిర్దేశించాయి.
మాధవే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః ।
ఉదకుంభం ప్రదాస్యామి సజలం ద్విజసత్తమ ।।
పితౄణాం తారకార్థాయ విష్ణోః ప్రీతికరం శుభమ్ |
(స్కాంద పురాణం / ధర్మ సింధు - ద్వితీయ పరిచ్ఛేద- వైశాఖ మాస కృత్యాలు)
సూర్యుడు మేష రాశిలో ఉండగా వచ్చే వైశాఖ మాసంలో ప్రాతః స్నానం ఆచరించి, పితృ దేవతలను తృప్తిపరుచుటకు, శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలగడం కోసం జలంతో నిండిన ఉదకుంభాన్ని (కలశాన్ని) సత్ బ్రాహ్మణుడికి దానం చేస్తున్నాను. వైశాఖ మాసంలో ప్రాతః స్నానాలకు ధర్మ శాస్త్ర సంబంధమైన విశేషాలు మాత్రమే కాకుండా ఆయుర్వేద ప్రాధాన్యతలు కూడా ఉన్నాయి.
హేమాద్రి (చతుర్వర్గ చింతామణి) వచనాలు
హేమాద్రి తన చతుర్వర్గ చింతామణిలోని "దాన ఖండం" లో వైశాఖ మాసంలో ఎండల తీవ్రతను తగ్గించే ఉపశమన దానాలకు (గ్రీష్మ తాప నివారణార్థం) పెద్దపీట వేశారు.
ఛత్రం సోపానహం యస్తు వైశాఖే సితపక్షకే ।
బ్రాహ్మణాయ దదౌ భక్త్యా స యాతి పరమాం గతిమ్ ।।
(హేమాద్రి దాన ఖండం - పద్మ పురాణ ఉల్లేఖన):
వైశాఖ మాసంలో (ముఖ్యంగా శుక్ల పక్షంలో) ఎవరైతే ఛత్రము (గొడుగు), పాదరక్షలు భక్తితో దానం చేస్తారో, వారు పరమగతిని పొందుతారు.
(ఈ కాలంలో తీవ్రమైన ఉష్ణ తాపం వలన బయట ప్రయాణాలు, బయటకు వెళ్ళడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాని ఇంటిని వదిలి తప్పక బయటకు రావాల్సి వస్తుంది. సంపన్నులు ఏసీ కార్లు మరియు ఏసీ ఇళ్ళు, ఆఫీస్ లందు ఉంటారు కాబట్టి వారికి ఉష్ణ తాపం ఉన్నా, దాని ప్రతికూలతలను వారు అనుభవించరు. కాని లేని వారు, పేద వారు, శారీరిక కష్టం చేసుకునే వారికి తప్పక సూర్య భగవానుడి ఉష్ణ తాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్టి వారికి ఈ మాసంలో పైన తెలిపిన ప్రకారం చేతనైన సహాయం చేయడం అత్యంత విశేషమైన ఫలాన్ని ఇస్తుంది)
వైశాఖ మాసం “ప్రపా” దాన విశిష్టత:
వైశాఖ మాసంలో ఎండల తీవ్రతను (గ్రీష్మ తాపాన్ని) తట్టుకోవడానికి, ప్రాణికోటికి దాహార్తిని తీర్చడానికి ధర్మశాస్త్రాలు "ప్రపా దానం" (చలివేంద్రం ఏర్పాటు చేయడం) అత్యంత పుణ్యప్రదమైనదిగా నిర్దేశించాయి. ఈ విషయమై దాన ధర్మాలకు ప్రామాణిక గ్రంథమైన హేమాద్రి వారి "చతుర్వర్గ చింతామణి - దాన ఖండం" లో (భవిష్యోత్తర పురాణ మూలంతో) ప్రపా దానానికి సంబంధించిన అద్భుతమైన సంకల్ప/ప్రార్థనా శ్లోకం, దాని విధివిధానాలు సవివరంగా ఉన్నాయి.
చలివేంద్రాన్ని (మండపాన్ని) ఏర్పాటు చేసి, దాని ద్వారా జలదానాన్ని ప్రారంభించేటప్పుడు పఠించాల్సిన శాస్త్ర ప్రమాణ శ్లోకం:
ప్రపేయం సర్వసామాన్యా భూతేభ్యః ప్రతిపాదితా ।
అస్యాః ప్రదానాత్ పితరస్తృప్యన్తు చ పితామహాః ।। ప్రపా దాన శ్లోకం (హేమాద్రి దాన ఖండం)
(కొన్ని ప్రతులలో దీనికి కొనసాగింపుగా "అనివార్యం తతో దేయం జలం మాస చతుష్టయమ్" అనే పాదం కూడా ఉంటుంది.)
ఈ చలివేంద్రము / జల సత్రము అందరికీ సమాన ఉపయోగం కొరకు (ఎలాంటి భేదభావం లేకుండా) సకల ప్రాణులకు (కేవలం మనుషులకే కాకుండా పశుపక్ష్యాదులకు కూడా) ఏర్పాటు చేయబడినది/సమర్పించబడినది. ఈ చలివేంద్రం ద్వారా నీటిని దానం చేయడం వలన నా పితృదేవతలు మరియు తాత ముత్తాతలు పరిపూర్ణమైన తృప్తిని పొందుదురు గాక!
(ఈ సంకల్ప ప్రపాదాన విశిష్టత గూర్చి చెప్పుచున్నది. ప్రపాదానం వలన పితృదేవతలు సంతృప్తి చెందగలరని చెప్పుచున్నది)
ఇలా సంకల్పం చేసుకుని కనీసం నాలుగు నెలల పాటు (వసంత, గ్రీష్మ రుతువులు - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు) ఎవరినీ నివారించకుండా (వద్దనకుండా) జలదానం చేయాలి.
ఇందులో దాగిన ధార్మిక రహస్యాలు:
భూత దయ: శ్లోకంలో కేవలం 'మనుష్యేభ్యః' అనకుండా 'భూతేభ్యః' అనడం మహర్షుల దార్శనికతకు నిదర్శనం. మనుషులతో పాటు ఎండకు అలమటించే మూగ జీవాలకు, పక్షులకు కూడా నీటి తొట్లను ఏర్పాటు చేయాలన్నది దీని అంతరార్థం.
పితృ దేవతా తృప్తి: వైశాఖ మాసానికి అధిపతి ద్వాదశ ఆదిత్యులలో ఒకరైన "అర్యముడు". ఈ అర్యముడే పితృదేవతలకు అధిపతి. కాబట్టి ఈ మాసంలో దాహంతో ఉన్నవారికి నీరు ఇస్తే, ఆ జలం నేరుగా పితృలోకం లోని మన పితృదేవతల దాహార్తిని తీర్చి, వారి ఆశీస్సులను మనకు అందిస్తుందని శాస్త్రం చెబుతోంది.
పక్షాంతర ధర్మం (ధర్మ ఘట దానం)
ఎవరికైతే రోడ్డు మీద పందిరి వేసి, కూలీలను పెట్టి పెద్ద చలివేంద్రం (ప్రపా) నడపడానికి స్తోమత లేదా అవకాశం ఉండదో, వారు కనీసం తమ ఇంటి ఆవరణలో ఒక చల్లని నీటి కుండను (ధర్మ ఘటం) ఉంచాలని లేదా సత్పాత్రుడైన బ్రాహ్మణుడికి జలంతో నిండిన కుండను దానం చేయాలని హేమాద్రి దాన ఖండం నిర్దేశించింది.
ఏష ధర్మఘటో దత్తో బ్రహ్మవిష్ణుశివాత్మకః ।
అస్య ప్రదానాత్ సఫలా మమ సన్తు మనోరథాః ।।
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన ఈ ధర్మ ఘటాన్ని (జల పూర్ణ కుంభాన్ని) దానం చేస్తున్నాను. దీని ద్వారా నా సకల మనోరథాలు (కోరికలు) నెరవేరుగాక!
a. వైశాఖ ప్రాతః స్నానం - పౌరాణిక ధర్మశాస్త్ర ప్రమాణం
శీతాకాలం, వసంత కాలాల తర్వాత సూర్యుని కిరణాలు అత్యంత తీక్షణంగా మారే సమయం ఇది. ఈ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి పూర్వమే చేసే నదీ స్నానం (లేదా చన్నీటి స్నానం) అనంతమైన పుణ్యాన్నిస్తుందని స్కాంద పురాణం ఘోషిస్తోంది.
మాధవే మేషగే భానౌ ప్రాతఃస్నానం కరోతి యః ।
అశ్వమేధ సహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః ।। (స్కాంద పురాణం - వైశాఖ మాహాత్మ్యం)
వైశాఖ మాసంలో (మాధవ మాసంలో), సూర్యుడు మేష రాశిలో సంచరించే కాలంలో (గ్రీష్మ తాపం మొదలయ్యే వేళ) ఎవరైతే ప్రతిరోజూ ప్రాతఃకాలంలో చన్నీటి స్నానం ఆచరిస్తారో, ఆ మానవుడు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంతటి పుణ్యఫలాన్ని పొందుతాడు.
(వివరణ: ఎండల తీవ్రత పెరిగే ఈ కాలంలో తెల్లవారుజామునే స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండి దైవ చింతనకు అనుకూలిస్తుంది అన్నది అంతరార్థం. రోగగ్రస్తులు, వాత సంబంధమైన ప్రతికూలతలను ఎదుర్కొను వారు వైద్యుని సలహా మేరకు ఇట్టి స్నానాలను ఆచరించాలి)
2. స్నాన ప్రాముఖ్యత - ఆయుర్వేద ప్రమాణం (అష్టాంగ హృదయం)
ఆయుర్వేద గ్రంథాలలో తలమానికమైన వాగ్భటాచార్యుని 'అష్టాంగ హృదయం' లోని దినచర్యా అధ్యాయంలో "స్నానం" వల్ల కలిగే ప్రయోజనాలను అద్భుతంగా వర్ణించారు. ధర్మశాస్త్రం "పాపం పోతుంది" అని చెబితే, ఆయుర్వేదం "పాపంతో పాటు తాపం (వేడి) కూడా పోతుంది" అని శాస్త్రీయంగా నిరూపించింది.
స్నానం దీపనమాయుష్యం వృష్యమూర్జాబలప్రదమ్ ।
కండూమలశ్రమాస్వేదతంద్రాటృడ్దాహపాప్మజిత్ ।। అష్టాంగ హృదయం - సూత్రస్థానం - దినచర్యాధ్యాయం 2.16)
సక్రమంగా (చన్నీటితో) ఆచరించే స్నానం జఠరాగ్నిని (దీపనం) వృద్ధి చేస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. వీర్యవృద్ధిని (వృష్యం), ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా, చర్మపు దురదలు (కండూ), మురికి (మల), అలసట (శ్రమ), చెమట (స్వేద), బద్ధకం (తంద్రా), దప్పిక (టృట్), తాపము లేదా మంట (దాహ), మరియు పాపములను (పాప్మ) పోగొట్టి జయిస్తుంది.
(వివరణ: గ్రీష్మ రుతువులో విపరీతంగా వచ్చే చెమట, దాహం, అలసట, మరియు తాపాన్ని తెల్లవారుజామున చేసే స్నానం పూర్తిగా హరిస్తుందని ఆయుర్వేదం ధృవీకరిస్తోంది.)
3. వసంత-గ్రీష్మ రుతు సంధి: ఆయుర్వేద ఆహార విహార నియమాలు (ఆయుర్వేద దృష్టిలో)
సూర్యుడు భూమిపై ఉన్న జలతత్వాన్ని, సారాన్ని పీల్చేసే కాలాన్ని ఆయుర్వేదంలో "ఆదాన కాలం" (ఉత్తరాయణం) అంటారు. వైశాఖ మాసం ఈ ఆదాన కాలంలోనే అత్యంత తీవ్రమైన ఉష్ణ ఘట్టం. వసంతంలో కరిగిన కఫ దోషం తగ్గిపోయి, గ్రీష్మంలో వాత దోషం పెరగడం మొదలవుతుంది. కాబట్టి శరీరానికి చలవ చేసే (శీతల), ద్రవ రూపంలో ఉన్న (ద్రవ) ఆహారాన్ని తీసుకోవాలని ఆయుర్వేదం నిర్దేశించింది.
భజేన్మధుర మేవాన్నం లఘు స్నిగ్ధం హిమం ద్రవమ్ ।
సుశీతతోయసిక్తాంగో లిహ్యాత్సక్తూన్ సశర్కరాన్ ।।
(అష్టాంగ హృదయం - సూత్రస్థానం - రుతుచర్యా అధ్యాయం 3.27):
ఈ గ్రీష్మ రుతువులో (సంధికాలంలో) తీపి రుచి (మధుర) కలిగినవి, తేలికగా జీర్ణమయ్యేవి (లఘు), కొద్దిగా జిగురు/స్నిగ్ధత్వం (నెయ్యి లాంటివి) కలిగినవి, చల్లనైనవి (హిమం), మరియు ద్రవరూపంలో ఉన్న ఆహార పదార్థాలనే సేవించాలి. చల్లని నీటితో స్నానం చేయాలి (సుశీత తోయ సిక్తాంగో). పంచదార లేదా పటిక బెల్లంతో కలిపిన సత్తు పిండిని (పేలాలు/యవల పిండిని) నీటిలో కలుపుకొని త్రాగాలి.
(గమనిక: చల్ల నీటి స్నానం ఆచరించే ముందు వైద్య సలహా తీసుకోవాలి)
వైశాఖ మాసం నాటికి వసంత రుతువు ముగిసి, గ్రీష్మ రుతువు (ఎండాకాలం) పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది. సూర్యుని ప్రతాపం వల్ల శరీరంలో జలతత్వం తగ్గుతుంది. అందుకే:
ఆహారం: శరీరంలో వేడిని పెంచే కారం, మసాలాలు, వేపుళ్లు బాగా తగ్గించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సబ్జా నీళ్లు, నిమ్మ రసం, చెరుకు రసం, పుచ్చకాయ లాంటి ద్రవాహారాలు ఎక్కువగా సేవించాలి. పెరుగన్నం లేదా చద్దన్నం (ఉదయం పూట) తినడం ఆరోగ్యకరం.
విహారం: మధ్యాహ్నం ఎండలో తిరగరాదు. వడదెబ్బ (Sunstroke) తగలకుండా తలపై టోపీ కానీ, గొడుగు కానీ వాడాలి. శరీరానికి గాలి తగిలేలా పలుచని నూలు (Cotton) వస్త్రాలను ధరించాలి.
స్నానం: రోజుకు రెండు సార్లు చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.
పౌరాణిక, ఆయుర్వేద శ్లోకాలను సమన్వయం చేస్తూ.. "మన మహర్షులు వైశాఖ మాసంలో చలివేంద్రాలు (జలదానం) ఎందుకు పెట్టమన్నారు? ప్రాతః స్నానాలు ఎందుకు చేయమన్నారు? అన్నది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఈ ఆదాన కాలంలో ప్రాణకోటి ఉష్ణ తాపం బారిన పడకుండా రక్షించే మహా ఆయుర్వేద/శాస్త్రీయ ప్రక్రియ".
5. వైశాఖ మాసంలో పండుగలు మరియు పర్వ దినాలు:
19.04.2026, ఆదివారం - పరశురామ జయంతి, అక్షయ తృతీయ, త్రేతాయుగాదిః, సింహాచల చందనోత్సవ
21.04.2026, మంగళవారం, శు పంచమి – శ్రీ ఆది శఙ్కర జయంతి
23.04.2026, శు సప్తమి, గురువారం – గంగా సప్తమి లేదా గంగా జయంతి
25.04.2026, శు నవమి, శనివారం – సీతా నవమి లేదా సీతా జయంతి
27.04.2026, శు ఏకాదశి, సోమవారం - మోహిని ఏకాదశి (మతత్రయ ఏకాదశి)
30.04.2026, శు చతుర్దశి, గురువారం - శ్రీ నృసింహ జయంతి
01.05.2026, పౌర్ణమి, శుక్రవారం - మహా వైశాఖి, కూర్మ జయంతి, బుద్ధ పౌర్ణమి, సంపద్గౌరీ వ్రతం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం
05.05.2026, బ చతుర్థి, మంగళవారం - డొల్లు కర్తరి, ఏకదంత సంకష్టహర చతుర్థి
11.11.2026, బ నవమి, సోమవారం - అగ్నికర్తరి (నిజ కర్తరి)
12.12.2026, బ దశమి, మంగళవారం - శ్రీ హనుమజ్జయంతి (తెలుగు)
13.12.2026, బ ఏకాదశి, బుధవారం – అపర ఏకాదశి
15.05.2026, బ త్రయోదశి/చతుర్దశి, శుక్రవారం - వృషభ సంక్రమణం, మాస శివరాత్రి, వట సావిత్రీ వ్రతం
16.05.2026, అమావాస్య, శనివారం - శని జయంతి, దర్శ అమావాస్య, పిండ పితృ యజ్ఞః
అక్షయ తృతీయ విశిష్టత
వైశాఖ శుక్ల తృతీయను 'అక్షయ తృతీయ' అంటారు. కృత యుగం ఈ రోజునే ప్రారంభమైందని శాస్త్ర ప్రమాణం (కృత యుగాది).
అస్యాం తిథౌ క్షయముపైతి హుతం న దత్తం తేనాక్షయేతి కథితా మునిభిస్తృతీయా ।
ఉద్దిశ్య దైవతపితౄన్ క్రియతే మనుష్యైః తచ్చాక్షయం భవతి భారత సర్వమేవ ।।
(మదన రత్నం / భవిష్యోత్తర పురాణం)
ఓ ధర్మరాజా! ఈ తిథినాడు చేసిన హోమము, ఇచ్చిన దానము ఎన్నటికీ క్షయము కావు (నశించవు). దేవతలను, పితృదేవతలను ఉద్దేశించి ఏ సత్కర్మ చేసినా అది అక్షయమైన (అనంతమైన) ఫలాన్ని ఇస్తుంది. కాబట్టే మునులు దీనిని 'అక్షయ తృతీయ' అన్నారు.
(అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కూడా ఖరీదు చేస్తారు. ఆస్తులు, ధనం, సంపదలు బంగారంతో సహా అన్నీ ఏదో ఒకనాడు నశించి పోతాయి. లేదా మనిషి వాటిని కోల్పోతాడు. కాని అక్షయ తృతీయ నాడు ఖరీదు చేసింది ఏదైనా కూడా శాశ్వతంగా ఉండిపోతుందని, దానికి క్షయం ఉండదని తెలియుచున్నది. అంతేకాదు అక్షయ తృతీయ నాడు ఆరంభించిన జ్ఞాన సాధనాలు, విద్య సాధనాలు కూడా అఖండ ఫలితాలను ఇస్తాయి)
6. ఈ మాసంలో జరుపుకోదగు శుభ కార్యాలు:
మాఘ, ఫాల్గుణ మాసాల తర్వాత శుభకార్యాలకు అత్యంత ప్రశస్తమైన మాసం వైశాఖం. దీని విశిష్టత గూర్చి పైన సవివరంగా చెప్పబడింది. వివాహాలు: ఈ మాసంలో వివాహం చేసుకున్న దంపతులు అన్యోన్యంగా ఉంటారని ప్రతీతి. అక్షయ తృతీయ రోజు ముహూర్తం చూడకుండానే వివాహాలు చేసుకునే ఆచారం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇతర శుభకార్యాలు: గృహప్రవేశం, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, మరియు నూతన వ్యాపార ప్రారంభాలకు ఇది ఎంతో అనుకూలమైన మాసం.
మాఘే చ ఫాల్గుణే చైవ వైశాఖే జ్యేష్ఠ మాసయోః ।
వివాహః సార్వవర్ణికః సర్వసంపత్ప్రదాయకః ।। (ముహూర్త చింతామణి - వివాహ ప్రకరణం)
మాఘ, ఫాల్గుణ, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో అన్ని వర్ణాల వారికి వివాహం శుభప్రదం మరియు సర్వ సంపదలను ప్రసాదిస్తుంది.
వైశాఖే ఫాల్గుణే మార్గే శ్రావణే మాఘ మాసయోః ।
గృహారంభః ప్రవేశశ్చ సర్వసంపత్ప్రదాయకః ।। (వాస్తు శాస్త్రం /కాలామృతం - షష్ఠ బిందువు - వాస్తు ప్రకరణం లేదా గృహవాస్తు బిందువు)
వైశాఖ, ఫాల్గుణ, మార్గశిర, శ్రావణ, మాఘ మాసాలలో గృహారంభం మరియు గృహప్రవేశం సర్వసంపదలను కలిగిస్తుంది.
వైశాఖ మాసంలో వచ్చే వృషభ సంక్రమణం:
1. సూర్య సిద్ధాంతం - వృషభ సంక్రమణ విశిష్టత (విష్ణుపదీ సంక్రమణం)
సూర్య సిద్ధాంతం మరియు ఇతర ధర్మశాస్త్రాల ప్రకారం, సంవత్సరంలోని 12 సంక్రమణాలను వాటి ఖగోళ స్థానాన్ని బట్టి నాలుగు విభాగాలుగా వర్గీకరించారు:
అయన సంక్రమణాలు (2): మకర, కర్కాటక
విషువత్ సంక్రమణాలు (2): మేష, తులా
షడశీతి ముఖ సంక్రమణాలు (4): మిథున, కన్య, ధనుస్సు, మీన
విష్ణుపదీ సంక్రమణాలు (4): వృషభ, సింహ, వృశ్చిక, కుంభ.
వృషభ రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని "విష్ణుపదీ సంక్రమణం" అంటారు.
పుణ్యకాల నిర్ణయం: ఏదైనా సంక్రమణం జరిగినప్పుడు ఆ సంక్రమణానికి ముందు లేదా వెనుక కొంత సమయాన్ని పితృ తర్పణాలు, దాన ధర్మాలకు 'పుణ్యకాలం'గా శాస్త్రాలు నిర్ణయించాయి. విష్ణుపదీ సంక్రమణాలకు పుణ్యకాలం సంక్రమణానికి ముందు మాత్రమే ఉంటుంది.
"విష్ణుపద్యాం ప్రాక్ షోడశ నాడ్యః పుణ్యకాలః" (ముహూర్త చింతామణి శుభాశుభ ప్రకరణం 48వ శ్లోకం / ధర్మసింధు ద్వితీయ పరిచ్ఛేదము - సంవత్సర కృత్యములు)
\విష్ణుపదీ సంక్రమణాలకు (వృషభ, సింహ, వృశ్చిక, కుంభ) సంక్రమణం జరగడానికి ముందు ఉన్న 16 ఘడియల కాలం (అనగా సుమారు 6 గంటల 24 నిమిషాల సమయం) అత్యంత పుణ్య ప్రదమైనది. ఈ వృషభ సంక్రమణ సమయంలో జలదానం, వస్త్ర దానం మరియు పితృ తర్పణాలు ఆచరించడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది.
2. సూర్యుడు వృషభ రాశిలో సంచరించుట వలన ఫలం
మేదిని జ్యోతిషం (ప్రకృతి/వాతావరణం) ప్రకారం:
మేదిని జ్యోతిషం (వాతావరణం మరియు వ్యవసాయం): వృషభ రాశి భూతత్వ రాశి. దీనికి అధిపతి జలగ్రహమైన శుక్రుడు. అగ్ని తత్వం కల సూర్యుడు వృషభంలోకి ప్రవేశించినప్పుడు గ్రీష్మ రుతువు తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. వరాహమిహిరుని బృహత్సంహిత (రోహిణీ యోగాధ్యాయం) ప్రకారం, సూర్యుడు వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రంలో సంచరించే కాలాన్ని (రోహిణీ కార్తె) రాబోయే వర్షాలకు గీటురాయిగా భావిస్తారు. ఈ సమయంలో ఎండలు ఎంత తీవ్రంగా (రోళ్లు పగిలేలా) ఉంటే, ఆ తదుపరి వర్షాకాలంలో వర్షాలు అంత సమృద్ధిగా పడతాయి. ఇది కర్షకులకు అత్యంత ఆశాజనకమైన సూచన. "రోహిణీ కార్తెలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటే, వర్షాలు అంత సమృద్ధిగా కురుస్తాయి" అనే విషయానికి బృహత్సంహితలో ఖచ్చితమైన శాస్త్ర ప్రమాణం ఉంది. అయితే, వరాహమిహిరుడు ఈ ఉష్ణ తాప విశేషాలను 'రోహిణీ యోగాధ్యాయం'లో కాకుండా, 'గర్భలక్షణాధ్యాయం' (21వ అధ్యాయం) లో పొందుపరిచారు. ఈ రెండు అధ్యాయాల్లో ఉన్న సూక్ష్మమైన భేదం:
1. గ్రీష్మ తాపం (ఎండల తీవ్రత) - మేఘ గర్భధారణకు సూచిక
వర్షాకాలంలో మేఘాలు సమృద్ధిగా నీటిని వర్షించడానికి (మేఘ గర్భధారణకు) ముందుగా ఏయే రుతువుల్లో వాతావరణం ఎలా ఉండాలో వరాహమిహిరుడు గర్భలక్షణాధ్యాయంలో స్పష్టంగా వివరించారు.
అతిశీతేన తుషారైర్హేమంతే శిశిరమాసి వాతేన ।
గ్రీష్మేఽర్కతాపపవనైః సల్లక్షణమంబుగర్భాణామ్ ।। (బృహత్సంహిత - గర్భలక్షణాధ్యాయం - 21.33)
హేమంత రుతువులో విపరీతమైన చలి మరియు మంచు పడటం, శిశిర రుతువులో చల్లని గాలులు వీచడం, ఇక గ్రీష్మ రుతువులో (సూర్యుడు వృషభంలో ఉన్నప్పుడు) సూర్యుని తీవ్రమైన తాపము (ఎండలు) మరియు వడగాలులు వీచడం అనేది జలగర్భాలకు (మేఘాలు వర్షాన్ని మోసుకురావడానికి) అత్యంత శుభలక్షణాలు. అనగా, గ్రీష్మంలో ఎండ ఎంత మండితే, రాబోయే వర్షాకాలంలో వర్షాలు అంత సమృద్ధిగా పడతాయి అని పరాశర, గర్గాది మహర్షుల వచనం.
3. బృహత్సంహిత - రోహిణీ యోగాధ్యాయం (24వ అధ్యాయం)
బృహత్సంహితలోని 24వ అధ్యాయమైన "రోహిణీ యోగాధ్యాయం" ప్రధానంగా సూర్యుని సంచారాన్ని కాకుండా, ఆషాఢ మాస కృష్ణ పక్షంలో చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ప్రవేశించినప్పటి వాతావరణాన్ని పరిశీలించి వర్షాలను నిర్ణయించే విధానాన్ని వివరిస్తుంది.
ప్రాజేశమాషాఢతమిస్రపక్షే క్షపాకరేణోపగతం సమీక్ష్య ।
వక్తవ్యమిష్టం జగతోఽశుభం వా శాస్త్రోపదేశాద్గ్రహచింతకేన ।। (బృహత్సంహిత - రోహిణీ యోగాధ్యాయం - 24.4)
ఆషాఢ మాస కృష్ణ పక్షంలో (తమిస్ర పక్షే) చంద్రుడు (క్షపాకరుడు) రోహిణీ నక్షత్రాన్ని (ప్రాజేశం) పొందిన కాలాన్ని నిశితంగా పరిశీలించి, జ్యోతిష్కుడు ఆ సంవత్సరంలో జగత్తుకు శుభమా లేక అశుభమా (అనగా సుభిక్షంగా ఉంటుందా లేక కరువు వస్తుందా) అన్నది శాస్త్రానుసారం చెప్పాలి. (ఆ రోజు గాలి వీచే దిశను బట్టి రాబోయే 4 నెలల వర్షపాతాన్ని నిర్ణయించే ఖగోళ గణితం ఈ అధ్యాయంలో ఉంది).
4. సూర్యుడు వృషభ రాశి (రోహిణి)లో సంచరించుట వలన ఫలం
వైశాఖ మాసం చివరలో లేదా జ్యేష్ఠ మాసం ప్రారంభంలో సూర్యుడు వృషభ రాశిలోని రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనినే వ్యవసాయ పరిభాషలో 'రోహిణీ కార్తె' అంటారు.
వాతావరణ పరమైన ఫలం (మేదిని జ్యోతిషం): రోహిణి ఒక "మధ్యమ నాడి" నక్షత్రం. దీని పై అగ్ని తత్వ సూర్యుని సంచారం ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు గరిష్ఠానికి చేరుకుంటాయి. పైన 21వ అధ్యాయం శ్లోకంలో చెప్పినట్లుగా, ఈ "అర్క తాపం" సముద్రాలలోని జలాన్ని ఆవిరిగా మార్చి రుతుపవనాలను బలోపేతం చేస్తుంది. అందుకే వ్యవసాయ శాస్త్రంలో ఈ కార్తె ఎండలను "సల్లక్షణాలు" గా (శుభ సూచకాలుగా) భావిస్తారు.
సమస్త పాపాలను హరించి, అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మాధవ మాసమే ఈ పవిత్ర వైశాఖ మాసం. సూర్య తాపం నుండి ప్రాణులను రక్షించే జలదానం, ప్రపా దానాల (చలివేంద్రాల) ద్వారా భూతదయను చాటుకుంటూ... అటు పితృదేవతలను, ఇటు శ్రీ మహావిష్ణువును ఒకేసారి మెప్పించగల అద్భుతమైన అవకాశం ఈ మాసంలో మాత్రమే లభిస్తుంది. అర్యమ ఆదిత్యుని సాక్షిగా గృహ, వివాహాది శుభకార్యాలకు అత్యంత స్థిరత్వాన్నిచ్చే ఈ మాసం... కేవలం ఒక కాలఖండం కాదు, ఆయుర్వేద, జ్యోతిష, ధర్మశాస్త్రాల అద్భుత సమ్మేళనంతో సనాతన ధర్మం మానవాళికి ప్రసాదించిన ఒక మహా వరప్రసాదం. ఈ పవిత్ర వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ తమ శక్త్యానుసారం ప్రాతఃస్నాన, దాన, జప, యజ్ఞాదులు ఆచరించి ఆ మధుసూదనుని పరిపూర్ణ కృపకు, ఇంద్రాగ్నుల ఆశీస్సులకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కుంటున్న ఒక భయంకరమైన యుద్ధ వాతావరణాన్ని కూడా భగవానుడు ఉపశమింప చేసి లోకంలో శాంతిని నెలకొల్పి సమస్త జీవరాశిని కాపాడాలని భగవంతుడిని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. సర్వం శ్రీ కృష్ణ దివ్య చరణారవిందార్పణ మస్తు!
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
శ్రీ పరాభవ చైత్ర శు దశమి, భానువారం 12.04.2026