రుద్ర యజ్ఞము - బ్రహ్మజ్ఞాన సాధన

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

‘రుద్ర యజ్ఞము - బ్రహ్మజ్ఞాన సాధన’

‘ఆయుర్ యజ్ఞేన కల్పతామ్, ప్రాణో యజ్ఞేన కల్పతామ్, అపానో యజ్ఞేన కల్పతామ్, వ్యానో యజ్ఞేన కల్పతామ్, చక్షుర్ యజ్ఞేన కల్పతామ్, శ్రోత్రం యజ్ఞేన కల్పతామ్, మనో యజ్ఞేన కల్పతామ్, వాక్ యజ్ఞేన కల్పతామ్, ఆత్మా యజ్ఞేన కల్పతామ్, యజ్ఞో యజ్ఞేన కల్పతామ్ – శ్రీ రుద్ర చమక ప్రశ్న – దశమ అనువాకః’

‘ఆయుర్ యజ్ఞేన కల్పతామ్’ ఆయువు యజ్ఞము చేత (కల్పతా అనగా శక్తి గలది లేదా యోగ్యత గలదై) శక్తిని పొందుగాక; ‘ప్రాణో యజ్ఞేన కల్పతామ్’ ప్రాణము యజ్ఞము చేత శక్తి గలదై ఉండు గాక; ‘అపానో యజ్ఞేన కల్పతామ్’ అపానము యజ్ఞము చేత శక్తి గలదై ఉండు గాక; ‘వ్యానో యజ్ఞేన కల్పతామ్’ వ్యానము యజ్ఞము చేత శక్తి గలదై ఉండు గాక [‘ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన’ అనునవి పఞ్చ విధ ప్రాణ వాయువులు. ప్రాణోఽపానః సమానశ్చోదానవ్యానో చ వాయవః – అమరకోశః. ప్రాణో వ్యానోఽపాన ఉదానః సమానః – తైత్తిరీయోపనిషత్తు ౧.౭ ప్రాణ వ్యాన అపాన ఉదాన మరియు సమాన అను ప్రాణాది వాయువులు సాధకుడు ఉపాసన చేయాల్సిన పాఞ్క్తులలో లేదా పంచవిధ ఆదిభూతములలో (మూల కారకాలలో) ఒకటి ఐనవి. అందుకే ఇట్టి ఆదిభూతములు అధ్యాత్మ సృష్టికి ప్రధాన కారకాలు. ఈ రుద్ర మంత్రంలో అపాన వ్యాన వాయువులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడినది. ‘వ్యాన’ వాయువు శరీరమంతా కూడా వ్యాపించి ఉంటుంది. అందుకే ఇది తగిన శక్తిని కలిగి ఉండాలి. ఈ రెండూ కూడా ‘ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తచారిణౌ – భగీ ౫.౨౭’. ఈ రెండు విధములైన ప్రాణ వాయువులు నాసిక యందే సంచరిస్తూ ఉంటాయి. ‘వ్యాన’ వాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. ‘అపాన’ వాయువు మాత్రం అధోముఖంగా ప్రయాణించి గుదము ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇట్టి వాయువే శరీరము నుండి ప్రాణాన్ని (ప్రాణ వాయువును) కూడా బయటకు పంపగల శక్తిని కలిగి ఉంటుంది. అందుకే ఈ రెండు విధములైన ప్రాణ వాయువులు కూడా తగిన శక్తిని కలిగి ఉండాలి]; ‘చక్షుర్ యజ్ఞేన కల్పతామ్’ చక్షువులు యజ్ఞము చేత శక్తి గలవై ఉండు గాక; ‘శ్రోత్రం యజ్ఞేన కల్పతామ్’ శ్రోత్ర ఇంద్రియము యజ్ఞము చేత శక్తి గలదై ఉండు గాక; ‘మనో యజ్ఞేన కల్పతామ్’ మనస్సు యజ్ఞము ద్వారా శక్తి గలదై ఉండు గాక; ‘వాక్ యజ్ఞేన కల్పతామ్’ వాక్కు యజ్ఞము ద్వారా శక్తి గలదై ఉండు గాక; ‘ఆత్మా యజ్ఞేన కల్పతామ్’ శరీరాన్ని ధారణ చేసి యున్న ఆత్మ యజ్ఞము ద్వారా సమర్థమై ఉండుగాక; ‘యజ్ఞో యజ్ఞేన కల్పతామ్’ యజ్ఞము ఈ విధమైన పలు యజ్ఞాల ద్వారా సమర్థవంతమగు గాక (చక్షువులు సమస్త సృష్టిని ఈశ్వర స్వరూపంగా చూడగలగాలి, శ్రోత్రేంద్రియం సదా ఈశ్వరుడి స్తుతినే వినాలి, వాక్కు సదా ఈశ్వర నామాన్నే ఉచ్చరిస్తూ ఉండాలి. మనస్సు సదా ఈశ్వరుడిని మాత్రమే ధ్యానం చేస్తూ ఉండాలి. మనస్సులో ఇతర ఆలోచనలు ఏవీ కూడా రాకూడదు. ఇదే ఈశ్వర యజ్ఞం. ఇట్టి ఈశ్వర యజ్ఞం శరీరంలోని పఞ్చ విధ ప్రాణ వాయువు లందు వ్యాపించి ఉండుగాక)


ఈ యజ్ఞాన్ని మనం రెండు విధాలుగా ఆచరించ వచ్చు.

ఒకటి: బ్రహ్మ యజ్ఞము – ఫలాపేక్ష రహితంగా మనస్సు, ఇన్ద్రియాలతో ఆచరించు కర్మలన్నియు లోక సంగ్రహార్థం ఆచరించిన ఎడల అట్టి కర్మల యందు కర్తృత్వం మరియు భోక్తృత్వం లేక పోవుట వలన అట్టి యజ్ఞము బ్రహ్మ యజ్ఞముగా పరిగణించ బడును.



రెండు: ఫలాన్ని ఆశించి చేసే యజ్ఞము – ఇట్టి యజ్ఞము నందు ఆయా ఇన్ద్రియాల ద్వారా ఆచరించు కర్మలు ఒక నిర్దిష్టమైన ఫలాన్ని పొందుటకు చేయునవై ఉంటాయి. ఇట్టి కర్మలు మనిషిని బంధిస్తాయి.



ఈ రెండు విధములైన కర్మలందు కూడాను, ఆయా ఇన్ద్రియాలు శక్తి గలవై ఉండాలి. అప్పుడే కర్మ సఫలమౌతుంది. భోక్తృత్వం ఉంటే బంధించ బడతాము, లేని ఎడల, లోక సంగ్రహార్థం కర్మ వినియోగమై ఇట్టి కర్మలన్నియు విలీనమై, బ్రహ్మార్పణం మగుట వలన ముక్తి లభిస్తుంది. దీనికి అనుబంధంగా శ్రీమద్ భగవద్గీత యందలి ఒక శ్లోకాన్ని తెలుసుకోవాలి:



బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।

బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। భగీ 4.24 ।।

యజ్ఞము నందలి హోమ సాధనములు, హోమ ద్రవ్యములు (హవిస్సులు), హుతము (హోమాగ్ని), హోమము చేయువాడు, హోమము చేయ బడినది – అన్నియును బ్రహ్మ స్వరూపములే అనెడి ఏకాగ్ర చిత్తంతో (భావంతో) ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.



అందుకే ‘యజ్ఞో యజ్ఞేన కల్పతాం’ ఆయా ఇన్ద్రియాల ద్వారా ఆచరించు ఇట్టి యజ్ఞము ద్వారా బ్రహ్మ యజ్ఞము తగిన విధంగా స్థిరమైనదగు గాక. మనస్సును మరియు ఆయా ఇన్ద్రియాలను శక్తివంతము కావాలని ఈ రుద్ర మంత్రం ద్వారా శ్రీ రుద్రుడిని ప్రార్థించు చున్నాము. బలహీనమైన మనస్సు మరియు ఇన్ద్రియాలు గల వాడు బ్రహ్మ యజ్ఞాన్ని ఆచరించలేడు. బ్రహ్మ యజ్ఞము మాత్రమే కాదు, ఏ కర్మ కూడా ఆచరించ లేడు. ఫలాన్ని ఏనాడు పొందలేడు. జీవిత కాలమున పలు విధాలైన పరాభవాలను ఎదుర్కొను సూచనలున్నాయి. బలమైన మరియు చక్కని ఏకాగ్రత గల మనస్సు గల వాడే సాధన చేయగలడు. అందుకే ముందుగా మనస్సు నిశ్చలమై తగిన శక్తిని కలిగి ఉండాలి. ‘ఆత్మా యజ్ఞేన కల్పతాం’ జన్మాంతర కర్మల ఫలాలకు అనుగుణంగా శరీరాన్ని ధారణ చేసిన ఆత్మ బలపడు గాక. అనగా అట్టి ఆత్మను ఆవరించి యున్న పలు విధాలైన జన్మాంతర కృత వాసనలు తొలగిపోవు గాక. జన్మాన్తరకృత వాసనలను రెండు విధాలుగా విభజించ వచ్చు. మొదటిది – బ్రహ్మజ్ఞాన సంబంధమైనది, రెండవది – బాహ్య వస్తు సంబంధమైనది.



మొదటిదైన బ్రహ్మజ్ఞాన సంబంధిత వాసనలు. ‘జన్మాన్తరకృతస్య మహతాం స్మృతిః చ యుజ్యతే (శ్రీ రామానుజ భాష్యం భగీ ౪.౪)’ మహాపురుషులు జన్మాంతరంలో ఆచరించిన కర్మల యొక్క వాసనను కలిగి ఉంటారు. ఇట్టి వాసనలు ఆత్మను కప్పిపెట్టి ఉంచక, దాని తేజస్సును పెంచుతూ ఉంటుంది, ఆత్మ దేదీప్యమానంగా వెలిగే విధంగా చేస్తాయి. అట్టి వారు ఆత్మజ్ఞానమును పొందిన వారు.



రెండవది – వస్తు మరియు విషయ సంబంధిత వాసనలు.
ఇట్టి వాసనలు ఆత్మజ్ఞానాన్ని కప్పిపెట్టి ఉంచుతాయి. తత్ప్రభావము వలన సాధకుడు ప్రకృతికి చెందిన వస్తు సంబంధమైన వాంఛలను నిజమైన ఆత్మ తత్త్వముగా భావిస్తాడు. ఇదే ‘శ్రీ మహావిష్ణు మాయ’. ఈ మాయ నుండి బయటబడ్డ వాడు మాత్రమే మొదటి కోవకు చెందిన వాడగును.



వాసనలను తీర్చుకొనుటకు గాను ఇన్ద్రియాల అవసరం తప్పనిసరి. ఈ విధంగా ఆయా ఇన్ద్రియాలు
‘అర్పణమ్’ అర్పణ సాధనాలు. ఇట్టి అర్పణ సాధనాలు మరియు వీటి ద్వారా ఆచరించబడిన కర్మల ద్వారా పొందిన ఫలాలు అన్నియు ‘బ్రహ్మమే’. కావున, ‘తథా బ్రహ్మాగ్నౌ ఇతి సమస్తం పదమ్’ అదేవిధంగా ‘బ్రహ్మాగ్నౌ’ అనునది సమస్తపదం (శ్రీ శజ్ఞ్కర భగవత్పాద భాష్యం భగీ ౪.౨౪). అనగా లోక సంగ్రహార్థం ఆయా ఇన్ద్రియాల ద్వారా చరించు కర్మలన్నియు బ్రహ్మాగ్నితో సమానమైనవి. అందుకే పైన తెలుపబడిన రుద్ర మంత్రమందు ‘యజ్ఞో యజ్ఞేన కల్పతాం అని చివరి పదము. అనగా మనస్సుతో సహా ఆయా ఇన్ద్రియాల ద్వారా ఆచరించబడిన కర్మలన్నియు బ్రహ్మాగ్ని యందు దహించ బడు గాక. అప్పుడే కర్మలు మనను బంధించక, లోక సంగ్రహం జరిగి మోక్షానికి అర్హుల మగుదుము. మనస్సుతో సహా ఇన్ద్రియాలకు శక్తిని ప్రసాదించు మని ప్రార్థించునది. ఎంతో పుణ్యం చేసుకోవడం ద్వారా మానవ జన్మ లభిస్తుంది. అట్టి మానవుడి ఆయా ఇన్ద్రియాలు చాలా శక్తివంతమైనవి. వాటి శక్తి దుర్వినియోగం కాకూడదని శ్రీ రుద్రుడిని ప్రార్థించుటయే ఈ రుద్ర మంత్రార్థము.


ఇదే రుద్ర యజ్ఞము, ఇదే బ్రహ్మ యజ్ఞము కూడాను.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –

న్యాయేన మార్గేణ మహీం మహీశాః

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।



నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

19.11.2021 – శ్రీ ప్లవ నామ కార్తీక పౌర్ణమి