దుఃఖం ఎవరికి

శ్రీ గాయత్రి వేద విజన్, హన్మకొండ

https://www.srigayatriveda.com/

 

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

 

ధర్మ సందేహాలు

 

ప్రశ్న : దుఃఖం ఎవరికి ?

      అ.    శరీరానికా ?

      ఆ.    జ్ఞానానికా ?

      ఇ.    దుఃఖానికా ?

      ఈ.      జ్ఞానంతో కూడిన శరీరానికా ?

 

       ఈ నాల్గింటి కంటే అన్యమైనది మరొకటి లేదు. కనుక  పై నాల్గింటిలో దుఃఖం ఎవరికి?

 

నివృత్తి:

ఇది ఒక అద్భుతమైన సందేహం. ఈ సమస్యను పరిష్కరించే ముందు దాని మూలాలను ముందుగా గ్రహించాలి. అసలు దుఃఖము ఎలా కలుగుతుంది?

మనిషికి వస్తు వ్యామోహం, విషయ వ్యామోహం అధికంగా ఉంటుంది. వస్తు మరియు విషయ వాంఛను కలిగి యుండి వాటి సాధనకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. భౌతికమైన మరియు ప్రకృతితో ముడిపడి యున్న ప్రతి వస్తువు ప్రకృతి క్రమంలో పుడుతుంది మరియు నశిస్తుంది. ఇది నిరంతరం మార్పు చెందు తత్త్వము కలది. అందుకే శ్రీ శజ్ఞ్కర భాష్యంలో దీన్ని ‘వ్యభిచర’ అని అన్నారు. అనగా నిరంతర చర స్వభావము కలది. దీనికి స్థిరత్వము లేదు. అందుకు భిన్నంగా కలది ‘అవ్యభిచర’ అనగా స్థిరమైనది మరియు నిత్యమూ శాశ్వతమైనది. దేహము ప్రకృతికి చెందిన పఞ్చ మహా భూతాలతో నిర్మితమైనది. కావున దీనికి ఉత్పత్తి మరియు వినాశనము కలది. దీన్ని ‘దేహము’ అని అన్నాము. ఇది నిజానికి ‘నేను’ కాదు. నేను నివాసం ఉన్న దేహము మాత్రమే. అందుకే ‘నన్ను’ అనగా ‘ఆత్మను’ దేహి అని అన్నారు.

 

‘నేను’ జన్మాంతర కృత వాసనలతో జన్మించాను. తదనుగుణంగా గల దేహాన్ని ఆశ్రయంగా చేసుకొని నా కోరికలను తీర్చుకోను చున్నాను. ‘నన్ను‘ ఈ జన్మాన్తరకృత వాసనలు కప్పివేసి ఉన్నాయి.

ధూమేనావ్రియతే వహ్నిర్యథాఽఽదర్శో మలేన చ ।

యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।।భగీ 3.38।। 

పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దమున్ను, మావిచేత గర్భ మందలి శిశువున్ను ఏవిధంగా కప్పబడి యుండునో, అదే విధంగా కామము చేత ఆత్మజ్ఞానము కూడా కప్పబడి యుండును.

కావున నేను ఈ రకంగా పలు విధాలైన మలినాలతో కప్పబడి ఉన్నాను. అందుకే శుద్ధ పరమాత్మ తత్త్వాన్ని గ్రహించలేక ఉన్నాను. నాలోని కామ వాంఛలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. వాటిని సాధించుకోవడానికి నిరంతరం కర్మను ఆచరిస్తూనే ఉన్నాను. అది నాకు ఫలాన్ని ఇస్తుంది. అట్టి ఫలం నాకు సుఖము మరియు దుఃఖము అనే ద్వన్ద్వాలను ప్రసాదించు చున్నది. సుఖం కలిగిన నాడు చాలా ఆనందంగా ఉన్నది. కాని దుఃఖాన్ని భరించలేక ఉన్నాను.

 

నేను కోరుకున్న వస్తువు దొరికితే ఆనందం, అది పొతే దుఃఖం. నేను కోరుకున్న వస్తు మరియు విషయం లభిస్తే ఆనందం, పొతే దుఃఖం. నావాళ్ళు అందరూ నేను కోరుకున్న విధంగా ఉంటే ఆనందం, పొతే దుఃఖం. ఈవిధమైన అశాశ్వతమైనవి లభిస్తే ఆనందం, పొతే దుఃఖం. నిజానికి మనం సత్యం మరియు అసత్యం మధ్య నలిగి పోతూ ఉన్నాము. నిజానికి ఈ వస్తువు గాని విషయం గాని మునుపు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. మునుపు లేని భవిష్యత్తులో  ఉందని వస్తువు యొక్క ఉనికి గూర్చి ఆనందించడం దుఃఖించడం మూర్ఖత్వం అవుతుంది. లౌకికమైన పలు రకాలైన ఉదాహరణలు దీనికి ఇవ్వవచ్చు.

 

కావున ఈ ద్వన్ద్వాలు వస్తు మరియు విషయముల ద్వారా ఉత్పన్నమౌతున్నాయి. నశించి పోతున్నాయి కూడా. అందుకే ఇవి అసత్తులు. దేహాన్ని నివాసంగా చేసుకున్న నేను, నా వాసనలకు అనుగుణంగా గల వస్తువులను ఇన్ద్రియాల ద్వారా గ్రహించి, వాటిని సమకూర్చుకొని, దేహం ద్వారా అనుభవించు చున్నాను. సుఖం కలిగినా, కష్టం వచ్చినా దేహానికే వస్తుంది. దాని ద్వారా అట్టి అనుభూతిని మాత్రమే నేను పొందు చున్నాను. కావున దుఃఖం కలుగు తున్నది అజ్ఞానంతో కప్పబడి ఉన్న నాకు. సుఖం లేదా కష్టం నిజమైనదని, శాశ్వతమైనదని భావించి దుఃఖించు చున్నాను. కాని అది ‘వ్యభిచర’ ప్రవృత్తి కలది. కావున నిజానికి సుఖం దుఃఖం రెండూ కూడా అసత్తులే అగుట వలన అవి శాశ్వతమైనవి కావు. కావున నాపై ఉన్న అజ్ఞానపు పొరను నేను తొలగించి చూస్తే శుద్ధ తత్త్వము మరియు జ్ఞాన తేజస్సు కనబడుతుంది. కావున జ్ఞానానికి దుఃఖం లేదు. జ్ఞానికి సుఖం కూడా లేదు. సుఖాన్ని మరియు దుఃఖాన్ని అనుభవిస్తున్నానని అనుకోవడం అజ్ఞానం. కావున దుఃఖం కలిగేది అజ్ఞానంతో కూడిన శరీరానికి. జ్ఞాని దృష్టిలో సుఖం గాని దుఃఖం గాని లేవు, జ్ఞాని దృష్టిలో వాటి ఉనికి ఉండదు. కావున జ్ఞానానికి దుఃఖం తో సంబంధం లేదు. అజ్ఞానం కప్పబడి యున్న నేను ఆశ్రయం తీసుకొన్న దేహం ద్వారా కష్టాన్ని దుఃఖాన్ని అనుభవించు చున్నాను. ‘అసతో దేహస్య సద్భావో న విద్యతే సతః చ ఆత్మనో న అసద్భావః’  శ్రీ రామానుజ భాష్యం (భగీ ౨.౧౬) – దేహము ‘అసత్’, దీని ఉనికి ఏనాడు లేదు. ఆత్మ (శుద్ధ పరమాత్మ తత్త్వము) ‘సత్’ ఇది ఏనాడు నశించునది లేదా అంతమై పోవునది కాదు.  ఇది ఒక భ్రాంతి మాత్రమే. ఇది ఒక విష వలయం. ఈ వలయం నుండి బయట పడాలంటే ముందుగా మనలోని అజ్ఞానాన్ని పారద్రోలి, శుద్ధ తత్త్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ‘వ్యభిచర’ ప్రవృత్తి గల విషయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవే మనను నిరంతరం కష్టపెడుతూ ఉంటాయి. జ్ఞానానికి శరీరానికి ఉండే గ్రంథిని తుంచేయాలని. మనం నివసించి యున్న శరీరం ఒక సాధన పరికరం మాత్రమే. అట్టి పరికరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే సాధన సఫలమౌతుంది. ఆత్మజ్ఞాన సాధనకు మాత్రమే దాన్ని వినియోగించాలి. నలుగురికి పనికి వచ్చే శాస్త్ర విహితమైన పనులు చేయాలి. ఫలాన్ని ఆశించకుండా ఉంటే ద్వన్ద్వాలు మనను ఏమీ చేయజాలవు.

 

దీనికి అనుబంధ ప్రశ్న కూడా కలదు. దాని గూర్చి మళ్ళీ ఒకరోజు తెలుసుకుందాము.

 

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः

गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

 

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

https://www.srigayatriveda.com/