చైత్ర మాస విశిష్టత
శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః – శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
శుభ గ్రహ
మాసాలు – వాటి ప్రత్యేకతలు
చైత్ర మాసం
కాలాత్మకమైన సంవత్సర చక్రంలో తొలి మాసం, సృష్టికి మూలమైన అత్యంత విశిష్టమైన చైత్ర మాసం గురించి శాస్త్ర, పురాణ ప్రమాణాలతో సవివరంగా చర్చించుకుందాం.
1. చైత్ర మాసం - నామ సార్థకత మరియు వసంత ఋతువు
మాసాలకు పేర్లు ఆయా మాసాల పౌర్ణమి నాడు చంద్రుడు ఉండే నక్షత్రాన్ని బట్టి వచ్చాయన్నది జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం.
"చిత్రా నక్షత్రేణ యుక్తా పౌర్ణమాసీ యస్మిన్ మాసే సః చైత్రః"
అర్థం: పౌర్ణమి నాడు చంద్రుడు చిత్రా నక్షత్రంతో కూడి ఉండే మాసం కాబట్టి దీనికి "చైత్ర మాసం" అని పేరు.
చైత్ర మాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. విభూతి యోగంలో (10.35) శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా:
శ్లోకం: "బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ||"
"ఋతువులలో నేను పూలు పూచే వసంత ఋతువును (కుసుమాకరః)" అని తన విభూతిని ప్రకటించాడు. అటువంటి వసంతానికి ప్రాణం ఈ చైత్ర మాసం.
2. చైత్ర మాసానికి అధిపతి ‘ధాతా’. ఇతడు ద్వాదశ ఆదిత్యులలో ఒకడు.
శ్లో: ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే |
పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ ||
"ఓ మునీశ్వరా! సృష్టికి ఆరంభమైన చైత్ర మాసాన్ని (మధు మాసాన్ని) నడిపించే సూర్య రథంపై ఏడుగురు పరిజనులు ఉంటారు. వారు ఎవరనగా... ఆదిత్యులలో 'ధాత', ఋషులలో 'పులస్త్యుడు', రాక్షసులలో 'హేతి', నాగులలో 'వాసుకి', యక్షులలో 'రథకృత్తు', అప్సరసలలో 'కృతస్థలి', మరియు గంధర్వులలో 'తుంబురుడు'. ఈ ఏడుగురూ కలసి ఆ సూర్య రథాన్ని అధిరోహించి, చైత్ర మాసపు కాల చక్రాన్ని, వాతావరణాన్ని (వసంత ఋతువును) సక్రమంగా నడిపిస్తారు."
ఈ ఏడుగురు కేవలం పేర్లు కాదు, సృష్టిలోని ఏడు శక్తులకు ప్రతీకలు. ఆదిత్యుడు కాంతినిస్తే, ఋషి మంత్రశక్తిని ఇస్తాడు. గంధర్వులు, అప్సరసలు వసంత ఋతువుకు తగిన ఆహ్లాదాన్ని సమకూర్చగా, రాక్షసుడు, సర్పం, యక్షుడు కాలం ఆగకుండా (రథం నిర్విరామంగా నడిచేలా) తమ శక్తులను వినియోగిస్తారు. ఈ సప్తాశ్వ, సప్తక గణాల సమన్వయమే కాలగమనం.
సృష్టి కారకత్వం: "ధాత" అంటే బ్రహ్మ లేదా సృష్టికర్త (The Creator). చైత్ర మాసంతోనే వసంత ఋతువు, నూతన సంవత్సరం మొదలవుతాయి. చలి కాలంలో ఆకులు రాలిపోయిన చెట్లకు మళ్లీ ప్రాణం పోసి, లోకంలో కొత్త చిగురులను, సృష్టి కార్యానికి కావలసిన తేజస్సును ఈ మాసంలో సూర్యుడు అందిస్తాడు. కాబట్టే సృష్టికర్త అయిన "ధాత" ఈ మాసానికి అధిపతి అయ్యాడు.
ధాతా శుభస్య మే దాతా భూయో భూయోఽపి భూయసః |
రశ్మిజాలసమాశ్లిష్టః తమస్తోమవినాశనః ||
అజ్ఞానమనే చీకటిని పోగొట్టే ధాత, నాకు ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించుగాక. ధాతా అనగా బ్రహ్మ. ‘బ్రహ్మ’ అనగా జ్ఞానం. జ్ఞానం గల చోట అజ్ఞానం ఉండదు. అజ్ఞానం లేని చోట అన్నీ శుభాలే జరుగుతాయి.
ఆదిత్యుడు ధాత, రాక్షసుడు హేతి, సర్పం వాసుకి, ఋషి పులస్త్యుడు, అప్సరస కృతస్థలి, యక్షుడు రథకృత్తు, గంధర్వుడు తుంబురుడు అను ఈ ఏడుగురి సమన్వయం వలనే చైత్ర మాసంలో లోకంలో వసంత శోభ, ప్రశాంతత నెలకొంటాయి. ఈ ఏడుగురిలో ధాతా తరువాత ప్రధానమైన వాడు రథాన్ని నడిపే రాక్షసుడు: "హేతి". సూర్య రథాన్ని రాక్షసులు వెనుక నుండి ముందుకు తోస్తుంటారు. దీని వెనుక ఒక గొప్ప కాల ధర్మం ఉంది. కాలం మరియు భయం: కాలం ఎవరి కోసమూ ఆగదు, అది నిర్దాక్షిణ్యంగా ముందుకు వెళుతూనే ఉంటుంది. ఈ కాల గమనంలోని 'ఉగ్రమైన' (Fierce) లేదా నిరంతరాయమైన శక్తికి రాక్షసులు ప్రతీక. హేతి జననం: పురాణాల (రామాయణం ఉత్తరకాండ) ప్రకారం బ్రహ్మ దేవుని నుండి పుట్టిన మొట్టమొదటి రాక్షసులలో "హేతి" మరియు "ప్రహేతి" అన్నదమ్ములు. ఇందులో 'హేతి' సాక్షాత్తూ కాల పురుషుని సోదరి అయిన "భయ" ను వివాహం చేసుకున్నాడు. అంటే ‘కాలం మరియు భయం’. ఈ రెండింటి కలయికే రాక్షస తత్వం. రథాన్ని పట్టుబట్టి, ఎక్కడా ఆగకుండా ముందుకు నెట్టే బాధ్యత వీనిదే. భయాన్ని కాలానికి ప్రమాణమైన వాడిగా మాత్రమే పరిగణించే వాడు జ్ఞాని. కాలం గడిచిపోతుందనే భయం జ్ఞానుల మినహా అందరిలో ఉంటుంది. అట్టి భయాన్ని కలిగి ఉండడం అజ్ఞానం, భయం లేకపోవడం జ్ఞానం. రథాన్ని బంధించే సర్పం: "వాసుకి" నాగులు (సర్పాలు) సూర్య రథానికి పగ్గాలుగా లేదా రథాన్ని కదలకుండా పట్టి ఉంచే బంధాలుగా పనిచేస్తాయి. రథం విడిపోకుండా ఉండటానికి ఇవి చాలా ముఖ్యం. వాసుకి మహాసర్పం: కశ్యప ప్రజాపతి మరియు కద్రువ సంతానంలో వాసుకి ఒక మహా నాగు (King of Nagas). విశ్వకోశ శక్తి (Cosmic Binding): క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని తిప్పడానికి కవ్వపు తాడుగా ఉపయోగపడిన వాడు వాసుకి. అలాగే పరమశివుని కంఠాభరణంగా ఉండే వాసుకి, చైత్ర మాసంలో సూర్య రథానికి బంధంగా ఉంటాడు. ఇది మహాశక్తికి, కుండలినీ శక్తికి ప్రతీక.
అందుకే చైత్ర మాసంలో ధాతా మరియు సర్పారాధన విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ధాతా - బ్రహ్మ ఆరాధన గూర్చి మునుముందు వివరించబడింది. కాలం మనకు ప్రసాదించు భయాన్ని పోగొట్టుటకు జ్ఞాన మార్గమే అత్యంత ప్రధానమైనది. అనవసరమైన మూఢ నమ్మకాలకు పోకుండా నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ శ్రేష్ఠుడిగా ఉండడమే ఈ పరాభవ నామ సంవత్సరం ఇస్తున్న సందేశం. ‘పరాభవ’ అనే పదానికి ఓటమి అనే అర్థం మాత్రమే నిఘంటువులో లభిస్తుంది. కాని నిఘంటువుకు అతీతంగా ఆలోచిస్తూ ఇదొక గొప్ప అర్థాన్ని ఇస్తుంది. "పర (శ్రేష్ఠ) + భవ (ఉండు/అగు) = పరాభవ (శ్రేష్ఠుడవై ఉండు)". సంస్కృతంలో 'పర' అనే శబ్దానికి "ఉత్కృష్టమైన", "అత్యున్నతమైన" అనే అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు: పరమాత్మ (అత్యున్నత ఆత్మ), పరంధామం (శ్రేష్ఠమైన స్థానం), పరాశక్తి (అధిష్ఠాన శక్తి), 'భవ' అంటే 'అగుట' లేదా 'ఉండుట'. కాబట్టి, "నీవు సామాన్యుడిలా కాకుండా, పరమోత్కృష్టుడిగా (శ్రేష్ఠుడిగా) ఎదగాలి" అనే సందేశాన్ని ఈ సంవత్సరం ఇస్తుంది. "పరాభవ" అనగానే ప్రజలు భయపడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఏది తలపెట్టినా విఫలం అవుతుందేమో, లేదా తలపెట్టిన కార్యంలో పరాజయం ఉంటుందేమో అనే భయం ప్రతి ఒక్కరిలో కలగవచ్చు. కాని ‘సన్మార్గంలో పయనించండి. శ్రేష్ఠుడిగా ఉండండి మీకు ఆ భయం ఉండదని చెబుతుంది’ ఈ ‘పరాభవ’ నామ సంవత్సరం. ప్రధానంగా నేడు ప్రపంచమంతా కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. పాలకుల అహంకార ప్రవృత్తే ఈ యుద్ధానికి మరియు అనిశ్చితికి కారణమని చెప్పవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో వారు శ్రేష్ఠులు గా మారాలని ఈ సంవత్సరం చెబుతుంది. "ఇది ఓటమిని ఇచ్చే సంవత్సరం కాదు, నీలోని ఉత్తమత్వాన్ని వెలికితీసి, నిన్ను శ్రేష్ఠుడిగా నిలబెట్టే సంవత్సరం". ప్రతికూలతలో కూడా అనుకూలతను దర్శించడమే ఈ సంవత్సరం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
చైత్ర మాసంలో దైవారాధన:
చైత్ర మాసానికి అధిపతి ‘ధాతా’. ధాతా ద్వాదశ ఆదిత్యులలో ఒకడు. ‘ధాతా’ అనగా బ్రహ్మ దేవుడు. మన శాస్త్రాలను అనుసరించి బ్రహ్మ దేవుడి ఆరాధన లోకంలో లేదు. దాని ఒక ప్రధానమైన కారణం కలదు. దీనికి గల పురాణ వృత్తాంతం గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము:
కృత, త్రేతా, ద్వాపర యుగాలలో రాక్షసులు, మహర్షులు బ్రహ్మ దేవుని గూర్చి ఘోర తపస్సు చేసి వరాలు పొందారు. కానీ నేడు బ్రహ్మ దేవునికి గుడులు లేవు, ప్రత్యక్ష పూజలు లేవు. దీనికి పురాణాలలో ముఖ్యంగా రెండు శాప వృత్తాంతాలు మరియు ఒక గొప్ప తాత్విక కారణం ఉన్నాయి. వాటిని సశాస్త్రంగా ఇక్కడ వివరిస్తున్నాను:
1. బ్రహ్మ ఆరాధన లేకపోవడానికి పురాణ కారణాలు
అ) శివ పురాణ వృత్తాంతం (శివుని శాపం):
శివ పురాణం (విద్యేశ్వర సంహిత) ప్రకారం, ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చెలరేగింది. ఇద్దరూ తమను తాము అతిపెద్ద , అత్యంత శక్తివంతమైన వ్యక్తులమని చెప్పుకుంటున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, శివుడు అద్భుతమైన జ్యోతిర్లింగ రూపంలో కనిపించాడు. ఈ జ్యోతిర్లింగం ఆది మరియు అంతాన్ని ఎవరు కనుగొంటారో వారు ఉత్తములుగా, గొప్పవారిగా పరిగణించబడతారని ఆయన అన్నారు. విష్ణువు వరాహ రూపాన్ని ధరించి జ్యోతిర్లింగం చివరను కనుగొనడానికి భూమికి వెళ్ళగా, బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్యోతిర్లింగం ప్రారంభాన్ని కనుగొనడానికి ఆకాశంలోకి వెళ్ళాడు. విష్ణువు తన అశక్తతను అంగీకరించి తిరిగి రాగా, బ్రహ్మ దేవుడు మాత్రం పైనుండి రాలిపడుతున్న 'మొగలి పువ్వు' (కేతకి) తో అబద్ధం చెప్పించి, తను శివలింగం పైభాగాన్ని చూశానని అసత్యం ఆడాడు. ఆ అసత్యానికి ఆగ్రహించిన పరమశివుడు బ్రహ్మను శపిస్తాడు:
"సృష్టికర్తవైనప్పటికీ నీవు అసత్యమాడావు కాబట్టి, ఇక భూలోకంలో నీకు ఎక్కడా దేవాలయాలు ఉండవు, నీకు ప్రత్యక్ష పూజలు జరగవు." (అలాగే పూజలందు మొగలి పువ్వును నిషేధించాడు).
ఆ) పద్మ పురాణ వృత్తాంతం (సరస్వతీ దేవి శాపం):
పద్మ పురాణం (సృష్టి ఖండం) ప్రకారం, బ్రహ్మ దేవుడు 'పుష్కర' క్షేత్రంలో (రాజస్థాన్ లో ఉంటుంది) ఒక మహా యాగం తలపెట్టాడు. యాగం సమయంలో భార్య (సరస్వతీ దేవి) పక్కన ఉండాలి. కానీ ఆమె రావడానికి ఆలస్యం అవుతుండటంతో, ముహూర్తం మించిపోకూడదని బ్రహ్మ దేవుడు అక్కడున్న ఒక గోప కన్యను (గాయత్రిని) వివాహం చేసుకుని యాగం ప్రారంభించాడు. అక్కడికి చేరుకున్న సరస్వతీ దేవి అది చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది:
"ఈ పుష్కర క్షేత్రంలో తప్ప, భూమండలంపై నీకు ఎక్కడా గుడులు ఉండవు, ఉత్సవాలు జరగవు" అని శపించింది. (అందుకే నేటికీ ప్రపంచంలో బ్రహ్మ దేవునికి ఉన్న ఏకైక ప్రముఖ దేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉంది).
2. తాత్విక మరియు మానసిక కారణం
పురాణ కథల వెనుక ఉన్న అసలైన వేదాంత రహస్యం ఇది:
బ్రహ్మ తత్వం - రజో గుణం: త్రిమూర్తులలో బ్రహ్మ 'సృష్టి'కి, అనగా 'రజో గుణానికి' (కోరికలకు, ఆశలకు) ప్రతీక. సృష్టి (పుట్టుక) అనేది ఇప్పటికే జరిగిపోయింది. ఒకసారి పుట్టిన తర్వాత మానవుడికి కావలసింది జీవనం (స్థితి - విష్ణువు / సత్వ గుణం) మరియు కష్టాల నుండి ముక్తి లేదా మోక్షం (లయం - శివుడు / తమో లేదా నిర్గుణ స్థితి). కాబట్టి మానవులు సహజంగానే విష్ణు, శివ ఆరాధన వైపు మొగ్గుచూపుతారు.
కోరికల స్వభావం: అసురులు (రాక్షసులు) ఎప్పుడూ రజో గుణ ప్రధానులు. అందుకే వారు నిరంతరం కొత్త శక్తులు, అమరత్వం కావాలని బ్రహ్మను ఆరాధించారు. కలియుగంలో మనిషి కోరికలు తీరి, మనశ్శాంతి కలగాలంటే కోరికలను పుట్టించే బ్రహ్మను కాదు, కోరికలను నియంత్రించే విష్ణు/శివులను ఆరాధించడమే తరుణోపాయం అని ఋషులు ఈ మార్గాన్ని తీసుకువచ్చారు.
3. పరోక్షంగా బ్రహ్మను ఆరాధించే పద్ధతులు:
బ్రహ్మకు ప్రత్యక్షంగా గుడులు లేకపోయినా, హైందవ నిత్య కర్మానుష్ఠానము లందు ప్రతిరోజూ బ్రహ్మ దేవుని ఆరాధన అంతర్భాగంగానే ఉంటుంది.
సంధ్యావందనం (ఉదయ సంధ్య): బ్రాహ్మణులు నిత్యం చేసే త్రికాల సంధ్యావందనంలో, ప్రాతఃకాల (ఉదయ) సంధ్యా దేవత సాక్షాత్తూ బ్రహ్మ స్వరూపిణి అయిన గాయత్రీ దేవి.
"బ్రహ్మ శిరః, విష్ణుర్ హృదయగ్౦, రుద్ర శిఖాః” అనగా గాయత్రి ఆరాధన త్రిమూర్తుల ఆరాధనతో సమానమైనది. ఒక్క గాయత్రిని అనుష్టిస్తే, త్రిమూర్తుల అనుష్ఠాన ఫలం లభిస్తుంది. అందుకే ద్విజులు విధిగా సంధ్యావందన, గాయత్రి జపాన్ని ఆచరించాలి. ఉదయం చేసే అర్ఘ్యప్రదానం బ్రహ్మ దేవునికి చెందుతుంది.
బ్రహ్మ యజ్ఞం: ప్రతి గృహస్తు రోజూ చేయవలసిన పఞ్చ మహా యజ్ఞాలలో 'బ్రహ్మ యజ్ఞం' ఒకటి. దీని అర్థం ప్రతిరోజూ వేద మన్త్రాలను పఠించడం (వేదాధ్యయనం). వేదమే బ్రహ్మ. కాబట్టి వేదాన్ని చదవడమే బ్రహ్మను పూజించడం. వేద పఠనం అలవాటు లేని వాళ్ళు వేద మంత్రాలు విన్నా సరిపోతుంది.
యజ్ఞ యాగాదులలో 'బ్రహ్మ' స్థానం: ఏ చిన్న హోమం (గణపతి హోమం, చండీ హోమం) చేసినా, అందులో నలుగురు రుత్విక్కులు ఉండాలి. అందులో అధ్వర్యుడు, హోత, ఉద్గాత తో పాటు యజ్ఞాన్ని పర్యవేక్షించే ప్రధానమైన స్థానం "బ్రహ్మ" ది. బ్రహ్మ స్థానంలో ఒక పండితుడిని కూర్చోబెట్టకుండా (లేదా దర్భలతో బ్రహ్మను ఆవాహన చేయకుండా) ఏ యజ్ఞమూ పూర్తికాదు. బ్రహ్మ స్థానంలో కూర్చొనే అర్హత గల వేద పండితుల ఆశిస్సులు పొందడం అత్యంత ప్రధానమైనది. అది బ్రహ్మ ఆశిస్సులతో సమానమైనది.
గురు పూజ: ప్రతిరోజూ మనం చదివే "గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః..." శ్లోకం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని 'సృష్టించే' గురువును బ్రహ్మ రూపంగానే భావించి పూజించడం అనాదిగా వస్తున్నా ఆచారం. కావున గురు పూజ మరియు గురువు గారి శుశ్రూష అత్యంత ప్రధానమైనది.
అరుణ ప్రశ్న (సూర్యారాధన): చైత్రం కాలానికి ఆరంభం. కాల స్వరూపుడైన సూర్యుని ఆరాధించడానికి తైత్తిరీయారణ్య అంతర్గత 'అరుణ ప్రశ్న లేదా అరుణం' సాక్షాత్తూ వేద మంత్ర స్వరూపం. వసంత ఋతువులో సూర్య కిరణాల ద్వారా లోకానికి అందే ప్రాణశక్తిని ఇది స్పష్టం చేస్తుంది. ప్రధానంగా చైత్ర మాసంలో మేష సంక్రమణం జరుగుతుంది. అటుపిమ్మట ఎండలు తీవ్ర రూపాన్ని దాలుస్తాయి. మేషం ఆయనకు ఉచ్ఛ స్థానమగుట వలన వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వడగాలులు ప్రారంభమౌతాయి.
తైత్తిరీయ ఉపనిషత్తులో భాగమైన శీక్షావల్లి, బ్రహ్మానంద వల్లి మరియు భృగు వల్లీ నిత్యం పారాయణం చేయాలి. కనీసం వినాలి. తద్వారా నూతన సంవత్సరం ఆరంభంలో మనిషి తన జీవన విధానాన్ని ఎలా మలచుకోవాలో, "సత్యం వద, ధర్మం చర" అంటూ ప్రాథమిక ధర్మాలు బోధపడతాయి. జీవుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలను దాటి ఆనందమయ కోశాన్ని ఎలా చేరుకోవాలో, సృష్టి రహస్యాన్ని బ్రహ్మానంద వల్లీ వివరిస్తుంది. భృగువల్లీ: "అన్నాద్భవంతి భూతాని..." అంటూ ప్రాణుల ఉత్పత్తిని, తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందే విధానాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. వేద పఠనం చేయగలవారు నిత్యం పారాయణం చేయడం, లేని వారు కనీసం శ్రవణం చేయడం అత్యంత ప్రధానము. ఇదే బ్రహ్మోపాసన. ఈ వేద పఠనం మరియు శ్రవణం మానవునికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసి ముక్తి వైపు నడిపిస్తాయి. చైత్ర మాసంలో (వసంత ఋతువులో) ప్రకృతి ఎలాగైతే కొత్తగా వికసిస్తుందో, ఈ బ్రహ్మోపాసన వల్ల మనిషి అంతఃకరణ కూడా అలాగే వికసిస్తుంది.
"యేఽన్నం బ్రహ్మోపాసతే", "యే ప్రాణం బ్రహ్మోపాసతే" అనే మన్త్ర ప్రమాణం అన్నం ద్వారా ప్రాణం ఉద్భవిస్తుందని, అట్టి అన్నం బ్రహ్మోపాసనలో భాగమని స్పష్టంగా తెలియు చున్నది. స్థూలమైన అన్నం నుండి సూక్ష్మమైన జీవశక్తి (ప్రాణమయ కోశం) వైపు చేసే ప్రయాణం ఇది. జడమైన శరీరానికి కదలికనిచ్చేది ప్రాణం. శ్వాస ద్వారా లోపలికి వెళ్ళే ప్రాణ వాయువులో పరమాత్మను దర్శించడం. ఎవరైతే తమ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ, "ఈ ప్రాణమే బ్రహ్మం" అని ఉపాసిస్తారో (ప్రాణాయామం/శ్వాస మీద ధ్యాస), వారు అపమృత్యువును జయించి, వేదాలు నిర్దేశించిన 'సంపూర్ణ ఆయుస్సును' పొందుతారని ఈ మంత్రం గట్టిగా ఉద్ఘాటిస్తోంది.
చైత్ర మాసంలో అన్నదాన విశిష్టత:
"అదాన దోషేణ భవేద్దరిద్రో, దారిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రే పునరేపి పాపిః” దాన ధర్మాలు ఆచరించక పోవడం ఒక దోషం. ఇట్టి దోష ప్రభావం వలన వాడు దరిద్రుడై పుడతాడు. దరిద్రుడు పాప కర్మలను ఆచరిస్తాడు. అట్టి వాడు నరకానికి వెళ్లి పునః దరిద్రుడిగా జన్మిస్తాడు. ఇదొక విష వలయం. ఈ విషవలయాన్ని ఛేదించే ఏకైక అస్త్రం "అన్నదానం".
అన్నదానం ఎప్పుడు చేయాలి? దానికి చైత్ర మాసంలో ఉన్న విశేషం ఏమిటి?
1. అన్నదానం ఎప్పుడు చేయాలి? నిజానికి "ఆకలితో ఉన్నవాడు ఎదురుగా వచ్చినప్పుడు లేదా అడిగినప్పుడు" అన్నం పెట్టడమే సరైన సమయం. దీనికి తిథి, వార, నక్షత్రాలు చూడవలసిన పనిలేదు. అయినప్పటికీ, ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పుణ్యకాలాలలో చేసిన దానం అనంతమైన ఫలాన్ని (అక్షయ ఫలాన్ని) ఇస్తుంది. గ్రహణ కాలాలలో (సూర్య, చంద్ర గ్రహణాలు), సంక్రమణ పుణ్యకాలాలలో (మకర సంక్రాంతి, మేష సంక్రాంతి తదితర. మేష సంక్రాంతి చైత్ర మాసంలో వస్తుంది). పర్వ దినాలలో (అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి). పితృ కార్యాలలో (మహాలయ పక్షాలు, తద్దినాలు).
2. చైత్ర మాసంలో అన్నదాన విశిష్టత. మిగిలిన మాసాల కంటే చైత్ర మాసంలో అన్నదానం (మరియు జలదానం) ఎందుకు విశేషమైనదో మన శాస్త్రాలు స్పష్టంగా చెప్పాయి:
సృష్ట్యాది మరియు నవ ధాన్యాలు:
చైత్ర మాసంతో సృష్టి (కొత్త సంవత్సరం) ప్రారంభమవుతుంది. వసంత ఋతువు రాకతో పొలాల్లో కొత్త పంటలు (నవ ధాన్యాలు) చేతికి వచ్చే సమయం ఇది. ప్రకృతి ప్రసాదించిన ఆ కొత్త ధాన్యాన్ని ముందుగా పదిమంది ఆకలి తీర్చడానికి (అన్నదానానికి) ఉపయోగించి, ఆ తర్వాతే మనం స్వీకరించడం సనాతన ధర్మం. ఇది సాక్షాత్తూ బ్రహ్మ ప్రీతికరం.
ఎండల తీవ్రత - ప్రపా దానం (చలివేంద్రాలు):
చైత్ర మాసంలో ఎండల తీవ్రత పెరుగుతుంది. బాటసారులకు, కష్టపడి పనిచేసే శ్రామికులకు ప్రాణశక్తి నిలబడాలంటే అన్నంతో పాటు జలదానం చాలా ముఖ్యం.
పానీయం పరమం దానం దానానాముత్తమోత్తమమ్ |
చైత్రే మాసి ప్రదాతవ్యమ్ పితౄణాం తృప్తిహేతవే || (స్కంద పురాణం)
దానాలన్నింటిలో జలదానం, అన్నదానం ఉత్తమోత్తమమైనవి. ముఖ్యంగా చైత్ర మాసంలో వీటిని దానం చేయడం వల్ల పితృదేవతలు కూడా అపారమైన తృప్తిని చెందుతారు.
ఇ) చిత్రా పౌర్ణమి - పాప విముక్తి:
"జన్మాంతర కృత పాప కర్మ ఫలాల నుండి విముక్తి" పొందడానికి చైత్ర మాసంలో వచ్చే చిత్రా పౌర్ణమి (చైత్ర పౌర్ణమి) అత్యంత కీలకమైన రోజు. ప్రాణుల పాపపుణ్యాల లెక్కలు రాసే చిత్రగుప్తుని, యమధర్మరాజుని ఉద్దేశించి ఈ రోజు అన్నదానం, జలదానం చేస్తారు.
చైత్రీ పౌర్ణమాసీ చిత్రా నక్షత్ర యుతా చేత్ తస్యాం చిత్రగుప్త ప్రీతయే ఉదకుంభ దానం, వస్త్ర దానం, అన్నదానం చ కుర్యాత్ | (ధర్మసింధువు)
చైత్ర పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం ఉన్నప్పుడు చిత్రగుప్తుని ప్రీతి కొరకు జలంతో నిండిన కుండను (ఉదకుంభం), వస్త్రాలను, అన్నాన్ని దానం చేయాలి. దీని వలన నరక బాధలు, దారిద్ర్య దోషాలు నశిస్తాయి.
కాబట్టి, ప్రాణానికి ఆధారమైన అన్నాన్ని, ముఖ్యంగా వాతావరణం వేడెక్కే చైత్ర మాసంలో దానం చేయడం సకల దోషహరమని శాస్త్ర వచనం.
అంతేకాదు, చైత్ర మాసంలో శ్రీ దేవీ ఆరాధనలు, శ్రీ రామ ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.
చైత్ర మాస ఆరోగ్య నియమాలు (ఆయుర్వేద వసంత ఋతుచర్య):
(ఆయుర్వేద విజ్ఞానం డా శ్రీమతి మాధవిలత రుద్రవరం గారి సహకారంతో)
చైత్ర మాసంతో 'వసంత ఋతువు' ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీరంలో జరిగే క్రియలను ఆయుర్వేద మూల గ్రంథమైన 'అష్టాంగ హృదయం' (సూత్రస్థానం - 3వ అధ్యాయం, ఋతుచర్య) అత్యంత శాస్త్రీయంగా వివరించింది.
శ్లోకం:
కఫో హి శిశిరే సంచితో రవితేజసా |
వసంతే ప్రవిలయనాన్ కోష్ఠాగ్నిం బాధతే తతః ||
రోగాన్ ప్రకృతి కఫజాన్ తస్మాద్ వసంతే వమనాదిభిః |
అర్థం మరియు విశ్లేషణ:
శిశిర ఋతువులో (చలికాలంలో) దేహంలో పేరుకుపోయిన 'కఫం', వసంత ఋతువులో (చైత్రంలో) సూర్యుని వేడికి కరిగి దేహమంతటా వ్యాపిస్తుంది. ఆ కరిగిన కఫం 'కోష్ఠాగ్నిని' (జఠరాగ్నిని / జీర్ణశక్తిని) మందగింప జేస్తుంది. దీనివల్ల జలుబు, దగ్గు, అజీర్ణం, అలర్జీలు (కఫ సంబంధ రోగాలు) వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Diet and Lifestyle):
కోష్ఠాగ్నిని రక్షించుకోవడానికి మరియు కఫాన్ని కరిగించడానికి ఈ క్రింది నియమాలు పాటించాలి:
1. ఆహార నియంత్రణ: జీర్ణశక్తి మందగిస్తుంది కాబట్టి, భారీ భోజనం చేయకూడదు. ఎక్కువ తీపి, పులుపు, ఉప్పు, గురు ఆహారం, పెరుగు, చల్లని పదార్థాలు మరియు జిడ్డు (Oily) పదార్థాలు కఫాన్ని మరింత పెంచుతాయి కాబట్టి వాటిని ఖచ్చితంగా తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. క్రమశిక్షణతో కూడిన మితాహారం ఈ మాసంలో అసలైన ఔషధం. ఈ కాలంలో తినాల్సినవి: లఘు (light food). కటు (pungent) - మిరియాలు, ఆవాలు, అల్లం, శొంఠి (Shunti), వెల్లుల్లి, వాము, ముల్లంగి, పచ్చిమిర్చి, లవంగాలు etc., తిక్త (bitter) - కాకర, మునగ, బచ్చలి, పాలకూర, మెంతులు, అమృతవల్లి తిప్పతీగ...etc., కషాయ (astringent) రసం - దానిమ్మ, పచ్చి అరటి, ఆమ్లా, ఆపిల్, నల్లద్రాక్ష, క్యాబేజీ Cabbage, Broccoli, Carrot, శనగలు, తేనే, కుంకుమ పువ్వు, గ్రీన్టీ (Green Tea) etc. ఉదాహరణలు: యవ (barley), గోధుమలు, తేలికపాటి సూపులు, పచ్చి కూరగాయలు.
2. నింబ కుసుమ భక్షణం (వేప పూవు): ఉగాది రోజున వేప పువ్వును (బెల్లం, చింతపండుతో) సేవించడం ఆయుర్వేద విధానం. వేపలోని చేదు కఫాన్ని, పిత్తాన్ని హరించి కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది.
వ్యాయామం: ఆయుర్వేదం వసంత ఋతువులో 'వ్యాయామం' చేయాలని స్పష్టంగా చెబుతోంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేసే 4-5 కిలోమీటర్ల నడక (Walking) లాంటి అభ్యాసాలు దేహంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి, జీర్ణశక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. యోగా, ప్రాణాయామం చేయాలి. కఫాన్ని తగ్గించడానికి స్వేదనం (sweating) వచ్చేంత వరకు మోస్తరు వ్యాయామం మంచిది.
తేనె వాడకం: ఉదయం పూట గోరువెచ్చని నీటిలో లేదా బార్లీ నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగడం (మధు సేవనం) వసంత ఋతువులో ఉత్తమమైన మార్గంగా ఆయుర్వేద గ్రంథాలు సూచిస్తున్నాయి. ఆయుర్వేద మూలికలు లేదా లేహ్యాలు వాడేవారికి ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లైట్ హెర్బల్ డ్రింక్స్.
5. బ్రాహ్మి ముహూర్తం లో నిద్ర లేవాలి( స్వస్తులు)
6. ఉద్వర్తనం (Udvartana). పౌడర్ మసాజ్(Triphala, Vacha, Kulatha, Barley powders...etc.,) చేయడం మంచిది. ఇది కఫం, మెదస్సు (Fat) తగ్గించడంలో సహాయపడుతుంది.
7. స్నానం. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.
8. నిద్ర పగటి నిద్ర (day sleep) చేయకూడదు. ఇది కఫాన్ని ఇంకా పెంచుతుంది. చైత్ర మాసంలో కఫం ఎక్కువ అవుతుంది, కాబట్టి లైట్ డైట్ అనగా తేలికగా జీర్ణమగు ఆహరం, వ్యాయామం, ఉద్వర్తనం, పగటి నిద్ర లేకుండా ఉండటం ఆయుర్వేద జీవన విధానం.
9. పంచకర్మ లో భాగంగా వమన కర్మ శ్రేష్ఠం. నస్యం గండూశం దినచర్యగా పాటించాలి (ఇవి ఆయుర్వేద వైద్య నిపుణుల సలహా మేరకు చేయాలి)
ఈ విధంగా చైత్ర మాసం దైవికంగా జగన్మాత ఆరాధనకు, భౌతికంగా దేహ శుద్ధికి (కఫ హరణానికి) అత్యంత ముఖ్యమైనది.
బార్లీ నీరు (Barley Water) సహజమైన, ఆరోగ్యకరమైన పానీయం. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంచుతుంది, బరువు తగ్గడానికి (Weight Loss) సహాయపడుతుంది మరియు అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది.
బార్లీ నీళ్ళతో కలిగే ముఖ్య ప్రయోజనాలు:
జీర్ణక్రియ మరియు బరువు నియంత్రణ: బార్లీలో ఉండే పీచు పదార్థం (Fiber) మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మూత్రపిండాల ఆరోగ్యం (UTI నివారణ): ఇది సహజమైన మూత్ర విసర్జనకారి (Diuretic) గా పనిచేస్తుంది. మూత్రపిండాల నుండి విష పదార్థాలను (Toxins) బయటకు పంపి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను (UTI) తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యం & కొలెస్ట్రాల్ తగ్గుదల: బార్లీలోని బీటా-గ్లూకాన్ (Beta-glucan) చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
మధుమేహం (Diabetes) నియంత్రణ: బార్లీ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
శరీర వేడిని తగ్గిస్తుంది & హైడ్రేషన్: వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి మరియు ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడటానికి ఇది ఒక అద్భుతమైన పానీయం.
చర్మ సౌందర్యం: శరీరాన్ని డీటాక్స్ (Detox) చేయడం ద్వారా, మచ్చలు లేని, కాంతివంతమైన చర్మం పొందడానికి సహాయపడుతుంది.
బార్లీ నీరు తయారుచేసే విధానం:
ఒక కప్పు బార్లీ గింజలను కడిగి, 3-4 కప్పుల నీటిలో 20-30 నిమిషాలు ఉడికించాలి. ఈ నీటిని వడకట్టి, చల్లారిన తర్వాత నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకుని తాగవచ్చు
చైత్ర మాస పర్వదినాలు - శాస్త్ర ప్రమాణాలు
అ) యుగాది (చైత్ర శుద్ధ పాడ్యమి)
సృష్టి ఆరంభమైన దినం ఇది. కాలగణన ఇక్కడి నుండే మొదలవుతుంది.
"చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేఽహని |
శుక్ల పక్షే సమగ్రం తు తదా సూర్యోదయే సతి ||" (హేమాద్రి / చతుర్వర్గ చింతామణి)
బ్రహ్మ దేవుడు చైత్ర మాస శుక్ల పక్ష ప్రథమ దినాన (పాడ్యమి నాడు), సూర్యోదయ సమయంలో ఈ సమస్త జగత్తును సృష్టించడం ప్రారంభించాడు.
విశిష్టత: మేదిని జ్యోతిషం ప్రకారం, ఈ రోజే సంవత్సర "రాజు" ఎవరో నిర్ణయించబడి, జగత్తుకు భవిష్యవాణి అయిన 'పంచాంగ శ్రవణం' చెప్పబడుతుంది. ఋతు మార్పు వల్ల శరీరంలో వచ్చే కఫ దోషాలను అరికట్టడానికి ఆయుర్వేద శాస్త్రోక్తంగా నింబ కుసుమ భక్షణం (వేప పువ్వుతో ఉగాది పచ్చడి) సేవించడం ఈనాటి ధర్మం.
ఆ) వసంత నవరాత్రులు (చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు)
"వసంతే చైవ శరది నవరాత్రత్రయం స్మృతమ్ |" (దేవీ భాగవతం)
శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులతో సమానంగా, వసంత ఋతువులో వచ్చే ఈ తొమ్మిది రోజులు జగన్మాత ఆరాధనకు (వసంత నవరాత్రులు) అత్యంత విశిష్టమైనవి.
ఇ) శ్రీరామ నవమి (చైత్ర శుద్ధ నవమి)
సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు ధర్మ సంస్థాపన కోసం రామావతారం ఎత్తిన పుణ్య దినం. జ్యోతిష శాస్త్రజ్ఞులకు ఈ జనన కాల గ్రహస్థితి ఒక అద్భుతం.
ప్రమాణం: "తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ ||
నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్ఛసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ||"
(వాల్మీకి రామాయణం, బాలకాండ, 18.8-9)
పుత్రకామేష్టి యజ్ఞం పూర్తయిన ఆరు ఋతువుల తర్వాత, చైత్ర మాసం శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రంలో (అదితి దేవత), ఐదు గ్రహాలు (సూర్య, కుజ, గురు, శుక్ర, శని) ఉచ్ఛ స్థితిలో ఉండగా, కర్కాటక లగ్నంలో గురు చంద్రులు కలిసి ఉండగా (గజకేసరి యోగం) శ్రీరాముడు జన్మించాడు.
ఈ) మదన లేదా అనంగ త్రయోదశి / కామదహనం (చైత్ర శుద్ధ త్రయోదశి)
పరమశివుడు తన తపోభంగానికి కారణమైన మన్మథుడిని ఫాల్గుణంలో దహించి, తిరిగి రతీదేవి ప్రార్థన మేరకు చైత్ర శుద్ధ త్రయోదశి నాడు 'అనంగుడిగా' (శరీరం లేనివాడిగా) బతికించిన రోజు. అందుకే దీన్ని అనంగ త్రయోదశి అని అంటారు. ఈ రోజున శివారాధన, దమనకోత్సవం (దమనం అనే సుగంధ పత్రంతో పూజ) చేస్తారు.
ఉ) చైత్ర పౌర్ణమి / చిత్రా పౌర్ణమి
"చైత్రీ పౌర్ణమాసీ చిత్రా నక్షత్ర యుతా చేత్... ఉదకుంభ ప్రదానం కార్యం" (ధర్మసింధువు)
పౌర్ణమి చిత్రా నక్షత్రంతో కలిసిన ఈ రోజున యమధర్మరాజు ఆస్థానంలో పాపపుణ్యాల లెక్కలు రాసే 'చిత్రగుప్తుని' పూజించాలి. ఎండలు ముదురుతాయి కాబట్టి జలదానం (చలివేంద్రాలు), ఉదకుంభ దానం, ఛత్ర దానం (గొడుగు దానం) చేయడం ఈనాటి ధర్మం. మరిన్ని వివరాలు పైన ఇవ్వబడినాయి.
చైత్ర మాసంలో త్యజించ వలసినవి
శాస్త్ర ప్రకారం కొన్ని మాసాలలో కొన్ని పనులు నిషిద్ధం. చైత్ర మాసంలో చెట్లు పాత ఆకులు రాల్చి కొత్త చిగురులు వేసే 'మధు' కాలం కాబట్టి, గృహ నిర్మాణ ఆరంభాలకు (శంకుస్థాపనలకు) చైత్రం పనికిరాదని వాస్తు శాస్త్ర ప్రమాణం. అనగా చెట్లు చిగురించే సమయంలో వాటిని నరకడం, భూమిని తవ్వడం ఇత్యాది పనులను నిషేధించారు. అది అమంగళం అని శాస్త్రాలు అంటాయి. చెట్లు నరకనిదే, భూమి తవ్వినదే గృహ నిర్మాణం సాధ్యపడదు కదా! అందుకే:
"చైత్రే శోకప్రదం ప్రోక్తం వైశాఖే ధనలాభదమ్ |" (వాస్తు రాజవల్లభం)
అంటే చైత్ర మాసంలో గృహారంభం చేస్తే శోకం కలుగుతుంది అని శాస్త్ర వచనం. (అయితే, చైత్రంలో ఉపనయనం, వివాహం లాంటివి చేయవచ్చు).
"ముహూర్త చింతామణి" మరియు "వాస్తు రాజవల్లభం" వంటి గ్రంథాలలో చెప్పినట్లుగా "చైత్రే వ్యాధిమవాప్నోతి..." (చైత్రంలో గృహప్రవేశం వల్ల రోగభయం, శోకం కలుగుతాయి). అలాగే ధన నాశనం, చోర భయం (దొంగల భయం) కూడా కలుగుతాయని ముహూర్త దర్పణం స్పష్టం చేస్తోంది.
చైత్ర మాసంలో దైవారాధన మరియు ఆరోగ్య నియమాలు (ఋతుచర్య):
1. చైత్ర మాస దైవారాధన - శ్రీమాత మరియు శ్రీరామ
చైత్ర మాసంలో దేవీ ఆరాధన (జగన్మాత) మరియు శ్రీమహావిష్ణువు (శ్రీరాముని రూపంలో) ఆరాధన అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తాయి.
అ) వసంత నవరాత్రులు (దేవీ ఆరాధన):
సృష్టి ఆరంభ మాసం కావడంతో సృష్టికి మూలమైన పరాశక్తిని ఆరాధించడానికి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు అత్యంత పవిత్రమైన రోజులు. దీనికి దేవీ భాగవతం (3వ స్కంధం, 30వ అధ్యాయం) ప్రమాణం:
శ్లోకం:
వసంతే చైవ శరది నవరాత్రత్రయం స్మృతమ్ |
తస్మాన్ నవరాత్రం తు కర్తవ్యం భక్తిభావతః ||
వసంత ఋతువులో (చైత్ర మాసం) మరియు శరదృతువులో (ఆశ్వయుజ మాసం) వచ్చే నవరాత్రులు పూజకు అత్యంత శ్రేష్ఠమైనవి. కాబట్టి ఈ చైత్ర నవరాత్రులలో దేవిని భక్తి భావంతో పూజించాలి. సర్వ రోగ నివారణ, శత్రు జయం దీని విశిష్టత.
ఆ) శ్రీరామ ఆరాధన:
చైత్ర మాసం సాక్షాత్తూ శ్రీరాముడు జన్మించిన మాసం. చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ ఆరాధన, శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక పారాయణం సకల అరిష్టాలను తొలగిస్తుంది.
"చైత్ర శుద్ధ నవమ్యాం తు జాతో రామః స్వయం హరిః..." (అగస్త్య సంహిత)
ఇట్టి చైత్ర మాసం అందరికీ శుభాలు కలుగజేయాలని, అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని జగన్మాతను మరియు శివకేశవులను ప్రార్థిస్తూ –
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః ।
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।
నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి