అన్త్యే స్మరన్

శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శుభ గ్రహ

 ‘అన్త్యే స్మరన్’

‘అన్త్యే స్మరన్’ అనగా అన్త్యకాలం లో భగవానుడి స్మరణ చేసిన చాలు అట్టి సాధకుడు మోక్షానికి అర్హుడు. ఈ నానుడి మనం నిత్య జీవితంలో కూడా వింటూ ఉంటాము. వయసు మీరిన పిమ్మట మరియు అన్త్యకాలం ఆసన్నమైన నాడు భగవన్నామ స్మరణ చేసుకోవాలి అని మన పెద్దలు సూచిస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సాధ్యమో భగవద్గీత లోని ఈ శ్లోకం ద్వారా గ్రహించే ప్రయత్నం చేద్దాము.

ఏషా బ్రాహ్మీస్థితిః పార్థ నైనం ప్రాప్య విముహ్యతి |
స్థిత్వాఽస్యా మన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ||2.72||           -119-
ఓ అర్జునా! ఇది అంతా కూడాను బ్రహ్మ సంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందిన వాడు మరల ఏనాటికి కూడా విమోహమును చెందడు. అంత్య కాలమందు కూడా ఇట్టి స్థితి యందున్న వాడు బ్రహ్మానంద స్థితి యగు నిర్వాణమును - మోక్షమును పొందు చున్నాడు.

ఇట్టి శ్లోకంలో భగవానుడు అన్త్యకాలం భగవన్నామస్మరణలో గల వాడు, బ్రాహ్మీ స్థితి యందు గల వాడు మోక్షమును పొందు చున్నాడని సూచించు చున్నాడు. ఇట్టి శ్లోకానికి శంకర భగవత్పాదుల వారు క్రింది విధంగా భాష్యం వ్రాసారు:

ఏషా బ్రాహ్మీ ఇతి || ఏషా యథోక్తా బ్రాహ్మీ బ్రహ్మణి భవా ఇయం స్థితిః సర్వం కర్మ సంన్యస్య బ్రహ్మస్వరూపేణ ఏవ అవస్థానం ఇత్యేతత్ | హే పార్థ! న ఏనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా విముహ్యతి మొహం ప్రాప్నోతి | స్థిత్వా అస్యాం స్థితౌ బ్రాహ్మ్యాం యథోక్తాయాం అన్తకాలేఽపి అన్త్యే వయస్యపి బ్రహ్మనిర్వాణం బ్రహ్మనిర్వృతిం మోక్షమ్ ఋచ్ఛతి గచ్ఛతి | కిము వక్తవ్యం బ్రహ్మచర్యాత్ ఏవ సంన్యస్య యావజ్జీవం యః బ్రాహ్మణి ఏవ అవతిష్ఠతే సః బ్రహ్మనిర్వాణం ఋచ్ఛతి ఇతి ?

‘ఏషా యథోక్తా బ్రాహ్మీ బ్రహ్మణి భవా’ ఈ విధంగా జనియించిన బ్రహ్మ సంబంధమైన స్థితిని ‘బ్రాహ్మీ’ స్థితి అని అంటారు. ‘ఇయం స్థితిః సర్వం కర్మ సంన్యస్య బ్రహ్మస్వరూపేణ ఏవ అవస్థానం ఇత్యేతత్’ సర్వ కర్మలను త్యజించిన పిమ్మట పొందిన ఈ స్థితియే బ్రాహ్మీ స్థితి. ఓ అర్జునా! ‘ఏనాం స్థితిం ప్రాప్య లబ్ధ్వా విముహ్యతి’ ఇట్టి స్థితిని పొందిన మనుజుడు (ఎట్టి స్థితి?), అనగా అన్నిటినీ వదులుకున్న వాడికి ‘న మొహం ప్రాప్నోతి’ ఏఒక్క దానిపైన కూడా మొహం ఉండదు. ‘స్థిత్వా అస్యాం స్థితౌ’ ఇట్టి స్థితియందు స్థిరముగా ఉన్న వాడు, స్థిరమైన బ్రహ్మజ్ఞానమును పొందిన వాడు, ‘అన్తకాలేఽపి అన్త్యే వయస్యపి బ్రహ్మనిర్వాణం బ్రహ్మనిర్వృతిం మోక్షమ్ ఋచ్ఛతి గచ్ఛతి’ అన్త్యకాలమున, జీవి యొక్క చివరి క్షణంలో బ్రహ్మత్వాన్ని మరియు మోక్షాన్ని పొందు చున్నాడు. సందేహము: ‘కిము వక్తవ్యం బ్రహ్మచర్యాత్ ఏవ సంన్యస్య యావజ్జీవం యః బ్రాహ్మణి ఏవ అవతిష్ఠతే సః బ్రహ్మనిర్వాణం ఋచ్ఛతి ఇతి?’ బ్రహ్మచర్యమును ఆచరించు వారు, వారి బ్రహ్మచర్య ప్రారంభదశ మొదలు అన్త్యకాలము వరకు కూడా కర్మ సన్యాసమును ఆచరించుట ద్వారా వారి జ్ఞానము బ్రహ్మ యందే ప్రతిష్టించ బడి ఉన్నది; ఇట్టి వారు అన్త్యకాలమున ‘బ్రహ్మనిర్వాణం’ బ్రహ్మ నిర్వాణమును లేదా మోక్షమును పొందు చున్నారు కదా? (పైన తెలిపిన భాష్యానికి ఇతి ప్రతిపదార్థం కాదని గ్రహించ గలరు. అట్టి భాష్యంలోని భావాన్ని మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసాను)

భాష్యం టీకా:
మనుజుడు స్థితప్రజ్ఞుడై ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ, తద్వారా పొందిన ఫలాన్ని ఈశ్వరార్పణం చేస్తూ స్థిరమైన బ్రహ్మజ్ఞానమును పొందు చున్నాడు, ఇట్టి స్థిరమైన జ్ఞాన ప్రతిష్ఠ పొందిన వారు, వారి అన్త్యకాలమున బ్రహ్మత్వాన్ని పొందు చున్నారు, అనగా మోక్షాన్ని పొందు చున్నారు. కాని బ్రహ్మచర్య దీక్షలో వారి పిన్న వయస్సు మొదలు, బ్రహ్మచర్యమును స్వీకరించి జ్ఞాన మార్గాన్ని మాత్రమే తమ జీవిత ధ్యేయంగా ఎన్నుకొని బ్రహ్మజ్ఞానమును పొందు చున్నారు. ఇట్టి బ్రహ్మ జ్ఞానమును పొందుట వలన వారు అన్త్యకాలము నందు మోక్షాన్ని పొందు చున్నారు. వారు నిత్యకర్మలను, నైమిత్తిక కర్మలను ఆచరించుట లేదు. మరియు వారికి ఇట్టి కర్మలందు మోహము ఏమాత్రం లేదు. కర్మాచరణ లేకపోవడం వలన ఫలం అనే ప్రసక్తే లేదు. ఇట్టి వారు జ్ఞానులు; మరియు వీరు బ్రహ్మజ్ఞాన ప్రతిష్ఠ జరిగిన వారు. వారిలో స్థిరమైన జ్ఞానం ఉంటుంది. వీరు అన్త్యకాలమున బ్రహ్మ నిర్వాణము నకు అర్హులు. మరియు కర్మాచరణ లేకుండానే వీరు నేరుగా మోక్షాన్ని పొందు చున్నారు. ఇందులో మనం గ్రహించాల్సిన సూక్ష్మం ఒకటి ఉంది. ఆది శంకరులు ‘బ్రహ్మచర్య’ దీక్ష యొక్క ప్రస్తావన చేసారు. బ్రహ్మచర్యము శరీరము లేదా దేహానికి చెందినది కాదు. వాడి జీవన విధానంలో బ్రహ్మచర్యము నిక్షిప్తమై ఉండాలి. అనగా వాడి ఆలోచన, మనస్సు ముందుగా కఠోరమైన బ్రహ్మచర్య కు అలవాటుపడి ఉండాలి. పేరుకు మాత్రమే బ్రహ్మచర్య దీక్ష కారాదు. అనగా బ్రహ్మచర్య దీక్ష ప్రదర్శించేది కాదు. ఇది అగోచరమైనది. అనగా బ్రహ్మచారి యొక్క ఆలోచన, మనస్సు ముందుగా సంస్కరించ బడాలి. బ్రహ్మచర్య నియమాలు అత్యంత కఠోరంగా ఉంటాయి. ఉపనయనంలో వటువుకు బ్రహ్మచర్యము మరియు బ్రహ్మచర్య దీక్షకు చెందిన నియమాలను బోధిస్తారు. వేదకాలంలో ఇట్టి నియమాలకు గుర్తింపు ఉండేది. మరియు అట్టి వటువులు కఠోరమైన బ్రహ్మచర్యమును ఆచరించే వారు. కాని ఈ రోజుల్లో ‘ఉపనయనము – బ్రహ్మోపదేశము’ ఒక వేడుక గా మారిపోయింది. సన్యాస దీక్షలో ఉండే వారు కూడా కఠోరమైన బ్రహ్మచర్యమును ఆచరించ వలసి ఉంటుంది. కాని ఎంతమంది సన్యాస దీక్ష తీసుకున్న వారు ఇట్టి కఠోరమైన బ్రహ్మచర్యమును ఆచరించు చున్నారనేది ఒక గొప్ప ప్రశ్న. ఇట్టి బ్రహ్మచర్యము నకు చెందిన నియమాలను కఠోరమైన దీక్షతో మరియు క్రమశిక్షణతో ఆచరించు వాడే ‘బ్రహ్మచారి’ అట్టి స్థితిని చేరిన వాడే నిజమైన బ్రహ్మచారి. అట్టి వారు మాత్రమే బ్రహ్మజ్ఞాన సాధన చేయగలరు మరియు వారు మాత్రమే బ్రహ్మనిర్వాణము పొందు గలరు. అంతేగాని బ్రహ్మచర్యమును ప్రదర్శిస్తూ లౌకిక కర్మలన్నీ ఆచరించు వారు బ్రహ్మచారులు కారు. వారిలో బ్రహ్మజ్ఞాన ప్రతిష్ఠ జరగదు. మోక్షానికి లేదా బ్రహ్మనిర్వాణమునకు అనర్హులు. వీరంతా కూడా దొంగ బ్రహ్మచారులని గ్రహించాలి. ఇట్టి దొంగ బ్రహ్మచర్యము లేదా ఆచరించలేని సాధనను ఎన్నుకోవడం కంటే, కర్మానుష్టాన మార్గంలో ఉంటూ ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించుటకు ప్రయత్నం చేయాలి. సాధన చేయాలి. తద్వారా బ్రహ్మత్వాన్ని పొందడం శ్రేష్ఠమైనది.

‘అన్తకాలేఽపి అన్త్యే వయస్యపి బ్రహ్మనిర్వాణం బ్రహ్మనిర్వృతిం మోక్షమ్ ఋచ్ఛతి గచ్ఛతి’ అన్త్యకాలమున, జీవి యొక్క చివరి క్షణంలో బ్రహ్మత్వాన్ని మరియు మోక్షాన్ని పొందు చున్నాడు. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు రెండు విధములైన సూచన ఇచ్చారు. మొదటిది ‘అన్తకాలేఽపి’ అనగా అన్త్యకాలం ఆసన్నమైనపుడు. రెండవది ‘అన్త్యే వయస్యపి – అన్త్యే వయస్ యపి ఇతి’. ఇవి రెండు భిన్నమైన సందర్భాలు. మొదటి సందర్భము ‘అన్తకాలేఽపి’ అనగా అన్త్యకాలం ఆసన్నమైన నాడు. అసలు అన్త్యకాలం అనునది ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? ఏ క్షణంలో, ఏ లిప్తలో మారకం సంభవిస్తుంది? ఇది ఒక బ్రహ్మ రహస్యము! పూర్వకాలం యోగులు వారి మారకాన్ని పసిగట్టి ముందుగానే ప్రకటించే వారు. వారిలో అత్యద్భుతమైన యోగ శక్తులు ఉండేవి. కాని ఈ రోజుల్లో, ఇన్ని విధములైన ప్రాపంచిక విషయములందు, పలు విధాలైన స్వార్థ పూరితమైన జీవనం గడిపే జ్యోతిషులు, సిద్ధాంతులు, యోగులు ఇత్యాది వారందరిలో కూడా అంత అద్భుతమైన యోగ విద్య, బ్రహ్మ జ్ఞానము లేదు. అందుకే ఈ రోజు మారకాన్ని ఎవరూ చెప్పజాలరు. ఒకవేళ చెప్పినా కూడా అది అసత్యమే! అని గ్రహించాలి. ‘మారకం’ ఉంది అని భయపెట్టి పూజలు, శాంతుల పేరుతో మన ధనాన్ని దోచుకునే ప్రయత్నమే అనే విషయం గ్రహించాలి. ఒకవేళ నిజంగా మారకం అనేది ఉంటే దాన్ని తప్పించగల శక్తి మానవ మాత్రులమైన మనకు లేదు. ఇది జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని తప్పుత్రోవ పట్టించి మారకం పేరుతొ భయపెట్టి ధనాన్ని దోచుకునే రోజులు ఇవి. కావున మారకం గూర్చి గాని, మృత్యువు గూర్చి గాని భయపడటం మన మూర్ఖత్వమే! అందుకే ‘అన్త్యకాలం’ అనేది ఎవరికీ తెలియదు. ఏ క్షణంలో నైనా మృత్యువు ముంచుకొని రావచ్చును. అందుకే రాబోయే క్షణంలో మృత్యువు ఆసన్నమైనా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలో మృత్యువు వస్తుందో తెలియదు కాబట్టి, ప్రతి క్షణం భగవన్నామ స్మరణ చేయాలి. నిరంతరం భగవన్నామ స్మరణలో ఉన్న జీవికి వారి జాతకంలో మారకాన్ని ప్రసాదించే గ్రహాలకు అట్టి శక్తి ఉండదు. అ క్షణం ఆ జీవి భగవన్నామ స్మరణ లో ఉండుట వలన అవి మారకాన్ని ప్రసాదించక, వాటికి చెందిన దశాన్తర్దశ గడిచిపోతుంది. పునః అట్టి మారక దశ వచ్చే వరకు కూడా ఆ జీవికి మారకం సంభవించదు. *కావున మారకం ఎప్పుడో తెలియని మనం ప్రతి క్షణం భగవన్నామ స్మరణలో గడపాలి. మనం గడిపే ప్రతి క్షణం కూడా ఆయన మనకు ప్రసాదించిన భాగ్యంగా పరిగణించాలి. అప్పుడే అన్త్యకాలం ఎప్పుడు ఆసన్నమైనా కూడా నిర్వాణానికి అర్హులం కాగలం*.

ఇక రెండవ స్థితి: ‘అన్త్యే వయస్యపి’ వయస్సు మీరిన పిమ్మట ముసలితనంలో వచ్చే మరణము. ఇది అత్యంత సహజమైన స్థితి. ముసలితనంలో శరీరంలోని అన్గాలన్నీ క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. చూపు తగ్గుతుంది, వినికిడి తగ్గుతుంది, కాళ్ళలో బలం ఉండదు. చేతులు మనం చేయమన్న పనులన్నీ చేయలేవు. గుండె జబ్బులు, శ్వాసకోశం జబ్బులు వస్తాయి. మధుమేహం రావచ్చు. జీర్ణ శక్తి తగ్గుతుంది. ఇత్యాది విధంగా శరీరంలోని అన్గాలన్నీటిలోని శక్తి క్రమక్రమంగా ‘ఉపసంహరతి’ ఉపసంహరించ బడుతుంది. చివరికి మృత్యువు వస్తుంది. ఆ విధంగా జీవుడు తన శరీరాన్ని వదిలే సమయంలో భగవన్నామ స్మరణ చేసిన చాలు వాడు మోక్షానికి అర్హుడు కాగలడు. కాని అది అసాధ్యం. జీవితాంతం మనిషి ఏ కోరికలు, ఆశలతో జీవించాడో అదే కోరికతో వాడు తప్పనిసరిగా మరణిస్తాడు. భగవంతుడిని పొందాలనే ఆశయం ఆశ తో జీవిస్తూ తదనుగుణంగా కర్మలను ఆచరించిన వాడే అన్త్యకాలంలో కూడా భగవంతుడి స్మరణలో ఉంటాడు. వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. ముసలితనం ఆసన్నమైనపుడే ఆధ్యాత్మికత మరియు భగవన్నామ స్మరణ చేస్తే సరిపోతుంది. జీవితాంతం ఎన్ని దిక్కుమాలిన పనులు చేసినా పర్వాలేదు అని అనుకునే వాడు, అవే దిక్కుమాలిన ఆలోచనలతో మరణిస్తాడు. *‘ముసలితనంలో రామ కృష్ణ అనుకుంటూ జీవించాలి’ అని అంటారు. అయ్యా! పిన్న వయస్సు నుండి ‘రామ కృష్ణ’ అని అనడం అలవాటు అయితే తప్ప వాడు ముసలితనంలో అనలేదు*. ముసలితనంలో శరీరంలో అన్గాలన్నీ కృశించి పోయినా వాడి మనస్సు మాత్రం యథేచ్ఛగా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. శరీరంలో ఏ అంగం పనిచేయక పోయినా కూడాను వాడిలో కోరికలు నశించకపోవచ్చు. అట్టి వాడి మనస్సులో లౌకికమైన కోరికలు మినహా భగవంతుడు ఉండే ఆస్కారం లేదు. వాడికి అన్త్యకాలం ఆసన్నమైన నాడు శ్రీ మహావిష్ణు మాయ వాడిని ఆవహించి అట్టి మాయలోనే వాడు మరణిస్తాడు. అట్టి మాయ వాడిని లౌకికమైన కోరిక లందు మాత్రమే విహరించు విధంగా చేస్తుంది. కావున జీవించిన ప్రతి క్షణం భగవన్నామ స్మరణ చేయాలి. తదనుగుణంగా కర్మాచరణ చేయాలి. ఇది ఒకేసారి జరిగేది కాదు. అభ్యాసం వలన మాత్రమే సాధ్యపడుతుంది. అభ్యాసం చేయడానికి తిథి వార నక్షత్రాలతో ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. ఈ క్షణమే ప్రారంభిద్దాము. ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి లేదు. అసలు భగవన్నామ స్మరణ చేయడానికి ముహూర్తం అవసరమే లేదు. ఈ మధ్యకాలం మితిమీరిన మూర్ఖత్వం తో పూజలు చేయడానికి కూడా సమయం చూసుకుంటున్నారు. భగవంతుడిని పూజించడానికి సమయం అవసరం లేదు. ఒక వివాహమూ, గృహ ప్రవేశము, ఉపనయనమూ, వ్యాపారమూ ఆరంభించడానికి ముహూర్తం కావాలి. కాని నిత్య పూజలు ఆచరించడానికి, దేవాలయాలయందు భగవద్దర్శనానికి, అర్చనలకు ముహుర్తమేమిటి?

అందుకే నిరంతర భగవన్నామ స్మరణ అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా అలవాటు గల వారు మాత్రమే వారి వృద్ధాప్యం లో ను మరియు అన్త్యకాలం లోను భగవన్నామ స్మరణ చేయగలరు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం – న్యాయేన మార్గేణ మహీం మహీశాః
గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం – లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।

"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः
गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।

నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి
नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

ప్లవనామ కార్తీక శుక్ల ఏకాదశి, ఇందువారం
15.11.2021