శ్రీ గణపతి విసర్జన

శ్రీ గణేశాయ నమః

శ్రీ మాత్రే నమః

శుభగ్రహాః

శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు

శ్రీ వినాయక విసర్జనం

వినాయక నిమజ్జనం ఏ రోజు చేయాలి? అనే అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 9 రాత్రులు పూజలు అందుకున్న గణపతిని పదవ రోజు ఉదయం నిమజ్జనం చేయాలి. కాని ఈ సంవత్సరం 10 వ రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి, శుక్రవారం లక్ష్మీ స్వరూపుడైన గణపతిని నిమజ్జనం చేయరాదని కొంతమంది పండితులు వాదిస్తున్నారు. కాని ఇది సరికాదు. ఈ సందేహ నివృత్తికే ఈ వ్యాసం:


గణపతి నవరాత్రి ఏ విధంగా జరపాలన్నదానికి ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రమాణాలు లేవు. కాని, నవరాత్రి నియమాలు ఉన్నాయి. ప్రధానంగా శరన్నవరాత్రి నియమాల గూర్చి ధర్మసింధు, నిర్ణయ సింధు ఇత్యాది ధర్మ శాస్త్ర గ్రంథాలలో వివరించ బడినది. అవే నియమాలు గణపతి నవరాత్రులకు కూడా వర్తిస్తాయి. నవరాత్రి ఉత్సవ ప్రారంభానికి, ఘట స్థాపన మరియు కలశ స్థాపనకు నియమాలు నిర్దేశించ బడినవి కాని, విసర్జనకు, ఉద్వాసనకు ఎక్కడా నియమం ఇవ్వబడలేదు.


ప్రధానంగా ఇప్పటి సందర్భంలో, 10 వ రోజు శుక్ర వారమగుట వలన, గణపతి లక్ష్మీ స్వరూపుడని అందుకే ఆయనను శుక్రవారం నిమజ్జనం చేయరాదని, గురువారం అనగా భాద్రపద శు త్రయోదశి నాడు ఉద్వాసన, విసర్జన చేయాలని ఒక వాదన వినబడుతున్నది. అది తప్పు. గణపతి విద్య, బుద్ధి మరియు జ్ఞాన కారకుడు కూడాను. అట్టి గణపతిని గురువారం నాడు విసర్జన చేయడం కూడా దోషమే అవుతుంది. ఇది ప్రజలను మూఢ విశ్వాసంలో నెట్టడమే. అందరి ఇళ్ళలో గణపతి ఉండనే ఉంటాడు. ప్రతినిత్యం పూజాదులను అందుకుంటూ ఉంటాడు.


అంతేకాదు, 08.09.2022 అనగా గురువారం నాడు విసర్జన చేస్తే గణపతి 8 రాత్రులు మాత్రమే పూజలను అందుకుంటాడు. ధర్మ సింధు ప్రమాణాన్ని అనుసరించి తిథి ద్వయం ఉన్న ఎడల న్యూనత్వం ఏర్పడిన సందర్భంలో పూజాదుల ఆవృత్తి చేయవలెనని సూచించు చున్నది. అనగా, క్షయించిన తిథి యొక్క పూజాదులను కూడా కలుపుకొని ఒకే రోజు రెండు సార్లు దేవి కి పూజాదులను అందించాలి. ఈ సూత్రం తిథి ద్వయం లేదా తిథి న్యూనత్వం కలిగిన ఎడల మాత్రమే వర్తిస్తుంది. ఈ సూత్రాన్ని గణపతి నవరాత్రులకు అన్వయించ లేము. గణపతి నవరాత్రులందు తిథి ద్వయం వలన న్యూనత్వం ఏర్పడినా కూడాను తొమ్మిది రాత్రులు స్వామి విధిగా పూజాదులను అందుకోవాలి.


ఇందులో గమనించాల్సిన విషయం మరొకటి ఉన్నది. భారతదేశంలో సింహభాగం ప్రాంతాలలో శ్రీ వినాయక నిమజ్జనం ‘అనంత చతుర్దశి’ నాడు చేస్తారు. ఆరోజు వారం గాని నక్షత్రం కాని చూడరు. మన హైదరాబాద్ లో కూడా ‘అనంత చతుర్దశి’ నాడే విసర్జన చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చాలా సందర్భాలలో గణపతి 10 రోజుల పూజలను కూడా అందుకుంటాడు. కావున, ఈ ఉత్సవాలన్నీ కూడా వారివారి ప్రాంతాచారాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. గతంలో చాలా సార్లు అనంత చతుర్దశి శుక్రవారం లేదా మంగళ వారం వచ్చి ఉన్నాయి. ఏ విధమైన సందేహం లేకుండా విసర్జన కూడా చేసి యున్నాము. ఇప్పుడు క్రొత్తగా సందేహ పడాల్సిన అవసరం కూడా లేదు.


అంతేగాని శుక్రవారం నాడు విసర్జన చేస్తే లక్ష్మీ క్షయమని భావిస్తే గురువారం విద్యా, బుద్ధి మరియు జ్ఞాన క్షయం అని భావించాలి. కాని, అది సరికాదు. ఈవిధంగా భావించడం శాస్త్ర సమ్మతం కాదు. పదవ రోజు ఏ తిథి అయినను, ఏ వారమైనను దోషము ఏమీ లేదు. లక్ష్మీ క్షయమని లేదా ఇతర క్షయాలని భావించ రాదు. మనం ఆచరించే పూజలో గల భక్తియే అన్నింటికంటే ప్రధానమైనది.


కావున 09.09.2022, శుక్రవారం నాడు నిమజ్జనమే శాస్త్ర సమ్మతము.


స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం –

న్యాయేన మార్గేణ మహీం మహీశాః

గో బ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం –

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు ।।


"स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां - न्यायेन मार्गेण महीं महीशाः

गोब्राह्मणेभ्यः श्षुभमस्तु नित्यं - लोकाः समस्ता सुखिनो भवन्तु" ।।


నమిలికొండ విశ్వేశ్వర శర్మ, సిద్ధాంతి

नमिलिकोण्ड विश्वेश्वर शर्म, सिद्धान्ति

శ్రీ గాయత్రి వేద విజన్

హన్మకొండ